Nagendra Kumar
చాలా మంది ఇవ్వాళరేపు రచయతలే దర్శకులుగా మారిపోతున్నారు. అసలు రైటర్స్ డైరెక్టర్స్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు?
చాలా మంది ఇవ్వాళరేపు రచయతలే దర్శకులుగా మారిపోతున్నారు. అసలు రైటర్స్ డైరెక్టర్స్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు?
Nagendra Kumar
తొలి రోజుల్లో ఈ ట్రెండ్ లేదు. రచయితలకు ఇవ్వాల్సిన అగ్రతాంబూలం రచయితలకిచ్చి, వారి చేత ఏం రాయించుకోవాలో అది చెప్పుకుని, వారు రాసిందానిని మహాప్రసాదంలా భావించేవారు. కానీ దర్శకులే కథలు చెప్పే ట్రెండ్ దాసరి నారాయణరావుతో ప్రారంభమైన నాటినుంచి తెలుగులో రచయితలకి గడ్డు పరిస్థితే వచ్చింది. కోడి రామక్రిష్ణ దానిని సక్సెస్ ఫుల్ గా నడిపించారు. కాకపోతే ఆయన రాసుకున్నదానికైనా ఓక రచయతని మాత్రం ఆ పదవిలో కూర్చోబెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంకుశం సినిమాకి ఆయనే డైలాగులు రాసుకున్నా, టైటిల్స్ లో మాత్రం తన పేరు వేసుకోలేదు. హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆ విషయాన్ని రివీల్ చేశారు. దాదాపు 30 సంవత్సరాలు పరుచూరి బ్రదర్స్ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని కొనసాగించారు రచయితలుగా. వారి కార్డ్ మీద ఫైనాన్స్ కూడా స్థాయిని ఎంజాయ్ చేశారు. దాదాపు 500ల సినిమాలకి సత్యానంద్ కూడా తనదైన మార్కెట్ ని నిలుపుకున్నారు. కొంత వరకూ పోసాని క్రిష్ణ మురళీ కూడా అదే కోవలో కొనసాగగలిగాడు. కానీ రచయితలకుండే తలనొప్పులు ఇన్నీ అన్నీ కావు. దర్శకనిర్మాతలను ఒప్పించేసరికి వాళ్ళ ప్రాణాలు పోతాయి. సున్నితంగా అర్ధం చేసుకునేవారైతే సరేసరి. లేకపోతే రచయితల పాట్లు కుక్కపాట్లే.
అందుకే చాలా మంది ఇవ్వాళరేపు రచయతలే దర్శకులుగా మారిపోతున్నారు. ఒకటో రెండో పరుచూరి బ్రదర్స్ డైరెక్ట్ చేసినా వాళ్ళ రైటింగ్ మార్కెట్ వాళ్ళని ఎక్కువ సినిమాలు చేయనివ్వలేదు. విజయేంద్రప్రసాద్ అయితే కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే పరిమితమైపోతున్నా, అడసాదడపా మెగాఫోన్ పట్టుకుంటుంటారు. ఇందులో విజయభాస్కర్ సినిమాలకి రచయితగా మంచి హిట్స్ కి భాగస్వామ్యం వహించిన రచయిత త్రివిక్రమ్ దర్శకుడితో పడలేకనే రైటర్ డైరెక్టర్ గా తన దారి తాను చూసుకుని హవా చలాయించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు హయ్యస్ట్ పెయిడ్ రైటర్ డైరెక్టర్ గా పెద్ద రేంజ్ లోనే చలామణి అవుతున్నాడు.డైరెక్టర్లే డైలాగులు రాసుకోవడం, తుదిమెరుగులు దిద్దమని మాత్రమే పురమాయించడంతో రచయితలు ఆత్మాభిమానం దెబ్బతిని సున్నితంగా తప్పుకుంటున్నారు. గొప్పగొప్ప సినిమాలకు డైలాగులు రాసిన రచయితలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొనడం చాలా విచిత్రంగా కనబడుతుంది.
బుర్రా సాయిమాధవ్ పేరు చెబితే ఇప్పుడు ఎలాటి సినిమాలు గుర్తొస్తాయి? ఓ మహానటి, ఓ శాతకర్ణి, ఓ త్రిబుల్ ఆర్.. ఇలా ల్యాండ్ మార్క్ సినిమాలే బుర్రా రాశారు. అయనకి కూడా డైలాగు రచయితగా ఓ రేంజ్.. ఓ ర్యాంకూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జెట్ పిక్చర్ అనుకున్న కల్కి, మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్టు అనుకున్న దిల్ రాజు గేమ్ ఛేంజర్ కూడా ఆయన రాస్తున్నవే. కానీ ఆయనకి కూడా కొందరు దర్శకుల కారణంగా అగచాట్లు తప్పడం లేదని, అందుకే కొన్ని భారీచిత్రాల నుంచే బుర్రా తప్పుకుంటున్నట్టు వినిపిస్తోంది. గాయకుడు వేరు. సంగీత దర్శకుడు వేరు. అలాగే గీత రచయిత వేరు. ఎవరి గ్రేట్ నెస్ వాళ్ళది. ఒకరి పని వేరొకరు చేయలేరు. అలాగే దర్శకులు వేరు. డైలాగు రచనా నైపుణ్యం వేరు. ఆ రోజుల్లో దర్శకులు ఎంత గొప్పవాళ్ళైనా, ఆత్రేయగారు పెట్టిన కష్టాలన్నీ తట్టుకుని మరీ నిగ్రహంతో ఆయన చేత రాయించుకునేవారు. అందుకే ‘’ రాసి ప్రేక్షకులని, రాయక దర్శకనిర్మాతలని ఏడిపిస్తాడు’’ అని ఆత్రేయగారికి గొప్ప పేరుండేది. వేళకి, క్రమశిక్షణతో రాసిచ్చే రచయితలకే ఏడుపులు తప్పడం లేదిప్పుడు. కాలమహిమ