iDreamPost
android-app
ios-app

Ramya Krishna: అమ్మోరు, శివగామి, గ్లామర్ క్వీన్ అన్నీ ఆమె! రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్!

  • Published Sep 14, 2024 | 1:39 PM Updated Updated Sep 14, 2024 | 1:39 PM

Ramya Krishna Birthday Special: హీరోయిన్ మెుదలుకొని విలన్ గా, తల్లిగా చేసి ఆడియెన్స్ ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం..

Ramya Krishna Birthday Special: హీరోయిన్ మెుదలుకొని విలన్ గా, తల్లిగా చేసి ఆడియెన్స్ ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఆమె పుట్టినరోజు సందర్బంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం..

Ramya Krishna: అమ్మోరు, శివగామి, గ్లామర్ క్వీన్ అన్నీ ఆమె! రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్!

చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది కథానాయకలు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ.., వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. తమ నటనతో, అందంతో ఆడియెన్స్ మదిని దోచుకుంటారు. రోజులు గడుస్తున్నా గానీ.. వారి అందం పెరుగుతూ ఉంటుందే తప్ప తగరదు. అలా వన్నెతగ్గని అందంతో కుర్రాళ్ల కలల రాణిగా నిలిచింది ఓ ఎవర్ గ్రీన్ హీరోయిన్.. ఆ అందం పేరే రమ్యకృష్ణ. హీరోయిన్ మెుదలుకొని విలన్ గా, తల్లిగా చేసి ఆడియెన్స్ ను ఫిదా చేసిన అరుదైన నటి రమ్యకృష్ణ. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తూ.. సెప్టెంబర్ 15న 54వ పడిలోకి అడుగుపెడుతోంది ఈ బ్యూటీ. ఆమె బర్త్ డే సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం.

చిత్ర పరిశ్రమ అంటే చాలా మందికి హీరోలే గుర్తుకు వస్తారు. కానీ.. ఆ హీరోల ఇమేజ్ ను దాటేసి ఓ హీరోయిన్ ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు తన అందం, నటనతో ఏలింది.. ఆమె ఎవరో కాదు.. ఎవర్ గ్రీన్ బ్యూటీ రమ్యకృష్ణ. 1970 సెప్టెంబర్ 15న తమిళనాడులో జన్మించింది.  ఇక 1985లో వచ్చిన ‘భలే మిత్రులు’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. అయితే కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు చేసినప్పటికీ.. ఆమెకు సరైన అకాశాలు రాలేదు. ఈ క్రమంలో 1992లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘అల్లుడు గారు’ చిత్రంతో రమ్యకృష్ణ కెరీర్ టర్న్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి. అప్పటి నుంచి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్నో మూవీస్ చేసింది. దాదాపు అవన్నీ సూపర్ హిట్లుగానే నిలిచాయి. దాంతో ఈ బ్యూటీ ఉంటే సినిమా హిట్టు అన్న సెంటిమెంట్ మేకర్స్ లో కలిగింది.

ఇక 1990 నుంచి 2000 సంవత్సరం వరకు ఒక దశాబ్దం మెుత్తం సౌత్ ఇండస్ట్రీని తన అందం, నటనతో ఊపేసింది. అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే మిగతా హీరోయిన్లు వెళ్తున్న మూస పద్ధతిలో వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఆమె చూపిన ధైర్యమే. 1995లో వచ్చిన అమ్మోరు సినిమాలో అమ్మోరుగా నటించి అందరికీ షాకిచ్చింది. వరుస హిట్ సినిమాలతో కెరీర్ దూసుకెళ్తున్న టైమ్ లో ఇలాంటి పాత్ర ఎంచుకోవడం అంటే కెరీర్ ను రిస్క్ లో పెట్టడం లాంటిదే. ఇతర హీరోయిన్స్ చేయలేని ఈ రిస్క్ ను చేసి తన ప్రత్యేకతను ఘనంగా చాటుకుంది. ఇక అమ్మోరు తర్వాత ఆమె అన్నీ అలాంటి పాత్రలే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. తన విలక్షణతను చాటుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ క్వీన్ గా వెలుగొందింది. రమ్యకృష్ణ నుంచి ఈ మేకోవర్ ఎవ్వరూ ఊహించలేదు. తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిగా వెండితెరను ఓ ఊపు ఊపింది.

నీలాంబరి పాత్రతో మరో మెట్టు పైకి

రమ్యకృష్ణ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పాత్ర ‘నీలాంబరి’. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘నరసింహ’ మూవీలో ఆమె యాక్టింగ్ కు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తికాదు. ఆమె యాక్టింగ్ కు ఇండస్ట్రీ మెుత్తం షేక్ అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో రజినీకాంత్ కు ధీటుగా నటించింది. తనదైన లేడీ విలనిజంతో ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టించింది. నీలాంబరి పాత్ర రమ్యకృష్ణను నటిగా మరో మెట్టును పైకి ఎక్కించిందనే చెప్పాలి. ఆమె కెరీర్ లో నీలాంబరి రోల్ ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది.

నీలాంబరి పాత్ర తర్వాత ఆమెకు మళ్లీ అంతటి పేరు తెచ్చిపెట్టిన పాత్ర ఏదైనా ఉందంటే అది ‘శివగామి’ పాత్రే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ లో రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరో నటిని మనం ఊహించుకోలేము. అంతలా ఆ ప్రాత్రలోకి పరకాయప్రవేశం చేసి నటించింది. ‘నా మాటే శాసనం’ అన్న డైలాగ్ కు ఇండస్ట్రీ మెుత్తం షేక్ అయ్యింది. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీగా మారింది. హీరోల డామినేషన్ ఉన్న కాలంలో హీరోలనే డామినేట్ చేసిన హీరోయిన్ గా శివగామి నిలిచింది. అమ్మోరు నుంచి శివగామిగా మధ్యలో గ్లామర్ క్వీన్ గా రాణించి.. ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ.. ఇలాంటి మరెన్నో పాత్రలు చేయాలని ఆశిస్తూ.. ఆమెకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.