iDreamPost
android-app
ios-app

కర్నూల్‌కు పొంచి ఉన్న పెను ముప్పు

కర్నూల్‌కు పొంచి ఉన్న పెను ముప్పు

మహమ్మారి కరోనా వైరస్ తో కర్నూలుకు పెను ముప్పు పొంచి ఉంది. కరోనా వైరస్ కారణంగా మరణించిన కేఎం హాస్పిటల్ డాక్టర్ కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో నగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. కరోనా నియంత్రణలో అహర్నిశలు కృషి చేస్తున్న అధికారుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.

కె ఎమ్ ఆస్పత్రిలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సదరు డాక్టర్ వద్దకు గత నెల 20వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు దాదాపు 1,150 మంది వైద్యం కోసం వచ్చారని అధికారులు గుర్తించారు. కర్నూలు నగరంతోపాటు గద్వాల, ఆలంపూర్ ప్రాంతాల నుంచి ప్రజలు సదరు డాక్టర్ వద్దకు వచ్చినట్లు గుర్తించారు. నేరుగా కలసిన 1150 మంది కాకుండా.. థర్డ్ పార్టీ కాంటాక్ట్ వేల సంఖ్యలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

కే ఎమ్ ఆసుపత్రి వ్యవహారంతో కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య అమాంతం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు వెలుగుచూసిన కేసుల సంఖ్య తో తాజాగా కర్నూలులో పాజిటివ్ కేసులు సంఖ్య 126 కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కె ఎమ్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సదరు ఆస్పత్రికి వెళ్లిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కర్నూలు నగరంలో ప్రముఖ ఆస్పత్రులలో కె.ఎమ్ ఆసుపత్రి ఒకటి. ఈ ఆస్పత్రిలో దాదాపు 70 ఏళ్ల సదరు డాక్టర్ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కర్నూలు నగరంలోని పాతబస్తీ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్, గద్వాల నుంచి కూడా ప్రజలు ఈ డాక్టర్ వద్దకు చికిత్స కోసం వస్తుంటారు. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు డాక్టర్ స్థానికంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే నాలుగు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడటం తో కుటుంబ సభ్యులు డాక్టర్ ను ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ నుంచి శాంపిల్స్ను సేకరించారు. మంగళవారం మరణించారు. ఫలితం వచ్చే వరకు సదరు డాక్టర్ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. మంగళవారం రాత్రి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు.

నిర్ధారణ ఫలితాల్లో సదరు డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలడం తో.. హుటాహుటిన అధికారులు అప్రమత్తంఅయ్యారు. అధికారులు ఊహిచినట్లుగానే డాక్టర్ కుటుంభంలో ఆరుగురికి కరోనా సోకింది. ఇక ఆయన వద్దకు వచ్చిన రోగులు, ఆ రోగులు కలసిన ఆస్పత్రి సిబ్బంది.. వారు కలసిన కుటుంబ సభ్యులు.. ఇలా ఈ లెక్క వేల సంఖ్యలో ఉంటుందనే ఆందోళన జిల్లా వ్యాప్తంగా నెలకొంది.