మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. TDP మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్‌

టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం ఆయనని అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. సత్యనారాయణమూర్తి కొన్ని రోజుల క్రితం.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో.. ఆయనపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మహిళా మంత్రి అనే గౌరవం లేకుండా.. ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని జనాలు మరీ ముఖ్యంగా మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్‌ సైతం ఆయనపై మండిపడింది.ఈ నేపథ్యంలో పలువురు బండారుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

అయితే ముందుగా పోలీసులు సత్యనారాయణకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన తన ఇంటి తలుపులు ముసివేసి.. ఎవరూ ఇంట్లోకి రాకుండా హడావుడి చేశారు. ఇక ఇదే సమయంలో బండారు సోదరుడు సింహాద్రిరావు.. హైకోర్టును ఆశ్రయించారు. హౌస్‌మోషన్‌ ద్వారా అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే ఈలోపు పోలీసులు బండారు సత్యనారాయణమూర్తికి నోటీసులు అందజేశారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. అలాగే సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయనపై కేసు నమోదు చేశారు.

Show comments