Venkateswarlu
Venkateswarlu
ఈ మధ్యకాలంలో జనం సహజ సిద్ధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తినే తిండి దగ్గరినుంచి ఇతర జీవన విధానాలు కూడా సహజ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రసాయనాలు లేని పంటల్ని పండించుకోవటం జరుగుతోంది. అయితే, కొంతమంది మరో అడుగు ముందుకు వేస్తున్నారు. సహజత్వం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ భార్యాభర్తల జంట సాధారణ కాన్పుకోసం పరితపించింది. ఈ నేపథ్యంలోనే మహిళ ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, ధర్మపురి జిల్లాలోని అనుమతపురం గ్రామానికి చెందిన మహేష్, క్రిష్ణగిరి జిల్లా, పులియంబట్టి గ్రామానికి చెందిన లోకనాయకి భార్య భర్తలు. వీరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ అగ్రికల్చర్ డిగ్రీ చేసి ఉండటంతో సహజ సిద్ధంగా పంటలు పండించటంపై మక్కువ పెరిగింది. అందుకే బియ్యం, కూరగాయలు, పండ్లు ఎలాంటి మందులు వాడకుండా పండిస్తున్నారు. వాటినే తింటున్నారు. కొన్ని నెలల క్రితం లోకనాయకి గర్బం దాల్చింది. ఆమె తనకు సాధారణ కాన్పు కావాలని కోరుకుంటూ ఉంది. ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకోకుండానే బిడ్డను కనాలని భర్తకు ఎప్పుడూ చెడుతూ ఉండేది. ఈ నేపథ్యంలోనే డెలివరీ డేట్ దగ్గరపడటంతో లోకనాయకి.. మహేష్‌తో కలిసి పుట్టింటికి వెళ్లింది.
15 రోజులుగా అక్కడే ఉంటోంది. భర్త యూట్యూబ్‌లో చూసి సాధారణ కాన్పు కోసం ప్రయత్నించసాగాడు. వారు అనుకున్నట్లుగానే ఆమె పండంటి మగ బిడ్డకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా జన్మనిచ్చింది. అయితే, బలవంతంగా కాన్పు చేయటంతో బిడ్డతో పాటు బొడ్డు పేగు కూడా బయటకు వచ్చేసింది. దీంతో తీవ్ర రక్త స్రావం అవ్వసాగింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకనాయకి మరణించింది. నర్సు ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో పాటు ఇతర కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.