లాక్ డౌన్ సమయంలో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విప్లవాత్మకమైన చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ వల్ల అన్ని రంగాల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేసినా.. వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు మాత్రం కాలానుగుణంగా వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో జనతా బజార్ లు ఏర్పాటు చేయనుంది. దీని వల్ల వినియోగదారులకు మేలు జరగనుంది. జనతా బజార్లలో రైతులు నేరుగా వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించుకుంటారు. అదే సమయంలో వినియోగదారులకు సరసమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు కూరగాయలు లభిస్తాయి. యుద్ధ ప్రాతిపదికన జనతా బజార్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. లాక్ డౌన్ సమయంలో రైతు బజారుల సంఖ్య విపరీతంగా పెంచింది. ప్రాంతాల వారీగా ఎక్కడికక్కడ విరివిగా రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కొనసాగిస్తూనే కొత్తగా జనతా బజార్ లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల కూరగాయలతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో మామిడి సీజన్ ప్రారంభం కాబోతోంది. అరటి పంట ఏడాది పొడుగునా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరటి, మామిడి, పుచ్చకాయ తదితర పండ్ల రైతులు నష్టపోకుండా జనతా బజార్లు ఉపయోగపడనున్నాయి.
వచ్చే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం పొడిగించడం వల్ల వ్యవసాయ, ఉద్యాన పంట రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు మార్కెట్లో ధరలు పెరిగి వినియోగదారుల జేబులకు చిల్లులు పడే ప్రమాదం ఉంది. ఈ రెండు సమస్యల పరిస్కారానికి జగన్ సర్కార్ జనతా బజార్ విధానాన్ని అమలులోకి తీసుకు రావడం విశేషం.