iDreamPost

గీతాతో రాజశేఖర్ – నిజమేనా

గీతాతో రాజశేఖర్ – నిజమేనా

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో అతనికి రెండో ప్రాజెక్ట్ ఇదే అవుతుందన్న ప్రచారం మొదలైంది. ఈలోగా రాజశేఖర్ విషయం ఉన్న కంటెంట్ దొరికితే వెబ్ సిరీస్ లో సైతం నటిస్తారనే టాక్ రావడంతో అది ఆహా యాప్ కోసమే అనే లింక్ కుదిరింది.

దీంతో ఏవేవో న్యూసులు బయటికి వచ్చాయి. వాస్తవానికి ఇదేది నిజం కాదని తెలిసింది. కరుణ కుమార్ ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న వాస్తవమే కానీ అది రాజశేఖర్ కో లేదా గీతా సంస్థకో అనే విషయం మాత్రం ఇంకా ఖరారు చేసుకోలేదు. నిర్మాత క్యాస్టింగ్ తదితరాలు ఇంకా సెట్ చేసుకోనే లేదట. అంతలోనే ఇలా స్ప్రెడ్ అయిపోయిందని తెలిసింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కల్కి డిజాస్టర్ కావడంతో రాజశేఖర్ మళ్ళీ కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు. మార్కెట్ పరంగానూ డౌన్ లో ఉండటంతో నిర్మాతలు భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధంగా లేరు.

అయితే మలయాళంలో 2018లో వచ్చిన జోసెఫ్ రీమేక్ హక్కులు గీత సంస్థ కొందట. భార్య హత్యకు గురైతే ఆ కేసును చేధించే క్రమంలో తానే ఓ పెద్ద విష వలయంలో ఇరుక్కుపోయిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథ అది. రాజశేఖర్ వయసుకు తగ్గ పాత్రే కావడంతో ఛాయస్ గా ఆలోచించారనే ఇన్ సైడ్ టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. అయితే ఏదీ ఫైనల్ కాలేదు. పలాస భారీ విజయం సాధించకపోయినా కరుణ కుమార్ టేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. అందుకే అరవింద్ కూడా అప్పుడు హామీ ఇచ్చారు. మరి కరుణ కుమార్ సినిమాకు ప్లాన్ చేశాడో లేక వెబ్ సిరీస్ ఆలోచనలో ఉన్నాడో ఇంకా తెలియాల్సి ఉంది. ఆ మధ్య ఓ సమావేశంలో స్టేజి మీద చిరంజీవి మీద రుసరుసలాడిన రాజశేఖర్ మళ్ళీ మీడియాకు కనిపించలేదు. ఇప్పుడీ ప్రచారం ద్వారా పేరైతే వచ్చింది కానీ ఇదింకా ఆలోచన దశలోనే ఉందన్నది వాస్తవం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి