iDreamPost
iDreamPost
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమరావతిలోనే రాజధాని ఉండాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు అందుకు అనుగుణంగా అరకొరగా కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నారు.
అదే సమయంలో జనసేన మాత్రం ఎక్కడయినా ఒక్క చోటే రాజధాని పెట్టాలని డిమాండ్ చేసి, ఆ వెంటనే అమరావతికి వెళ్లి రాజధాని ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించడం ద్వారా ఈ విషయంలో కూడా ఆపార్టీకి స్పష్టత లేదనే అభిప్రాయం కలిగించింది. బీజేపీ మాత్రం రెండు పడవల మీద కాలువేసినట్టు కనిపిస్తోంది. రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని చెబుతూ, అమరావతిలో ఆందోళనలు చేపట్టింది. చివరకు లెఫ్ట్ పార్టీలలో కూడా అమరావతి కదిలిస్తే అగ్గిపుట్టిస్తామని సీపీఐ చెబుతుంటే, అసలు రాజధాని సమస్య ఈ స్థాయికి రావడానికి చంద్రబాబు , జగన్ కారకులేనని విమర్శలు గుప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు పలుమార్లు అదుపుతప్పుతున్నారు. అది చిరవకు ఆయనకే తీవ్ర నష్టాన్ని తెస్తోంది. ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. ఆ క్రమంలోనే నిపుణుల కమిటీకి సారధ్యం వహించిన జీఎన్ రావు మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు జీఎన్ రావు ఓ గ్రూప్ వన్ ఆఫీసర్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా అజయ్ కల్లాం చెప్పినట్టు రాసి ఇచ్చిన నివేదిక అంటూ మండిపడ్డారు. పూర్తిగా భోగస్ అని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు జీఎన్ రావు స్పందించారు. చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టారు. ఆయన భ్రాంతిలో ఉన్నారని మడ్డిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. తాము రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడి, నివేదికలు పరిశీలించామన్నారు. ప్రతీ జిల్లాల్లోనూ ప్రజలతో నేరుగా మాట్లాడిన తర్వాత నివేదిక సిద్ధం చేశామన్నారు. 13 జిల్లాల ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా నివేదిక రూపొందించామన్నారు. మానవాభివృద్ధి సూచికలు, ప్రాంతీయ ప్రత్యేక పరిస్థితులు అన్నీ పరిగణలోకి తీసుకుని సమగ్రాభివృద్ధికి నివేదిక తయారుచేసినట్టు వెల్లడించారు. ఎవరో చెబితే నివేదిక రూపొందించామనడంలో అర్థరహితమంటూ తమ రిపోర్టులో ఎవరి ప్రమేయం లేదని జీఎన్ రావు తెలిపారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటికే దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ని ఆయన ఏకవచనంతో దూషించిన తీరు తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. చంద్రబాబు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు, పలు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు అలా అనలేదని, ఆయన మాటలను వక్రీకరించారని టీడీపీ చెబుతోంది. ఈ వ్యవహారం కూడా ముదురుతుందని తాజా పరిణామాలు చాటుతున్నాయి. దాంతో చంద్రబాబు వ్యవహారంతో చివరకు అధికారుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది.