Idream media
Idream media
2019లో దాదాపు 180 సినిమాలు విడుదలైతే, దాంట్లో కనీసం పది శాతం కూడా హిట్ కాలేదు. మొత్తం లెక్కలు చూస్తే 14 సినిమాలు లాభాలు తెచ్చాయి. మిగిలినవన్నీ ప్లాప్. పెట్టుబడుల్లో పది శాతం వెనక్కి తెచ్చుకోలేని ఇండస్ట్రీని సిక్ ఇండస్ట్రీ అనాలి. ప్రస్తుతం తెలుగు సినిమా జబ్బు పడి ఉంది.
ఆడిన 14 సినిమాలు గమనిస్తే ఏమర్థమవుతుందంటే వాటిలో బలమైన కథ ఉంది. ఏమోషన్స్ ఉన్నాయి. సినిమాలు నాశనం కావడానికి ముఖ్యం కారణం ఏమంటే రచయితల మీద గౌరవం లేకపోవడం, కథపై అవగాహన ఉండకపోవడం. ఎంత టెక్నాలజీ పెరిగినా నేలమీదున్న కథల్నే జనం చూస్తారు గానీ, గాలిలో తేలే కథల్ని కాదు.దీనికి ఉదాహరణ సాహో. కోట్లు కుమ్మరించినా దాన్ని చూడలేదు. కారణం కథ లేకపోవడమే. F2 ని విరగబడి చూశారంటే ఆ కథ అన్ని ఇళ్లలో జరిగేదే కాబట్టి.
ఎంతసేపూ హీరో డేట్స్ గురించి ఆలోచన తప్ప, కథ పక్కాగా ఉందా లేదా అనే ఆలోచన లేదు. యూరప్‌లో షూటింగ్‌కి కోట్లు ఖర్చు పెడుతారు గానీ, రచయిత దగ్గరికి వచ్చేసరికి బడ్జెట్ ఉండదు. చాలా మంది నిర్మాతలు దర్శకుల దృష్టిలో రచయిత అంటే కృష్ణానగర్ అడ్డా కూలీలాంటి వాడు. ఏదో కాసింత విదిలించి పని చేయించుకుంటే చాలు. రైటర్ పొరపాటునా ఒక రూపాయి ఎక్కువ అడిగితే “రైటింగ్‌కి అంత బడ్జెట్ అనుకోలేదండి” అని అంటారు. పునాదిలేని బిల్డింగులు కట్టి కుప్ప కూలిపోతారు.
రచయితలుగా ఎవరూ ఉండకుండా డైరెక్టర్లు ఎందుకవుతారంటే చాలా మంది డైరెక్టర్లకి రచయితల్ని హింసించడం సరదా. వాళ్లకు ఏం కావాలో వాళ్లకే తెలియకపోవడం వల్ల “నా మైండ్‌లో ఉన్నది ఇది కాదండి” అని రాసిందే రాయిస్తారు. ఈ మధ్య తెలుగు రాని ఒక తమిళ డైరెక్టర్ దెబ్బకి రైటర్లు ఆస్పత్రిలో చేరారు.
ఒక డైరెక్టర్ ఉన్నాడు. ప్రతివాడితో ఒక వెర్షన్ రాయిస్తాడు. ఆఫీస్ బాయ్‌ని కూడా వదలడు. “ఏ పుట్టలో ఏ పాముందో!” అంటాడు. వాడి మైండ్‌లో ఏమీలేక పాముల కోసం వెతుకుతాడు. ఒకవేళ రచయితలు, డైరెక్టర్ చచ్చీచెడీ కథ తయారు చేస్తే హీరో దాంట్లో కాలు , వేలు పెట్టి కాక్‌టెయిల్ చేస్తాడు. కథ మొత్తం హీరో చుట్టూనే తిరగాలి. క్యారెక్టర్ యాక్టర్లకు ఇంపార్టెన్స్ ఉంటే నచ్చదు. ఒకప్పుడు ANR, NTR వెలిగారంటే చుట్టూ SVR, గుమ్మడి, రాజనాల, నాగభూషణం లాంటి మహానుభావులు ఉండడమే కారణం.
దీనికి తోడు రచయితలకి , టెక్నీషియన్లకి డబ్బు ఎగ్గొట్టడానికే సినిమాలు తీసే చరిత్రకారులున్నారు. అడ్వాన్స్ ఠంచన్‌గా ఇస్తారు. మిగిలింది
వసూలు చేయడం దేవుడి వల్ల కూడా కాదు.
చెత్తలో నుంచి చెత్తే పుడుతుందని ఈ నేపథ్యంలో అక్షరాలు రాని రచయితలు కూడా పుట్టుకొస్తున్నారు. ఒక్క పుస్తకం చదవరు. చలం అంటే సినిమా యాక్టర్ అనుకుంటున్నారు.
బుచ్చిబాబు అంటే ANR సినిమా పేరుగానే తెలుసు. సినిమాలు చూసి సినిమాలు రాయడానికి వస్తారు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జించినట్టు బుర్రలో విషయం లేకుండా కొరియన్, టర్కీ సినిమాలు విసర్జిస్తుంటారు.
90 శాతం సినిమాలు ఎందుకు పోతున్నాయో తెలుసుకోకుండా సినిమా పెద్దలు ఉపన్యాసాలు ఇస్తుంటారు. బేసిక్‌గా సమస్య ఎక్కడంటే జనంతో సంబంధం కోల్పోయిన వాళ్లు ఈ రంగంలో ఎక్కువగా ఉన్నారు. బయటకి వెళితే కారులో, దూర ప్రాంతాలకైతే విమానాల్లో వెళ్లే వాళ్లకి నేల మీద నడిచే మనుషులు అర్థం కారు. అయితే సినిమాలు ఎక్కువగా చూసేది వాళ్లే.
మట్టిని అర్థం చేసుకున్న వాడి పంటే పండుతుంది.