Idream media
Idream media
కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ వల్ల 40 రోజులకు పైగా పరిశ్రమలు, కర్మాగారాలు అనివార్యంగా మూతపడ్డాయి. లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో చిన్నా పెద్దా కర్మాగారాలు, పరిశ్రమలు ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెల్లమెల్లగా తెరుచుకున్నాయి. అయితే ఆయా పరిశ్రమలు, కర్మాగారాలు కార్యకలాపాలు ప్రారంభించే ముందు ప్లాంట్లను సునిశితంగా తనిఖీ చేయాల్సిన అవసరాన్ని విశాఖ ఘటన చాటి చెబుతోంది.
వస్తువుల తయారీ, శుద్ధికి పరిశ్రమలు, కర్మాగారాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల లో రసాయనాలు వాడడం సర్వసాధారణం. ఊహించిన విధంగా విశాఖ లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ లో ప్రమాదకరమైన వాయువులు విడుదలై పలువురు ప్రాణాలు కోల్పోయారు. రొయ్యలను శుద్ధి చేసిన తర్వాత విడుదలైన మురుగు, ఇతర మలినాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల ప్రమాదకర వాయువులు ఉత్పన్నమయ్యాయి. ఆ మలినాలు, మురుగును శుద్ధి చేసేందుకు వెళ్లిన కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువులు ఎలా లీక్ అయ్యాయి అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రమాదంలో ఇప్పటికీ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయ్యారు. విశాఖ ఘటన.. దాదాపు 40 రోజుల తర్వాత దేశంలో పరిశ్రమలు, కర్మాగారాలు ఇతర యూనిట్లు తెరుస్తున్న వారికి ఒక హెచ్చరిక లాంటిది. కార్యకలాపాలు ప్రారంభించే ముందు ప్లాంట్ల లో అన్ని విభాగాలలో ఉన్న యంత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన తెలుపుతోంది. ముందస్తు అప్రమత్తత వల్ల విలువైన ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది.