iDreamPost
android-app
ios-app

ఒక్క శివ – తొమ్మిది దెబ్బలు – Nostalgia

ఒక్క శివ – తొమ్మిది దెబ్బలు – Nostalgia

ఏ స్టార్ హీరోకైనా కెరీర్ బెస్ట్ అనిపించి వాళ్ళ జీవితాన్నే కాదు ఇండస్ట్రీ గమనాన్ని మార్చేసిన సినిమా ఒకటుంటుంది. చిరంజీవికి ఖైదీ, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు, వెంకటేష్ కు బొబ్బిలి రాజా ఇలా ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా వీటికి ఉన్న మైల్ స్టోన్ అనే పేరు మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అలా అక్కినేని నాగార్జునకు శివ ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని పడికట్టు సూత్రాల ప్రకారమే నడుస్తున్న తెలుగు సినిమాకు డెబ్యూతోనే కొత్త గ్రామర్ నేర్పించిన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. తర్వాత ఆయన ఎన్ని హిట్స్ ఇచ్చినా శివ స్థానాన్ని ఏవీ తీసుకోలేకపోయాయి.

ఇక నాగార్జున గురించి చెప్పేదేముంది. అప్పటిదాకా ఒక రకమైన ఇమేజ్ తో నెట్టుకొస్తున్న నాగ్ ని శివ ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. అయితే వరం వెనుకే శాపం అన్న తరహాలో శివలో నాగార్జున విశ్వరూపం చూసాక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటి మీద ప్రేక్షకులు విపరీతమైన అంచనాలు పెట్టుకోవడం మొదలుపెట్టడంతో ఒకటి కాదు ఏకంగా 9 ఫ్లాపులు చవిచూడాల్సి వచ్చింది. శివ తర్వాత కొద్దిగ్యాప్ లో వచ్చిన సినిమా ‘ప్రేమ యుద్ధం’. నాగ్ అమలతో జట్టు కట్టిన ఈ మూవీలో మంచి పాటలు ఉంటాయి. కన్నడ దర్శకుడు రాజేంద్రసింగ్ కు ఇచ్చిన అవకాశం వృధా అయ్యింది. ఫలితం శూన్యం. ఆ తర్వాత కృష్ణంరాజు గారి కాంబినేషన్ లో క్రాంతికుమార్ దర్శకత్వంలో చేసిన ‘నేటి సిద్ధార్థ’ తేడా కొట్టేసింది. స్టూడెంట్ లీడర్ గా చూసిన కళ్ళతో నాగ్ ని మాఫియా డాన్ గా చూడలేకపోయారు. ఆ తర్వాత నాన్న ఏఎన్ఆర్ తో కలిసి చేసిన ‘ఇద్దరూ ఇద్దరే’ కూడా బోల్తా కొట్టింది.

ఆపై నిర్ణయం, చైతన్య, శాంతి క్రాంతి, జైత్రయాత్ర, కిల్లర్, అంతం దాకా ఇదే ప్రహసనం కొనసాగింది. మధ్యలో హిందీ వెర్షన్ శివ హిట్టయ్యింది కానీ అది టాలీవుడ్ కౌంట్ లోకి వేసుకోలేం. కొన్ని జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా నాగ్ రేంజ్ హిట్స్ అయితే కాలేదు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాంతో నాగార్జున తిరిగి సక్సెస్ ల బాట పట్టారు. మాస్ లో దాని వల్లే మళ్ళీ బ్రాండ్ పెరగడం మొదలయ్యింది. శివ తర్వాత ఇతర బాషా దర్శకులతో నాగ్ చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే ట్రాక్ మార్చి 1992 నుంచి విజయాలను అందుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఇండస్ట్రీ హిట్ వచ్చిన ఆనందం ఒక్కోసారి ఇలా అంచనాలు పెంచేసి దెబ్బలు తినేలా చేస్తుంది. దానికి శివ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి