iDreamPost

sarkaru vaari paata review సర్కారు వారి పాట రివ్యూ..

sarkaru vaari paata review సర్కారు వారి పాట రివ్యూ..

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా అందులోనూ రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత వస్తోందంటే అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు సైతం ఉత్సాహం ఉండటం సహజం. దానికి తోడు కళావతి పాట చార్ట్ బస్టర్ కావడం, పోకిరి రేంజ్ లో ఉంటుందని యూనిట్ పదే పదే ఊరించడం లాంటివి అంచనాలను పెంచేశాయి. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే కనిపించడంతో బుకింగ్స్ జోరందుకున్నాయి. పర్లేదనే టాక్ వస్తే చాలు బాక్సాఫీస్ ని తన కంట్రోల్ లోకి తీసుకునే ప్రిన్స్ కు ఈసారి పోటీ లేకుండా పోయింది. మరి సర్కారుతో సోలోగా వచ్చి హిట్టు అందుకున్నాడా లేక పాట శృతి తప్పి జారిపడ్డాడా రివ్యూలో చూద్దాం

కథ

చిన్నప్పుడే అప్పుల వల్ల తల్లితండ్రులను కోల్పోయిన మహీ(మహేష్ బాబు)పెద్దయ్యాక అమెరికా వెళ్ళిపోయి అక్కడ వడ్డీ వ్యాపారం పెట్టుకుంటాడు. చదువు కోసమని తన దగ్గరకు వచ్చిన కళావతి(కీర్తి సురేష్)ని చూడగానే ప్రేమిస్తాడు. కట్ చేస్తే అదంతా అబద్దమని తెలిసి బాకీ వసూలుకై ఇండియాలో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్(సముతిరఖని)తో గొడవ పెట్టుకుంటాడు. తన డబ్బులు రాబట్టుకోవడం కోసం వైజాగ్ వస్తాడు. అక్కడి నుంచి అతన్ని ముప్పతిప్పలు పెడుతూ బ్యాంకుల్లో జరుగుతున్న లోన్ అక్రమాల గురించి తవ్వి తీస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు, చివరికి ఏమయ్యిందనేది అసలు స్టోరీ

నటీనటులు

మహేష్ బాబు ఎనర్జీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో పోకిరి, దూకుడు దర్శకులు రికార్డుల సాక్షిగా చూపించారు. ఇందులోనూ తన కొత్త మేకోవర్ తో ఫ్యాన్స్ ని అలరించడంలో బాబు ఫెయిల్ కాలేదు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో, యాక్షన్ బ్లాక్స్ లో తననుంచి ఎక్స్ పెక్ట్ చేసేది పూర్తిగా ఇచ్చాడు. మరీ అదరహో అనిపించేలా కాదు కానీ డాన్సుల్లోనూ మెప్పించాడు. యాభైకి దగ్గరలో తన వయసు ఉందంటే నమ్మకశక్యం కానంత గ్లామర్ ని మైంటైన్ చేయడంలో మహేష్ ని మించినవారు లేరు. ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కాకపోతే క్లాసులు పీకే సీన్లలో రొటీన్ అవుతున్నాడు.

కీర్తి సురేష్ చాలా గ్యాప్ తర్వాత గ్లామరస్ రోల్ లో కనిపించింది. అందంగా ఉంది. కాకపోతే తనను మరీ ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో చూసి అలవాటు కావడం వల్ల కాబోలు ఈ కళావతి క్యారెక్టర్ లో మిస్ మ్యాచ్ గా ఫీలవుతాం. పైగా తనతో నడిపించిన ట్రాక్ సోసోగా ఉండటం మైనస్. ఎక్కువ బిల్డప్ ఇచ్చారు కానీ సముతిరఖని చేసిన ఎంపి పాత్ర పరమ రొటీన్. ఎన్నోసార్లు వచ్చిందే చూసిందే. వెన్నెల కిషోర్ ఎంత మొనాటనీ అవుతున్నాడో మేకర్స్ గుర్తించడం లేదు. మహేష్ మంజ్రేకర్, నదియా, సుబ్బరాజులకు తలా కాసిన్ని సీన్లు వచ్చాయి. భరణి, పోసాని, ప్రభాస్ రాజు తదితరులు అలా వచ్చి ఇలా మాయమయ్యేవారే

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు పరశురామ్ కి మంచి స్టోరీ సెన్స్ ఉంది. అది సోలోతో మొదలుపెట్టి గీత గోవిందం దాకా అన్నిట్లోనూ చూడొచ్చు. ఆ సినిమాలు అంత చక్కగా రావడానికి కారణం అవి చేసే టైంకి ఆ హీరోలు స్టార్లు కాకపోవడం. కానీ సర్కారు వారి పాట విషయానికి వస్తే ఇతను మహేష్ బాబనే శిఖరమంత ఇమేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని ఒత్తిడికి గురయ్యాడనే విషయం ఫస్ట్ హాఫ్ లోనే అర్థమైపోతుంది. ఎంత మహేష్ బాబు ఉన్నా మాములు ఎంటర్ టైన్మెంట్ తో గంటన్నర ఎంగేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ పరశురామ్ ఆ రిస్క్ చేశాడు. ప్రమోషన్ లో ఘనంగా చెప్పుకున్న హీరో హీరోయిన్ ట్రాక్ దగ్గర నుంచే గ్రాఫ్ చప్పగా సాగుతుంది.

గత కొంతకాలంగా మహేష్ మాస్ ని పూర్తిగా సంతృప్తి పరచని సెటిల్డ్ క్యారెక్టర్స్ చేసిన మాట వాస్తవం. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యుండొచ్చు కాక. కానీ తమ హీరోని ఒక్కడు టైపు వింటేజ్ స్టైల్ లో చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. పరశురామ్ టార్గెట్ చేసింది కూడా వాళ్లనే. అలా అనుకుంటే రాత కంటే తీత బలంగా ఉండాలి. ఇక్కడే పరశురామ్ తడబడ్డాడు. వీక్ రైటింగ్ ని ఎలివేషన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు కొంతవరకే కాపాడుతాయి. వాటి మీదే ఆధారపడి కథా కథనాలు లైట్ తీసుకుంటే వచ్చే ఫలితాలు అంచనాలను దెబ్బ తీస్తాయి. అందుకే హీరోయిజం మీదున్న ఫోకస్ మిగిలిన వాటి మీద మిస్ అయ్యింది.

ఇందులో మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింటే బలహీనంగా ఉంది. వేలకోట్ల ఆస్తులు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న పెద్దమనిషిని ఒకడొచ్చి నువ్వు నాకు పది వేల కోట్లు బాకీ ఉన్నావంటే మీడియా గుడ్డిగా నమ్మేస్తుంది. అతనూ ట్రాప్ లో పడతాడు. కనీసం ఏదీ ఆధారం చూపించు అని అడగడు. ఆఖరికి నరేంద్రనాథ్ కంపెనీ బోర్డ్ అఫ్ డైరెక్టర్లు సైతం మీదే తప్పని తేల్చేస్తారు. అంటే టీవీ మైకు ముందు ఎవరైనా వచ్చి మన రాష్ట్ర ఎంపి నాకో వంద కోట్లు బాకీ ఉన్నాడంటే నమ్మేస్తామా. ఇలాంటి ఎపిసోడ్లతో నేలవిడిచి సాము చేయడంతో మిగిలినదంతా సరైన దిశా నిర్దేశనం లేకుండా సాగుతుంది. ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచినా మిగిలినవాళ్లుకు ఇదంతా సరిపడదు.

సరే ఇది కమర్షియల్ ఎంటర్ టైనర్ కాబట్టి లాజిక్స్ కాసేపు పక్కనపెడదాం. కానీ హీరో క్యారెక్టరైజేషనే తప్పుల తడకగా ఉంది. సెకండ్ హాఫ్ లో రికవరీ ఏజెంట్లను చావచితక బాదే మహీ సాబ్ కేవలం పది వేల డాలర్ల కోసం కళావతి చెంప మీద కొట్టి ఆమె మీద కాలు కూడా ఎత్తుతాడు. మరి బ్యాంక్ వాళ్ళ ప్రవర్తన తప్పైతే అతను చేసింది ఏమిటి. ఇలాంటి ప్రశ్న పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీయదా. దానికి తోడు కనీసం రెండు మూడు సార్లు మహేష్ బాబుతో క్లాసులు పీకిస్తేనే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడతారనుకున్నాడో ఏమో కొరటాల శివ టైపులో పదే పదే మహీతో లెక్చర్లు ఇప్పించడం బాగా విసుగు తెప్పిస్తుంది. లెన్త్ పెంచడానికి మాత్రమే పనికొచ్చాయివి.

నిజానికి పరశురామ్ తీసుకున్న సెలబ్రిటీ లోన్ కాన్సెప్ట్ బాగుంది. కానీ దాన్ని హుందాగా సీరియస్ గా చెప్పాలి. శంకర్ కథకు కొరటాల శివ స్క్రీన్ ప్లే రాసి దాన్ని మారుతీతో డైరెక్ట్ చేయించినట్టు అంతా ఖంగాళీ అయ్యింది. ఇక్కడ చెప్పిన ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంది. దాన్ని దాటి బయటికి వచ్చి ప్రయోగాలు తీస్తే దెబ్బ తింటారు. కానీ పరశురామ్ అలాంటి స్టైల్ ఏదీ అలవర్చుకోలేదు. కమర్షియల్ అంశాలను మిక్సీ కొట్టేసి పైసా వసూల్ చేయించాననుకున్నాడు కానీ కొత్తగా ఏమైనా చేస్తున్నానా అని ఆలోచించలేదు. కీర్తి సురేష్ సుబ్బరాజులతో మహేష్ చేసే కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

సర్కారు వారి పాట బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్పడం కాదు ఉద్దేశం. ఇంత పెద్ద స్టార్ రెండున్నర సంవత్సరాల తర్వాత సినిమా చేస్తున్నాడు, దానికి నాలుగు వందల రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తున్నాం అన్నప్పుడు ఎవరికైనా కనీస అంచనాలు ఉంటాయి. పరశురామ్ పెన్ను దగ్గరే లెక్క తప్పడంతో అది స్క్రీన్ మీదకొచ్చేసరికి ఇంకోలా అయిపోయింది. స్టార్ల మార్కెట్ మీటర్ ని, ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని సరిగా బ్యాలన్స్ చేసుకుని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోకపోతే తిరస్కారం ఏ స్థాయిలో ఉంటుందో ఆచార్య నిరూపించింది. ఇది మరీ అంత దారుణం కాదు కానీ బయటికి వస్తున్న ప్రేక్షకుడికి సంతృప్తి కలగనప్పుడు సక్సెస్ దక్కనట్టే

తమన్ మీద బరువు ఎక్కువవుతున్నట్టు ఉంది. దాన్ని మోయలేక జారిపడుతున్నాడు. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే తప్ప మేజిక్ చేయలేడని మరోసారి అర్థమైపోయింది. రెండు పాటలు మినహాయిస్తే బిజిఎంలో ఎక్కడ తమన్ ముద్ర కనిపించదు. మది ఛాయాగ్రహణం స్టాండర్డ్స్ మరోసారి ప్రూవ్ అయ్యాయి. మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. ఇలాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ఇంత కలర్ ఫుల్ గా రావడంలో వీళ్ళ పాత్ర కీలకం. మార్తాండ్ కె వెంకటేష్ గారి ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో చేతులెత్తేసింది. మైత్రి జిఎంబి 14 రీల్స్ సంయుక్త నిర్మాణ విలువలు మూడు బ్యానర్ లు కాబట్టి రాజీ ప్రస్తావన అవసరం పడలేదు

ప్లస్ గా అనిపించేవి

మహేష్ బాబు
ప్రొడక్షన్ వేల్యూస్
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

కీర్తి సురేష్
కామెడీ
సిల్లీ స్టోరీ
సెకండ్ హాఫ్

కంక్లూజన్

మంచి కథ కోసం కాంబినేషన్ కోసం ఏళ్ళ తరబడి విలువైన సమయాన్ని త్యాగం చేస్తున్న మహేష్ బాబు లాంటి హీరో నుంచి ఓ రేంజ్ సినిమాని ఆశించడం తప్పేమి కాదు. పైగా ఇన్నేసి కోట్లు ఖర్చయ్యాయని సాకుగా చూపిస్తూ అధిక రేట్లను టికెట్ల రూపంలో పిండేస్తున్నప్పుడు తనకు పైసా వసూల్ కావాలని ప్రేక్షకుడు కోరుకుంటాడు. అది ఓ మోస్తరు స్థాయిలో జరిగినా ఒప్పుకోడు. ఫ్లాప్ అనేస్తాడు. సర్కారు వారి పాట లాంటి వాటికి ఉన్న రిస్క్ ఇదే. బొటిక్ షాప్ నడుపుకునే వ్యక్తికి ఉన్నట్టుండి మిలిటరీ హోటల్ నడపమని చేతికిస్తే అతనేం చేస్తాడు. అదెలా అనే డౌట్ వస్తే ఓ టికెట్ కోనేయండి. అంచనాలకు ఎవరినీ బాధ్యులను చేయకుండా

ఒక్క మాటలో – శృతి కుదరని పాట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి