iDreamPost
android-app
ios-app

ఉద్యోగుల మద్దతు ఆప్‌కే.. పోస్టల్‌ బ్యాలెట్లలో దూసుకెళుతున్న కేజ్రీవాల్‌ పార్టీ..

ఉద్యోగుల మద్దతు ఆప్‌కే.. పోస్టల్‌ బ్యాలెట్లలో దూసుకెళుతున్న కేజ్రీవాల్‌ పార్టీ..

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) దూసుకెళుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం నుంచీ ఆప్‌ స్పష్టమైన ఆధిక్యం దిశగా పయనిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్లలో ఆప్‌ ముందంజలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్‌ 50 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 14 స్థానాలు, కాంగ్రెస్‌ ఒక్క చోట ఆధిక్యంలో ఉన్నాయి. మరో ఐదు స్థానాల్లో కౌటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది.

2015 ఎన్నికల్లో ఆప్‌ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలు జరిగిన ఏడాది లోపే ఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరగ్గా ఆప్‌ 67 స్థానాలతో విజయదుందుభి మోగిచింది. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఇక ఆప్పటి వరకు దాదాపు 15 ఏళ్లపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌ బోణి కూడా కొట్టలేదు.

ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తుంటే ఆప్‌ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా మూడో సారి సీఎం పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. 2013లో కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్‌.. ఒడిదుడుకుల పాలన చేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నరలోపే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. 2015 ఎన్నికల్లో 67 సీట్లు గెలుచుకుని ఎవరీ అందనంత ఎత్తులో నిలిచారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆప్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం నాటికి ఫలితాల సరళి వెల్లడికానుంది.