లాక్ డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణలో కరోనా కేసుల జోరే కాదు.. రాజకీయ పోరూ పెరుగుతోంది. మొన్నటి వరకూ తెలంగాణ పీసీసీ పీఠంపై కాంగ్రెస్ లో ఇంటిపోరు సాగగా… ఇప్పుడు కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చిలో రాజుకున్న ఈ వేడి.. కరోనా నేపథ్యంలో కాస్త ఆగింది. సడలింపులతో ఇప్పుడు మళ్లీ రాజుకుంటోంది.
గండిపేట చెరువుకు వెళ్లే దారిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వివాదానికి తెర లేపారు. అంతే కాదు.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మార్చి 2న ఆ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ హల్ చల్ చేశారు. జన్వాడ గ్రామ పరిధిలోని 301, 302, 312, 313 సర్వే నెంబర్లలో తమ స్నేహితులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 111 జీవోను అతిక్రమించి కేటీఆర్ మూడంతస్థుల భవనాన్ని నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమీపంలోని ఓ కాల్వను కప్పేసి 25 ఎకరాల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా… 111 జీవోకు తూట్లు పొడిచారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ సైతం వేశారు. అది హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. ఈ వివాదానికి ముందే హైదరాబాద్ శివారులోని గోపన్‌పల్లి భూ వివాదంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ స్థలాన్ని రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి అక్రమంగా తమ పేరిట రాయించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. ఫామ్ హౌస్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడని టీఆర్ఎస్ నేతలు ఆయనపై ధ్వజమెత్తారు.
తాజాగా ఫామ్ హౌస్ వ్యవహారంపై ఎన్జీటీ కేటీఆర్ తో పాటు పలు ప్రభుత్వ విభాగాలకు నోటీసులు ఇచ్చింది. విచారణకు ఆదేశించింది. ఎన్టీటీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ మంత్రి పదవి నుంచి తొలగాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా రేవంత్, పొన్నాల, షబ్బీర్ ఆలీ తదితర కాంగ్రెస్ పెద్దలు డిమాండ్ చేశారు. దీంతో మళ్లీ వివాదం రాజుకుంది. దీనిపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ నాయకుడు ఒకరు కావాలనే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్ జీటీ లో కేసు వేశారని చెప్పారు. ఆ ఫాం హౌస్ తనది కాదని, నిజానిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా కేటీఆర్ కు మద్దతు పలికారు. ఇదిలా ఉండగా… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ లు మరో సారి రేవంత్ పై ఫైర్ అయ్యారు. అక్రమాలకు పాల్పడేది రేవంత్ అని, వట్టి నాగులాపల్లి లో ఆయన బ్రదర్ జయ ప్రకాష్ పేరు మీద ఉన్న అక్రమ నిర్మాణాలే దీనికి నిదర్శనమని మీడియాకు ఫొటోలు చూపించారు. 111 జీఓ పరిధిలోనే అవి నిర్మించారని ఆరోపించారు. దీనిపై రేవంత్ సవాల్ విసిరారు. అవి అక్రమ నిర్మాణాలని నిరూపిస్తే పార పట్టుకుని నేనే కూల్చి వేస్తానని, అక్రమ నిర్మాణాల కూల్చివేత లు వట్టి నాగులా పల్లి నుంచే మొదలు పెడదామని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొత్తమ్మీద ఇపుడు తెలంగాణలో 111 జీఓ, అక్రమ నిర్మాణాలపై వాడి వేడి రాజకీయాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఈ మాటల యుద్ధం ఎంత వరకూ దారి తీస్తుందో వేచి చూడాలి.
8627