iDreamPost
android-app
ios-app

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ రివ్యూ

  • Published Mar 25, 2022 | 10:18 AM Updated Updated Dec 11, 2023 | 11:34 AM
RRR Movie Review : ఆర్ఆర్ఆర్ రివ్యూ

గత కొన్నేళ్లలో బాహుబలి స్థాయిలో ఒక సినిమా జనంలో విపరీతమైన ఉద్వేగాలను కలుగజేసి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేలా చేసింది ఆర్ఆర్ఆరే. గత రెండేళ్లలో కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడినప్పటికీ ఏ మాత్రం ఆసక్తి తగ్గకుండా అంతకంతా హైప్ పెంచుకుంటూ పోయిన ఈ మల్టీ స్టారర్ విజువల్ గ్రాండియర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. థియేటర్ల వద్ద కనివిని ఎరుగని పండగ వాతావరణం నెలకొంది. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తన ఇద్దరు హీరోలతో తిరిగిన రాజమౌళి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఇది స్వాతంత్రం రాకమునుపు జరిగిన కథ. పాటలు బాగా పాడే అటవీ జాతి పాపను బ్రిటిషర్లు తమతో తీసుకెళ్లి కోటలో బందీని చేస్తారు. తనను విడిపించడం కోసం మారు పేరుతో ఢిల్లీకి వెళ్తాడు భీమ్(జూనియర్ ఎన్టీఆర్). ప్రమాదకరమైన అతని దూకుడు తెలిసిన అధికారులు భీమ్ ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే రామరాజు(రామ్ చరణ్)ని నియమిస్తారు. అయితే ఇద్దరి మధ్య అనుకోకుండా బలమైన స్నేహం ఏర్పడుతుంది. నిజం తెలిశాక శత్రుత్వం మొదలవుతుంది. ఆసలు రామ్ ఆంగ్లేయులకు విధేయుడిగా ఎందుకు పని చేశాడు, భీమ్ లక్ష్యం నెరవేరిందా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు సినిమా

నటీనటులు

నట వారసులకు ఎంత గొప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా స్టార్ డం తెచ్చుకునేందుకు అదొక్కటే సరిపోదని చరిత్ర చాలాసార్లు ఎన్నో ఉదాహరణలతో రుజువు చేస్తూనే ఉంది. అందుకే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఏదీ అంత తేలిగ్గా తీసుకోరు. మూడేళ్లు చాలా విలువైన కాలం. రెమ్యునరేషన్లు ఎంతొచ్చాయనేది పక్కన పెడితే ఈ గ్యాప్ లో ఈజీగా నాలుగైదు సినిమాలు చేసే అవకాశం ఉంది. కానీ దాన్ని పక్కనపెట్టి మరీ రాజమౌళి మీద నమ్మకంతో ఇంత త్యాగానికి సిద్ధపడటం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇద్దరు సమాంతర హీరోలు కలిసి నటించాలంటే అర్థం లేని ఈగోలతో ఏవో ఆలోచనలు చేసి తల బద్దలు కొట్టుకునే వాళ్లకు ఒక దారి చూపించారు.

ముందు రామ్ చరణ్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ చూశాక రంగస్థలంలో పెర్ఫార్మన్స్ మర్చిపోవడం లాంఛనమే. అంత గొప్పగా ప్రాణం పోశాడు. బ్రిటిష్ ఫోర్స్ లో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు, భీమ్ తో చేతులు కలిపాక తన లక్ష్యాన్ని మార్చుకున్నప్పుడు అద్భుతమైన పరిణితి కలిగిన నటనతో అభిమానులను ఉర్రూతలూగించాడు. సెకండ్ హాఫ్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో చేసిన విన్యాసాలకు థియేటర్ సీట్లో కుదురుగా కూర్చోవడం చాలా కష్టం. ఎమోషనల్ సీన్స్ లోనూ బెస్ట్ అనిపించాడు. తన గత సినిమా వినయ విధేయ రామలో నటించింది ఈ రామ్ చరణేనా అనిపించేలా కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. మళ్ళీ రిపీట్ అయితే అదృష్టమే.

కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసిన తీరు నభూతో నభవిష్యత్తు. స్క్రీన్ మీద తనతో పాటు ఇమేజ్ లోనూ ఫాలోయింగ్ లోనూ సమఉజ్జి అయిన హీరో పోటీ పడుతున్నప్పుడు తనకు ధీటుగా ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల డామినేట్ చేసేలా ఇది తారక్ కే సాధ్యం అనిపించేలా తాతయ్య బాబాయ్ లను మరిపించడం అతిశయోక్తి కాదు. చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలను పండించడంలో తానెంత మెచ్యూర్డ్ యాక్టరో నిరూపించాడు. ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఎక్స్ప్రెషన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకత్వాన్ని అద్భుతంగా ఒలికించి బెస్ట్ అనిపించాడు.

హీరోయిన్ అలియా భట్ ది చాలా పరిమిత పాత్ర. ఉన్నంత సేపు మెప్పించింది ఒప్పించింది. ఒలీవియా మోరిస్ కి పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదు. సముతిరఖని బాబాయ్ గా పర్ఫెక్ట్ ఛాయస్. అజయ్ దేవగన్ ని సరిగా వాడుకోలేదు. శ్రేయకు అంతగా స్కోప్ దక్కలేదు. రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల వాళ్ళ పాత్రల పరిధి మేరకు రెండు మూడు సీన్లలో కనిపించారు అంతే. బ్రిటీష్ ఆఫీసర్లుగా నటించిన వాళ్ళను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ సహజంగా ఉన్నారు. ఇంతకు మించి ప్రధాన క్యాస్టింగ్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. జస్ట్ టూ మెన్ షోని ఎంజాయ్ చేస్తూ పోవడమే

డైరెక్టర్ అండ్ టీమ్

ఇండియన్ స్పిల్ బర్గ్, టాలీవుడ్ జేమ్స్ క్యామరూన్ అనే ఉపమానాలు ఎన్ని వాడినా జక్కన్నగా అందరూ పిలుచుకునే రాజమౌళి ఆలోచనా శక్తిని మరో దర్శకుడు అందిపుచ్చుకోవాలంటే అది కలలోనే సాధ్యమేమో. మర్యాదరామన్న లాంటి లో బడ్జెట్ మూవీతో మొదలుపెట్టి ఇప్పటి ఆర్ఆర్ఆర్ దాకా మాస్ పల్స్ ని ఒడిసిపట్టుకుని తాను చెప్పాలనుకున్న విషయాన్ని గ్రాండియర్ రూపంలో పదే పదే చూడాలనిపించే స్థాయిలో రిజిస్టర్ చేయడం ఆయనకే సాధ్యం. చదువుకుని చూస్తే ఒక మాములు జానపద కథలా అనిపించే బాహుబలి లాంటి సినిమాలను చైనా జపాన్ దేశాల్లోనూ ఎగబడి చూసేలా చేశారంటే అది ఆయన టేకింగ్ మహత్యం.

ఆర్ఆర్ఆర్ కథలో చాలా రిస్క్ ఉంది. వాస్తవంగా అసలు కలిసే అవకాశం లేని కలవని సీతారామరాజు, భీమ్ లు కలిసి బ్రిటిషర్ల మీద పోరాడితే ఎలా ఉంటుందన్న ఆలోచనను రచయిత విజయేంద్ర ప్రసాద్ కథగా మలిచిన తేలికైన విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ఇద్దరు పోరాట యోధుల కుటుంబ సభ్యులే కాదు చరిత్రకారులు కూడా దుమ్మెత్తి పోస్తారు. ఇదంతా కల్పితమని రాజమౌళి ఎంతగా చెప్పుకున్నా ఆ కోణంలో చూసేవాళ్ళు ఉంటారు. అందుకే వీలైనంత అరెస్టింగ్ కంటెంట్ తో స్క్రీన్ ప్లేని సెట్ చేసుకున్న జక్కన్న తన చేతిలో రెండు ఆయుధాలను సరైన రీతిలో వాడి వేలెత్తి చూపించకుండా శాయశక్తులా ప్రయత్నించాడు.

హీరోల పాత్రలను ఎస్టాబ్లిక్ చేసిన తీరు, ఓ సమస్యని సృష్టించి వాళ్లకు ముడిపెట్టి అనుసంధానించిన విధానం బాగా కుదిరింది. ఇద్దరి అభిమానులు ఏ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటారో ముందే పసిగట్టిన రాజమౌళి వాళ్లనే టార్గెట్ చేస్తూ తీసిన యాక్షన్ బ్లాక్స్ నిజంగానే పూనకాలు తెప్పిస్తాయి. అయితే వీళ్ళ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టిన జక్కన్న కొన్ని కీలక విషయాల్లో అంతగా ఫోకస్ చేయకపోవడం మైనస్ అయ్యిందని చెప్పక తప్పదు. అందుకే సెకండ్ హాఫ్ లో మొదటి నలభై నిమిషాలు చప్పగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏదేదో ఊహించుకున్న అజయ్ దేవగన్ ఎపిసోడ్ రెండు మూడు డైలాగులకు తప్ప హైప్ ఇవ్వడానికి ఉపయోగపడలేదు.

నిజానికిది దేశభక్తి సినిమా కాదు. స్నేహం, తమ వర్గంలో వారు అణుగారిపోతుంటే వాళ్ళను కాపాడే లక్ష్యం అనే రెండు పాయింట్ల మీద బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది అంతే. వందేమాతరం పాడే రేంజ్ లోనో, జెండా ముందు నిలబడి జై హింద్ అనాలనిపించేలాగానో ఏవి ఉండవు. కన్నుల పండుగగా చరణ్ తారక్ లు ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ బ్రోమాన్స్ చేస్తున్నప్పుడు చాలా లోటు పాట్లు ఆ మాయలో కొట్టుకుపోయాయి. ఒకవేళ ఇదే కథని మీడియం రేంజ్ హీరోలతో అచ్చం ఇలాగే తీస్తే ఇప్పుడు వస్తున్న దాంట్లో సగం ఫలితం కూడా వచ్చేది కాదన్నది వాస్తవం. నమ్మశక్యం కానీ కాంబినేషన్ వీక్ నెస్ లను కప్పెట్టేసింది.

ఇన్ని చెప్పడం బట్టి అసలు ఆర్ఆర్ఆర్ లో మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడైనా తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. లవ్ ట్రాక్ సెట్ చేసే తీరు, కామెడీతో నవ్వించడం లాంటివి పెద్దగా పట్టించుకోరు. రామరాజు క్యారెక్టర్ అలా ప్రవర్తించడానికి తండ్రితో చెప్పించిన కారణం అంత స్ట్రాంగ్ గా లేదు. ఆయుధాలు సేకరించడమనే ప్లాట్ ని బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. రామ్ భీమ్ లు పరస్పరం ఒకళ్ళ గురించి మరొకరు ఎంత గొప్పో తెలుసుకునే క్రమం కూడా ఎగ్జైటింగ్ గా ఉండదు. కానీ వాళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ చూస్తున్నంత సేపు ఆ ధ్యాస రాకుండా జాగ్రత్త పడ్డాడు రాజమౌళి.

రాజమౌళి సినిమాలు రిపీట్ వేల్యూ ఎక్కువగా కలిగి ఉంటాయి. మగధీర, బాహుబలి లాంటి ఫాంటసీలు అంత గొప్పగా ఆడాయి. కానీ ఆర్ఆర్ఆర్ లో మరీ ఎక్కువ కల్పనకి చోటు లేదు కాబట్టి ఉన్నంతలో హీరోల ఇమేజ్ నే బలంగా వాడుకుని పెద్ద గ్రాండియర్ ని ఆవిష్కరించాడు. పూర్తి అంచనాలను అందుకుందా అంటే ఔనని సమాధానం చెప్పలేం కానీ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే ఫీలింగ్ రాకుండా రెండు భిన్న ధృవాల్లాంటి స్టార్ ఫ్యామిలీ హీరోలను బ్యాలన్స్ చేయడానికి పడిన తాపత్రయం ఇంకాస్త ఎక్కువ కథాకథనాలు మలుపుల మీద పెట్టి ఉంటే దేశం మొత్తం మాట్లాడుకునే సినిమా అయ్యేది. కానీ ఆ ఛాన్స్ తగ్గింది

కీరవాణి సంగీతంలో ప్రధానమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ ట్రాడినరీ అనే మాటకు సరితూగలేదు కానీ ఉన్నంతలో డీసెంట్ గా సాగింది. పాటలు ఎక్స్ పెక్ట్ చేసినట్టే చూసేందుకు బాగున్నాయి. సెంథిల్ ఛాయాగ్రహణం గురించి ఎలాంటి కంప్లయింట్ లేదు. టెక్నికల్ గా విజువల్ గా బెస్ట్ ఎఫర్ట్ పెట్టారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో నిడివి తగ్గుంటే బాగుండేది. అనవసరం అనిపించే సన్నివేశాలు పెద్దగా లేవు కానీ ల్యాగ్ కు కారణం ఆయన ఒక్కరే అనలేం. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు బాగున్నాయి కానీ మాటలతోనే థియేటర్లు దద్దరిల్లే స్థాయిలో తక్కువున్నాయి. నిర్మాత దానయ్య ఎన్ని వందల కోట్లు ఖర్చు గురించి చెప్పేదేముంది

ప్లస్ గా అనిపించేవి

వన్ అండ్ ఓన్లీ రాజమౌళి
రామ్ చరణ్ పెర్ఫార్మన్స్
జూనియర్ ఎన్టీఆర్ నటన
నాటు నాటు పాట

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్ ల్యాగ్
దేశభక్తిని ప్రేరేపించే ప్లాట్ వీక్ గా ఉండటం
మొక్కుబడిగా మిగిలిన ఇతర క్యాస్టింగ్

కంక్లూజన్

ఏ సినిమాకైనా హంగులు, ఆర్భాటాలు, గ్రాఫిక్సు, విదేశీ నిపుణుల పనితనం, కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే చాలదు. ప్రేక్షకుడిని కట్టిపారేయగల దర్శక చాతుర్యం కావాలి. అది రాజమౌళికి మెండుగా ఉంది కాబట్టే ఇప్పటిదాకా పరాజయం ఆయన్ను పలకరించలేదు. ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా అంతగా భయపడనవసరం లేదు. ఇప్పుడు టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండి కొన్ని వర్గాలు దూరమైనా ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ అయితేనే బెటరనే అభిప్రాయాన్ని కలిగించడంలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయ్యింది. అభిమానులను పక్కనపెడితే థియేటర్లో కంప్లీట్ ప్యాకేజీని ఆశించే సగటు ప్రేక్షకుడికి నచ్చడం మీదే ఆర్ఆర్ఆర్ టాప్ 1గా ఉంటుందా లేదా డిసైడ్ చేస్తుంది.

ఒక్క మాటలో – జక్కన్న మేజిక్ షో

Also Read : James Movie Review : జేమ్స్ రివ్యూ