iDreamPost
android-app
ios-app

BCG రిపోర్ట్ – సమగ్రాభివృద్దే లక్ష్యం

  • Published Jan 04, 2020 | 3:04 AM Updated Updated Jan 04, 2020 | 3:04 AM
BCG రిపోర్ట్ – సమగ్రాభివృద్దే లక్ష్యం

రాజధాని వికేంద్రీకరణకు అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎన్ రావు కమిటీతో పాటు బోస్టన్ కమిటీ కూడా రాజధాని వికేంద్రీకరణకు మొగ్గుచూపింది. నిన్న అమరావతిలో సీఎం జగన్‌కు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీ సమర్పించింది. ఆ నివేదికలో ఏపీ అభివృద్ధి, రాజధానిపై ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

దేశంలో బహుళ రాజధానులున్న రాష్ట్రాలపైన, ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాలలో జరిగిన నూతన రాజధాని నగర నిర్మాణాల ప్రగతి మీద అధ్యయనం చేసిన బీసీజీ కమిటీ.. ఆయా నగరాల,దేశాల,రాష్ట్రాల అభివృద్ధిని నివేదికలో వివరించారు. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణను సైతం నివేదికలో ప్రస్తావించారు. అంతేకాదు అమరావతి ప్రాంత అభివృద్ధి వ్యూహాన్ని నివేదికలో సూచించింది బీసీజీ. ఏయే రంగాల్లో పెట్టబడులు పెట్టాలి.. వికేంద్రీకరణకు ప్రభుత్వం ఏం చేయాలన్న వివరాలను వివరించారు. అభివృద్ధి సూచికల వారీగా జిల్లాల పరిస్థితి వివరించారు. వ్యవసాయ, పర్యాటక, పరిశ్రమ, మత్స్య రంగాల అభివృద్ధిని నివేదిలో పేర్కొన్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ నివేదికలపై త్వరలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం జనవరి 20 తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మూడు రాజధానుల అంశంపై ప్రకటన చేసే అవకాశముంది.

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై బీసీజీ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను, అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి., చాలా ప్రదేశాల్లో పర్యటించి నివేదిక ఇచ్చింది. ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై కొన్ని సూచనలు కమిటీ చేసింది. అవి..

13 జిల్లాలు.. ఆరు ప్రాంతాలుగా..

13 జిల్లాల రాష్ట్రాన్ని 6 ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయాలని బీసీజీ సూచించింది.

ఉత్తరాంద్ర 3 జిల్లాలు.,
గోదావరి డెల్టా 2 జిల్లాలు,
కృష్ణా డెల్టా 2 జిల్లాలు.,
దక్షిణాంధ్రలో ప్రకాశం, నెల్లూరు.,
తూర్పు రాయలసీమ.,
పశ్చిమ రాయలసీమలుగా వర్గీకరించింది.

ఎకానమీ., ఇండస్ట్రీ., సర్వీసెస్, అగ్రికల్చర్, సోషల్ సెక్టార్‌లలో అధ్యయనం చేసింది. ఎకానమీలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నా., దక్షిణాదిన అతి తక్కువ GSDP ఉన్న రాష్ట్రం ఏపీ అని తేల్చింది. రాష్ట్రానికి ప్రస్తుతం 2.25లక్షల కోట్ల అప్పుల భారం రాష్ట్రానికి ఉందని గుర్తు చేసింది.

ఆరు విభాగాలుగా ప్రభుత్వ కార్యాలయాలు..

హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేసింది. మూడు ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేసే విధంగా రెండు అప్షన్లను సూచించింది.

మొదటి ఆప్షన్ లో…

విశాఖలో సెక్రటేరియెట్‌., గవర్నర్‌, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్‌ ఫ్రా., టూరిజం,
ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు అసెంబ్లీ., హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి.

విజయవాడలో అసెంబ్లీ., ఎడ్యేకేషన్‌., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ రాజ్, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి.

కర్నూలులో ప్రధాన హైకోర్టు., స్టేట్ కమిషన్స్‌., క్వాజీ జుడిషియల్ బాడీస్ పెట్టాలి. ఇందు కోసం 4,645 కోట్లు ఖర్చు అవుతుంది.

రెండవ ఆప్షన్ …

విశాఖలో సెక్రటేరియట్‌., గవర్నర్‌., సీఎం., ఆల్‌ హెచ్‌ఓడిలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలి. అమరావతిలో అసెంబ్లీ., హైకోర్టు బెంచ్ ఉంచాలి.
కర్నూలులో ప్రధాన హైకోర్టు., స్టేట్ కమిషన్స్‌., క్వాజీ జుడిషియల్ బాడీస్ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం 2500-3వేల కోట్లు ఖర్చు అవుతుందని బీసీజీ అంచనా వేసింది.

పారిశ్రామిక రంగం లో 7 జిల్లాలు వెనుకబాటు..
పారిశ్రామిక రంగంలో 7జిల్లాలు పూర్తిగా వెనుక బడి ఉన్నాయి. రాష్ట్ర జివిఏ 32వేల కోట్లు కాగా సగటు 37వేల కోట్లు. కృష్ణా-గోదావరి బేసీన్‌లో మాత్రమే 50శాతం అగ్రి ఉత్పత్తి లభిస్తోంది. పర్యాటక ప్రాంతాలు ఉన్నా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రైల్., రోడ్ కనెక్టివిటీలు ఉన్నా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లలో విశాఖ ఒక్కటే సేవలు అందిస్తోంది. కృష్ణపట్నం., విశాఖ పోర్టులు మాత్రమే పనిచేస్తున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి., కృష్ణా, కడప, కర్నూలులో పరిశ్రమలు లేవు. గోదావరి., కృష్ణా డెల్టాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పశ్చిమ గోదావరి., కృష్ణా మాత్రమే ముందున్నాయి.

అవకాశం ఉన్న పర్యాటకం నిల్..
పర్యాటక రంగంలో ఏ మాత్రం పురోగతి లేదు. పర్యాటక రంగంలో 0.3 మిలియన్ ఫుట్‌పాల్‌ మాత్రమే ఏపీలో ఉంటే కేరళలో 1.6 మిలియన్ ఉంది. అవకాశాలు ఉన్నా పర్యాటక రంగం వృద్ధి చెందలేదు. రాష్ట్రంలో జాతీయ రహదారులు ఉన్నా., కొన్ని మండలాల నుంచి హైవేలకు నాలుగు గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. పోర్ట్‌ కనెక్టివిటీలో రవాణాకు 8-12 గంటల ప్రయాణ సమయం పడుతోంది

జాతీయ సగటు లో రాష్ట్రం…
ఉత్పత్తి లో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు తక్కువగా ఉంది. జిఎస్‌డిపిలో ఏపీలో 1.6లక్షలు మాత్రమే ఉంది. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో మిగిలిన దక్షిణాది రాష్ట్రాలకంటే వెనుకబడి ఉంది. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా, విశాఖ. నెల్లూరు మాత్రమే ముందున్నాయి. రుణ భారం 2.5లక్షల కోట్లు ఉండటం వల్ల వాటికి వడ్డీలు చెల్లించడం ఖజానాకు భారంగా మారింది.

ఎక్కడ ఏమి పెట్టాలి..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనలాటిక్స్‌ డేటా హబ్, మెడికల్ సర్వీసెస్ వృద్ధి చేయొచ్చు. సర్వీసెస్‌ రంగంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయొచ్చు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి పూర్తి చేయాలి. గోదావరి డెల్టాలో పెట్రో కెమికల్స్‌., సోలార్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు అభివృద్ధి చేయొచ్చు. కృష్ణాజిల్లాలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ అభివృద్ధి చేయొచ్చు. విద్యా రంగానికి కృష్ణా-గుంటూరు జిల్లాలను హబ్‌గా మార్చవచ్చు. దక్షిణాంధ్రలో లెదర్‌., షిషరీస్‌ ఇండస్ట్రీలు అభివృద్ధి చేయొచ్చు. కడప, చిత్తూరు జిల్లాలలో స్టీల్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. కోల్డ్ స్టోరేజీలు., ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి.

అభివృద్ధిలో సమతుల్యత..
అన్ని ప్రాంతాల సమతుల్యత ఉండేలా నివేదిక లో సిపార్సులు చేసింది. అనంతపురం, చెన్నై., కడప, నెల్లూరు వైపుల నుంచి ఎక్స్‌ప్రెస్‌ మార్గాలు ఏర్పాటు చేయాలి. గోదావరి-కృష్ణా బేసిన్‌లను పెన్నాతో అనుసంధానిస్తే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి 60వేల కోట్లు, ఉత్తరాంద్ర సుజల స్రవంతికి 16వేల కోట్ల అంచనా వేసింది. రాయలసీమలో కాల్వల అభివృద్ధికి 23వేల కోట్ల అవసరమని అంచనా వేసింది. లక్షా 76వేల కోట్లతో రాష్ట్ర్రంలో అన్ని ప్రాంతాలకు సాగు., తాగునీరు అందించే ప్రణాళిక రూపొందించింది.

నగరాల అభివృద్ధికి భారీ ఖర్చు..
రాజధాని ఎలా అభివృద్ధి చేయాలో బీసీజీ సిఫార్సులు చేసింది. మెగాసిటీలు రీజినల్ ఎకనామిక్ గ్రోత్‌కు ఉపకరిస్తాయని పేర్కొంది. లండన్ 22శాతం., టోక్యో 32., బ్యాంకాక్‌ 25 శాతం అయా దేశాల్లో జిడిపిని అందిస్తాయి. అంతర్జాతీయ నగరాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం. కొత్తగా నగరాన్ని నిర్మించాలంటే యూఏఈలో సగటున 10వేల మందికి 4.2 బిలియన్ డాలర్లు ఖర్చైంది. ధొలేరా సిటీలో 10వేల మందికి 0 .5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.


అమరావతి లో జనాభా వృద్ధి నిల్.. 1972 నుంచి 2013 వరకు నిర్మించిన 32 నగరాలను బీసీజీ అధ్యయనం చేసింది. 32నగరాల్లో 2 మాత్రమే విజయవంతం అయ్యాయి, మిగిలిన కొత్త నగరాలు విఫలమయ్యాయి. షంజూన్‌., ముంబై నగరాలు మాత్రమే అంచనాలకు తగ్గట్లు అభివృద్ధి చెందాయి. అమరావతిలో 2025 నాటికి 1.5 నుంచి 2 మిలియన్ జనాభా అవుతుందని అంచనా వేశారు. పదేళ్లలో 0.8 మిలియన్‌., 25 ఏళ్లలో 1.5 మిలియన్ జనాభాను అంచనా వేశారు. 3ఏళ్లలో అమరావతి జనాభా 0.3 మిలియన్ అవుతుందని మొదట అంచనా వేశారు. ప్రస్తుతం అమరావతి జనాభా 1.2లక్షలు మాత్రమేనని తెలిపింది. అంచనాలకు తగ్గట్లుగా అక్కడ జనాభా వృద్ధి చెందలేదని తేల్చింది. 

అమరావతికి 1.10 లక్షల కోట్లు కావాలి…
అమరావతికి 1.1లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే మాత్రమే ఆ స్థాయిలో అభివృద్ధి సాధ్యమని బిసిజి అంచనా వేసింది. 1.1లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలంటే ఆ మొత్తానికి ఏడాదికి 8-10వేల కోట్లు అప్పులుగా చెల్లించాలి. ప్రభుత్వానికి ఉండే 8వేల ఎకరాలలో 3వేల ఎకరాలు ప్రభుత్వం వాడుకుని. ప్రభుత్వానికి మిగిలే 5వేల ఎకరాలను, ఎకరా 20కోట్లకు అమ్మితేనే నిర్మాణం సాధ్యం. ఎకరా 20 కోట్లకు అమ్మాలంటే 15 ఏళ్ల తర్వాతనే సాధ్యం. పెట్టుబడులు.,రాబడులు లెక్కలో 8-10వేల కోట్ల ఆదాయాన్ని సృష్టించాలి. ఆ ఆదాయం కూడా అప్పులకు చెల్లించాల్సి ఉంటుంది.

లక్ష కోట్లు ఇరిగేషన్ రంగంలో పెడితే..
లక్షా పదివేల కోట్లు ఓ నగరం కోసం వెచ్చించాలా, అభివృద్ధి కోసం వెచ్చించాలో రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని బీసీజీ సూచించింది. 40సంవత్సరాల తర్వాత ఆదాయం కోసం లక్ష కోట్లు అమరావతిలో పెట్టుబడిగా పెట్టాలి. లక్ష కోట్లు పెట్టుబడి ఇరిగేషన్‌ రంగంలో ఐదేళ్లలో పెడితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా ఎక్కువ ఆదాయాన్ని సృష్టించొచ్చని తెలిపింది. 2.25 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రంలో లక్ష కోట్ల నగరం ఖర్చు చేయడం కంటే అన్ని ప్రాంతాల అభివృద్ధికి వెచ్చించడం మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రధాన వాణిజ్య నగరాల అభివృద్ధికి 40-60 ఏళ్లు పట్టింది. అప్పటికే మనుగడలో ఉన్న నగరాలకు అనుబంధ నగర లు మాత్రమే వృద్ధి చెందాయి.

డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ సరైంది..
చారిత్రక నేపథ్యం ఆధారంగా 1953లో మద్రాసు నుంచి విడిపోవడం, 1956., 1937, 2014 పరిణామాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ అయితే ఏపీకి బాగుంటుంది. ఒక ప్రాంతంపై మరో ప్రాంతానికి ఉన్న అనుమానాల నేపథ్యంలో వికేంద్రీకరణ మంచిది. ప్రాంతీయ అకాంక్షలను బ్యాలన్స్‌ చేస్తూ., చారిత్రక నేపథ్యానికి న్యాయం చేయాలి. రాజధానులు జనసమర్ధ నగరాలు కాకుండా ఉండేలా జాగ్రత్తలు వహించాలి. సౌత్ ఆఫ్రికాలో మూడు ప్రాంతాల్లోమూడు రాజధానులు ఏర్పాటు చేశారు. కర్ణాటక- ఉత్తర కర్ణాటక., మహారాష్ట్ర- విదర్భలలో ప్రాంతీయ ఉద్యమాలతో ప్రత్యేక అసెంబ్లీలు పెట్టారు. తూర్పు-పశ్చిమ జర్మనీల ఏకీకరణ సమయంలో రాజధానులు బెర్లిన్‌, బాన్‌లలో ఉంచారు. సౌత్ అఫ్రికా, మలేషియా, చిలీ, జర్మనీ, సౌత్ కొరియా దేశాల్లో రాజధానుల వికేంద్రీకరణ జరిగింది. దేశంలో ఏడు రాష్ట్రాల్లో యూపీ, కేరళ, ఉత్తరాఖండ్, ఒడిసా, మధ్యప్రదేశ్ వంటి చోట వేర్వేరు నగరాల్లో పాలన సాగుతోంది. న్యాయ., శాసన., పరిపాలన వ్యవస్థల మధ్య సమన్వయం చేయడంపై దృష్టి పెట్టాలి.

అమరావతి గ్రీన్ ఫీల్డ్ విఫలమవుతుంది..
ప్రపంచంలో 32 గ్రీన్ ఫీల్డ్ రాజధానులను అధ్యయనం చేసిన అమరావతి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది ఫ్లాప్ అవుతుందని బీసీజీ అభిప్రాయపడింది. ‘గ్రీన్ ఫీల్డ్ నగరాల కాన్సెప్ట్‌కు వెళ్లినప్పడు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. పదివేల మంది ప్రజలు నివసించే నగరానికి మౌలిక వసతులు కల్పించడానికి తక్కువలో తక్కువ 0.5 బిలియన్ డాలర్లు అత్యధికంగా 4.2 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.

యూఏఈలో ఓ నగరానికి 10వేల మందికి మౌలిక వసతులు కల్పించడానికి 4.2 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. దక్షిణాఫ్రికాలో ఓ నగరానికి 2.5 బిలియన్ డాలర్లు ఖర్చయింది. భారత్‌లో డొలేరా నగరానికి 0.5 బిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వచ్చింది. చైనాలోని షెంజిన్, భారత్‌లోని నవీ ముంబై మాత్రమే కొత్త నగరాలుగా అభివృద్ధి చెందాయి. నవీ ముంబై అనేది ముంబైకి ఆనుకుని ఉండడం వల్ల, షెంజిన్ అనేది హాంగ్ కాంగ్‌కు దగ్గరగా ఉండడం వల్ల మాత్రమే అభివృద్ధి చెందాయి. లండన్, టోక్యో, దుబాయ్, సింగపూర్ లాంటి నగరాలు అభివృద్ధి చెందడానికి 40 నుంచి 60 ఏళ్లు పట్టింది. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.1.10 లక్షల కోట్ల వ్యయం అవుతుంది అప్పుడు

2045 నాటికి అనుకున్న వృద్ధి సాధిస్తుంది. అయితే, లక్ష కోట్ల రుణం తీసుకొస్తే అందుకు ప్రతి ఏటా రూ.8వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తుంది. అదే సమయంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద భూములు అమ్మి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తే, 5వేల ఎకరాలను ఎకరం రూ.20 కోట్ల చొప్పున విక్రయిస్తే అప్పుడు రూ.లక్ష కోట్లు నిధులు సమకూరుతాయి
కానీ, ఎకరం రూ.20 కోట్ల చొప్పున విక్రయించాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుందని బీసీజీ తెల్చి చెప్పింది.

మొత్తం మీద గత ప్రభుత్వం చెప్పిన స్థాయిలో అమరావతి నిర్మాణం,ఎదుగుదల సాధ్యం కాదన్న విషయం బీసీజీ నివేదికను పరిశీలిస్తే అర్ధం అవుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు తో అభివృద్ధి వికేంద్రికరణ వల్ల రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని స్పష్టమవుతోంది.

బీసీజీ నివేదిక మీద మంత్రుల హైపర్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర భవిషత్తుకు సంబంధించి మైక్రో లెవెల్ అంశాలతో ప్రపంచవ్యాప్తంగా గత 50 సంవత్సరాలలో జరిగిన నగర నిర్మాణాల ప్రగతి,వాటి లక్ష్య సాధనలోని పురోగతి వివరాలతో రాజధాని నిర్మాణ అంచనాలను వాస్తవిక దృక్పధంతో వివరంగా ఇచ్చిన బీసీజీ నివేదిక ను ప్రభుత్వం ప్రజలలోకి తీసుకెళ్ళాలి.బీసీజీ రిపోర్టును, ప్రభుత్వ ఆలోచనను చర్చకు పెట్టాలి…