తెలుగు సినీ ప్రేక్షకులకు ఉన్నంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదని చెప్పొచ్చు. టాలెంట్ ఉంటే చాలు.. వాళ్లు ఏ భాషకు చెందిన వారనేది ఇక్కడి ఆడియెన్స్ పట్టించుకోరు. ప్రతిభ కలిగిన ఫిలిం మేకర్స్, యాక్టర్స్‌ను మనోళ్లు బాగా ఆదరిస్తారు. వాళ్లకు నచ్చితే స్టార్లను చేసేస్తారు. అందుకే ఇతర చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రేక్షకుల ఆదరణతో పాటు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తారని హైదరాబాద్‌కు మకాం మార్చే స్టార్లు ఎందరో ఉన్నారు. తెలుగులో స్టార్డమ్ సంపాదించిన వారిలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరని చెప్పొచ్చు.
రవితేజ్ ‘క్రాక్’, అల్లరి నరేష్ ‘నాంది’, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో తెలుగు నాట మంచి క్రేజ్ తెచ్చుకున్నారు వరలక్ష్మి. ఆమె ఒక సినిమాలో నటిస్తున్నారంటే అందులో తన పాత్రతో పాటు కథ, కథనాలు బాగుంటాయనే నమ్మకం ఆడియెన్స్‌కు కలిగేలా చేశారు. తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ సంపాదించిన ఈ నటికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగుతో పాటు ఇతర సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీకి ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు.
వరలక్ష్మీ శరత్‌కుమార్ దగ్గర చాన్నాళ్లుగా పీఏగా పనిచేస్తున్న ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో కీలక నిందితుల్లో ఒకరిగా ఉన్నట్లు కొచ్చి పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లతో అతడు సంబంధాలు కలిగి ఉన్నట్లు పక్కా ఆధారాలు పోలీసులకు లభించాయట. దీంతో ఆదిలింగంను ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతడ్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బులను అతడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారని తెలుస్తోంది.
ఆదిలింగంకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను విచారించాలని అనుకుంటున్న ఎన్ఐఏ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు. వరలక్ష్మీకి పీఏగా పనిచేసిన ఆదిలింగం గతంలో చాలాసార్లు ఆమెకు డ్రగ్స్ ఇచ్చాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల్ని మూవీ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆమె సహకరించారనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరెవరితో ఆదిలింగం టచ్‌లో ఉన్నాడో తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారని సమాచారం. ఆదిలింగంకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టడం కోసమే ఎన్ఐఏ అధికారులు వరలక్ష్మీకి నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.