iDreamPost
android-app
ios-app

విశ్లేషణ వ్యతిరేకం..! వివరాలు వాస్తవం..!!

విశ్లేషణ వ్యతిరేకం..! వివరాలు వాస్తవం..!!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పత్రికల స్టాండ్‌ పార్టీల వారీగా మారుతుంటుందని ప్రత్యేకంగా చెపాల్సినపని లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నిత్యం ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలు వస్తుండేవి. ఆ సమయంలో సాక్షి ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. ఏడాది క్రితం నుంచి వైసీపీ పాలన మొదలైంది. పత్రికలు తమ పనితీరును మార్చేశాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తుండగా.. సాక్షి ప్రభుత్వ అనుకూల కథనాలకు ప్రయారిటీ ఇస్తోంది.

ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాయడంలో ఈనాడు పత్రికతో పోల్చుకుంటే ఆంధ్రజ్యోతి దూకుడుగా ఉంది. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి రాయాలన్న తపన ఆ పత్రికలో వస్తున్న కథనాలను చూస్తే తెలుస్తోంది. కోడు గుడ్డు మీద ఈకలు పీకినట్లు, బొడి గుండుకు మోకాలికి ముడివేసినట్లు.. ఏదో విధంగా కథనం వండి వారుస్తోంది. దీని వల్ల తాము ఆశించిన ఫలితం వస్తుందని ఆంధ్రజ్యోతి యాజమన్యాం అనుకుటోంది. కానీ వాస్తవానికి ఆ వ్యతిరేక కథనాల వల్ల వైసీపీ ప్రభుత్వానికి మేలు జరుగుతోంది. వ్యతిరేక కథనం రాస్తున్న సమయంలో ఆంధ్రజ్యోతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటికి కేటాయించిన నిధులు పేర్కొంటూ విశ్లేషిస్తోంది. ఆయా గణాంకాలతో ప్రభుత్వం ప్రజలు ఏమి చేస్తుందో ఆంధ్రజ్యోతి చెప్పకనే చెబుతోంది.

తాజా ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఏపీ బడ్జెట్‌పై ఓ వ్యతిరేక కథనం రాశారు. ‘‘మహా సంక్షేమ మాయ’’ పేరుతో కేటాయింపుల్లో భారీగా కనికట్టు.. సంక్షేమ మేడిపండు పొట్ట విప్పితే మరకలే.. అన్ని వర్గాలకూ టోపీ.. అంటూ ఓ కథనం రాసింది. సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఆయా కులాల వారీగా విడివిడిగా చూపించడాన్ని తప్పు బడుతూ కథనం రాసుకొచ్చింది.

‘‘ పేదల కోసం అమలు చేసే 15 సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.37,500 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాది 7 సంక్షేమ పథకాల అమలుకు 24,710 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే.. ఈసారి 8 పథకాలు అదనంగా చేరాయి. కేటాయింపులు రూ.12,949 కోట్లు పెరిగాయి. వెరసి బడ్జెట్‌లో సంక్షేమ వాటా 16 శాతంపైనే.! పెన్షన్‌ కానుక, వైఎస్సార్‌ ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వైఎస్సార్‌ చేయూత, వసతి దీవెన, జగనన్న తోడు లాంటి అనేకానేక పథకాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ పథకాలు కులమతాలతో సంబంధం లేకుండా పేదలందరికీ వర్తించేవి. కానీ.. ఇందులోనే వర్గాల వారీగా లెక్కలు తీసి వారికి అందే లబ్ధిని విడిగా చూపించారు‘‘ అంటూ తన కథనంలో ఓ పేరా ఇలా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

ఈ పేర మినహా మిగతా కథనం అంతా తన విశ్లేషణతో నింపింది. కథనం అంతా ప్రతికూలంగా రాసిన ఆంధ్రజ్యోతి ఈ ఒక్క పేరలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తున్నట్లు గుర్తించలేదేమో గానీ వాస్తవాలు చెప్పకనే చెప్పింది. సీఎం జగన్‌ తాను ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి రాసిన వివరాలతో అర్థం అవుతోంది. 15 పథకాలు అమలు చేస్తున్నారంటూ వాటిలో కొన్నింటిని రాసుకొచ్చింది. వైఎస్సార్‌ నేతన్న హస్తం, వైఎస్సార్‌ వాహన మిత్ర లాంటి పథకాలను మాత్రం ప్రస్తావించలేదు.

కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అర్హతే ఆధారంగా పథకాలు ఇస్తామని సీఎం జగన్‌ చెబుతున్న మాట వాస్తవమే అనేలా.. ఆంధ్రజ్యోతి కూడా ‘‘ఈ పథకాలు కులమతాలకు అతీతంగా పేదలందరికీ అందేవి’’ అని చెబుతూ దీనికి మరింత బలం చేకూరేలా కొనసాగింపుగా ‘‘ ఇందులోనే వర్గాల వారీగా లెక్కలు తీసి వారికి అందే లబ్ధిని విడిగా చూపించారు’’ అంటూ పేర్కొంది. ఈ వాక్యంతో వైసీపీ ప్రభుత్వం అన్ని కులాల సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పకనే చెప్పింది. మొత్తం మీద ఆంధ్రజ్యోతి రాస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కథనాల వల్ల జగన్‌ సర్కార్‌కు మేలే జరుగుతోందని ఈ కథనం స్పష్టం చేస్తోంది.