iDreamPost
android-app
ios-app

James Movie Review : జేమ్స్ రివ్యూ

  • Published Mar 17, 2022 | 5:56 PM Updated Updated Mar 19, 2022 | 9:54 PM
James Movie Review : జేమ్స్ రివ్యూ

ఒక స్టార్ హీరో కెరీర్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు చనిపోతే అతని అభిమానులు చెందే మనోవేదన మాటలకందనిది. అందులోనూ ఆ వ్యక్తి సమాజానికి ఎన్నో గొప్ప పనులు చేసిన మహనీయుడైతే ఆ గాయం నెలలు కాదు ఏళ్ళ తరబడి వెంటాడుతూనే ఉంటుంది. అంత అరుదైన ప్రేమను గౌరవాన్ని దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ ఈ రోజు విడుదలయ్యింది. తెలుగులో బజ్ తక్కువగా ఉన్నప్పటికీ కర్ణాటక చరిత్రలో మొదటిసారి ఇంత గ్రాండ్ ఫేర్ వెల్ దక్కించుకున్న కథానాయకుడిగా జేమ్స్ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఇంతటి కీర్తితో పాటు అంచనాలు మోసిన జేమ్స్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నడిపే సంతోష్(పునీత్ రాజ్ కుమార్)కు ప్రముఖ వ్యాపారవేత్త విజయ్(శ్రీకాంత్)ను మూడు కోట్ల రూపాయల ఫీజుతో మూడు నెలల పాటు బాడీ గార్డ్ గా ఉండే కాంట్రాక్ట్ వస్తుంది. దానికి ఒప్పుకున్న సంతోష్ ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఊహించని పరిణామాల తర్వాత సంతోష్ అసలు వృత్తి ఇది కాదని, గతంలో అతనో ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది. విజయ్ ఫ్యామిలీకి దగ్గరవ్వడానికి అసలు కారణం వేరే ఉంటుంది. ఇంతకీ జేమ్స్ ఎవరు, ఆ పేరుతో సంతోష్ ఎందుకు వచ్చాడు, మిగిలిన విలన్లకు కనెక్షన్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు

శాండల్ వుడ్ లో డాన్స్ విషయంలో తెలుగు హీరోలతో పోటీ పడగల గ్రేస్ ఉన్న స్టార్ ఒక్క పునీత్ మాత్రమే. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడూ చెక్కుచెదరని చిరునవ్వుతో ఓ ఆత్మీయుడిలా కనిపించే ఈ పవర్ స్టార్ జేమ్స్ చూస్తున్నంత సేపూ తను ఈ లోకం లేడన్న వాస్తవం గుర్తుకు రానంతగా మైమరిపించేశాడు. కమర్షియల్ ఎంటర్ టైనరే అయినప్పటికీ తన ముద్ర ఎక్కడా మిస్ కాకుండా పెర్ఫార్మన్స్ పరంగానూ మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. సీరియస్ ఫైట్ సీన్స్ లో, ఎమోషనల్ సన్నివేశాల్లో పదే పదే ఎందుకు వెళ్లిపోయావ్ అప్పు అనేలా మేజిక్ చేస్తూనే వెళ్ళాడు. ఫైట్ల కోసమే ఫ్యాన్స్ థియేటర్లకు మళ్ళీ మళ్ళీ వస్తారు.

ఇది పునీత్ చివరి సినిమా కావడం దురదృష్టమే అయినా తన ఎనర్జీని మరోసారి ఆవిష్కరించిన పవర్ హౌస్ గా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప స్థానాన్ని అందుకుంది. హీరోయిన్ ప్రియా ఆనంద్ ది రెగ్యులర్ క్యారెక్టరే. ఓ తీపి చేదు కలిగిన జ్ఞాపకాన్ని అందుకుంది. మన శ్రీకాంత్ విలన్ గా చేయడం విశేషం. శరత్ కుమార్, ఆదిత్య మీనన్, ముఖేష్ ఋషి, రంగనాయన రఘు లాంటి సీనియర్లకు ఇందులో చెప్పుకోదగ్గ స్పేసే దొరికింది. వీళ్లంతా అదృష్టవంతులే. అవినాష్, సాధు కోకిల, చిక్కన్న, హరీష్, తిలక్ శేఖర్ ఇలా క్యాస్టింగ్ జేమ్స్ లో చాలానే ఉంది. తారాగణం విషయంలో దర్శకుడు రాజీ పడకపోవడంతో తెరనిండా ఆర్టిస్టులు ఉన్నారు.

డైరెక్టర్ అండ్ టీమ్

నిజానికి ఈ జేమ్స్ రెగ్యులర్ యాక్షన్ డ్రామానే. పునీత్ ముందు నుంచి అభిమానులను అలరించే ఇలాంటి మసాలా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. మధ్యలో రాజకుమార లాంటి ఎమోషనల్ మూవీస్ చేసినప్పటికీ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు డిషుమ్ డిషుమ్ కే ఓటు వేశాడు. జేమ్స్ అదే కోవలోకి వస్తుంది. ఫస్ట్ హాఫ్ నడుస్తున్నంత సేపు మంచి కిక్ ఇచ్చే పోరాటాలతో ఇలాంటి గొప్ప మాస్ హీరో మన మధ్య లేడా అనే ఫీలింగ్ బాగా ఇబ్బంది పెడుతుంది. సోషల్ మీడియాలో అతను చేసిన ఎన్నో మంచి పనులు సేవలు చూసిన మనకు ఒక గొప్ప మానవతావాది చివరి చిత్రమనే భావన అసలు ఏ మైనస్ ని కంటికి కనిపించనివ్వదు.

దర్శకుడు చేతన్ కుమార్ చాలా తెలుగు సినిమాల నుంచి ప్రభావితం చెందిన మాట వాస్తవం. సరిలేరు నీకెవ్వరు, వినయ విధేయ రామ లాంటి ఎన్నో షేడ్స్ ఇందులో కనిపిస్తాయి. చూసేవాళ్లకు నచ్చేలానో ఫ్యాన్స్ మెచ్చెలాగో ఉంటే ఇవన్నీ చల్తా. అందుకే పునీత్ అనే శిఖరాన్ని పెట్టుకుని చేతన్ అన్ని మిక్స్ చేసి కాపీ కొట్టినా కూడా ఈ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులను ఫైనల్ గా ఓ మాదిరిగా మెప్పిస్తాడు. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న గ్రిప్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక తగ్గిపోవడంతో టెంపో డౌన్ అయ్యింది. రామ్ లక్ష్మణ్ తో పాటు మరో ఇద్దరు కంపోజ్ చేసిన ఫైట్స్ కు వచ్చే విజిల్స్ కు డిటిఎస్ సౌండ్ కు వినిపించదు. అంతగా ఎక్కేశాయి.

పునీత్ మీద ప్రేమ, సానుభూతి జేమ్స్ ని అసలు కామెంట్ చేయనివ్వకుండా అడ్డు పడతాయి. సినిమాలో విషయం ఎలా ఉన్నా ప్లస్సులు మైనస్సులు పక్కనపెట్టేసి అలా చూస్తూ ఉండేలా చేస్తాయి. సెకండ్ హాఫ్ లో రెండు మూడు సీన్లు తను లేకుండా ఎఫెక్ట్స్ తో మేనేజ్ చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. అది కేవలం కొన్ని సెకండ్లకు మాత్రమే పరిమితం. చేతన్ కుమార్ అప్పుని ఏ రేంజ్ లో ఎలివేట్ చేయాలో అంతకు మించి అనేలా చూపించడం మీద తప్ప కథా కథనాలపై పెద్ద దృష్టి పెట్టకపోవడంతో పునీత్ సింపతీ లేకుండా చూసే ఆడియన్స్ కి మాత్రం జేమ్స్ సగటు చిత్రంలాగే అనిపించొచ్చు. కానీ అది అంత ప్రభావం చూపిస్తుందనుకోలేం.

కన్నడ పవర్ స్టార్ అనే బిరుదుకు పునీత్ ఎందుకు ఉండాలో చెప్పేందుకు మాత్రం జేమ్స్ బాగా ఉపయోగపడింది. ప్రతి ఫ్రేమ్ లో స్టైలిష్ గా ఉన్నాడు. క్యాస్టింగ్ భారీగా సెట్ చేసుకున్న చేతన్ కొందరిని సరిగా వాడుకోలేకపోయాడు. బిల్డప్స్ భారీతనం ముందు కొన్ని కవరైపోయాయి. కన్నడ ప్రేక్షకులు జేమ్స్ ని బ్రహ్మాండంగా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒరిజినల్ వెర్షన్ లో శివరాజ్ కుమార్ గొంతు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. తెలుగులోనూ అనువాదం విషయం మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే జేమ్స్ ని విపరీత విశ్లేషణలకు దూరంగా ఉంచాల్సిన ఒక ట్రిబ్యూట్ మూవీ

సంగీత దర్శకుడు చరణ్ రాజ్ పనితనం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో బాగా కనిపించింది. పునీత్ ఉన్న సీన్స్ ని బాగా ఎక్స్ ప్లాయిట్ చేశాడు. ఉన్నది తక్కువ పాటలు కాబట్టి కంప్లయింట్ లేదు. పాథోస్ సాంగ్ మెలి తిప్పుతుంది. స్వామి గౌడ ఛాయాగ్రహణం రిచ్ నెస్ ని కళ్ళకు కట్టినట్టు చూపించింది. స్టాండర్డ్ విషయంలో రాజీ పడలేదు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ ఓకే. కుమారస్వామి పత్తికొండ మాత్రం బడ్జెట్ విషయంలో రాజీ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చూడొచ్చు. ఇంత గ్రాండియర్ గా జేమ్స్ రూపొందటం చూస్తే చివరి సినిమాగా ఇలాంటి అవుట్ ఫుట్ ఇచ్చినందుకు ఆయన జీవితాంతం గర్వపడొచ్చు

ప్లస్ గా అనిపించేవి

పునీత్ పెర్ఫార్మెన్స్ & ఎనర్జీ

మైనస్ గా ఉన్నది

పునీత్ లేడన్న చేదు వాస్తవం

కంక్లూజన్

ఎన్ని సినిమాలు చేశాం అన్నది కాదు, జనం గుండెల్లో ఎలాంటి చోటు సంపాదించుకున్నామనేదే ఒక హీరోని చరిత్రలో ఎక్కడ ఉంటాడో నిర్దేశిస్తుంది. జేమ్స్ బాగుందా బాలేదా అనే ఉపమానాలు అనవసరం. చివరి శ్వాస దాకా నటనే జీవితంగా బ్రతికి దాని కోసమే ఫిట్ గా ఉండాలని తాపత్రయపడిన పునీత్ కు జేమ్స్ ఒక నివాళి. థియేటర్ కు వెళ్లి ఓ మంచి మనిషిని తెరమీద చూడటమే తనకు మనమిచ్చే గౌరవం. అతను లేడన్న చేదు వాస్తవం హృదయాన్ని మెలిపెడుతున్నప్పుడు సినిమా గురించి ఎక్కువ విశ్లేషణలు చేయడం అర్ధరహితం. జేమ్స్ ని ఓసారి పలకరించండి. కంటెంట్ కోసం కాదు మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించే కటవుట్ ని కడసారి చూసి రండి

ఒక్క మాట : సెల్యూట్ జేమ్స్

Also Read : Radhe Shyam Review : రాధే శ్యామ్ రివ్యూ