పవన్‌తో ఇంటర్వ్యూ-
ప్రశ్నః బీజేపీతో పొత్తు గురించి చెప్పండి
పవన్ః పొత్తు గురించి అన్ని కోణాల్లో ఆలోచించాం. లంబకోణం, త్రికోణం, మూలకోణం, అరక్కోణం, కుంభకోణం. వాస్తవానికి నేను కోణమాని తీసుకుని ఢిల్లీ వెళ్లి యాంగిల్ సెట్ చేశాను.
ప్రశ్నఃబీజేపీ వల్ల ఏంటి ఉపయోగం?
పవన్ః జనసేన వల్ల ఏంటి ఉపయోగం. ప్రతి తిక్కకు ఒక లెక్కుంటుంది. లెక్కల్లో మైనస్ మైనస్ కలిస్తే ఫ్లస్ అవుతుంది. (- ఇంటూ – = +) అలాగే మేమిద్దరం కలిస్తే గ్లాస్ చెంబు అవుతుంది.
ప్రశ్నః అది సరిలేరు నీకెవ్వరు సినిమా డైలాగ్ కదా?
పవన్ః డైలాగ్‌లో లాగ్ ఉండటం ఇష్టం లేదు నాకు. బీజేపీతో కలిసుందాం రా అన్నాను. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఒక్కరు ఓడిపోవడం కంటే కలిసి ఓడిపోవడం గౌరవం కదా.
ప్రశ్నః మీకిష్టమైన సామెతలు?
పవన్ః చాలా ఉన్నాయి.
1.జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది.
2.అరచేతిలో వైకుంఠం
3.ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందట.
4.మాటలు కోటలు దాటడం.
5.మింగ మెతుకు లేదు…మీసాలకు సంపెంగ నూనె.
6.ఇళ్లు అలకగానే పండగ కాదు.
ప్రశ్నఃఇష్టమైన సినిమా?
పవన్ః కోతలరాయుడు
ప్రశ్నఃనచ్చిన నినాదం?
పవన్ః ఖాళీ గ్లాస్- చెవిలో పువ్వు
ప్రశ్నః మోడీలో మీకు ఏం నచ్చింది?
పవన్ః ఆయన మట్టి మనిషి. ఉదారంగా పిడికెడు మట్టి ఇస్తాడు.
ప్రశ్నః మీలో మీకేం నచ్చింది?
పవన్ః నేను కరెంట్ లాంటోన్ని–ముట్టుకుంటే షాక్ కొడతా. అందుకే జనం నన్ను చూసి భయపడ్డారు. ఇప్పుడు బీజేపీ వాళ్లకి షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తా.
ప్రశ్నః బీజేపీలో ఏం నచ్చింది?
పవన్ః రాజ్యాంగబద్ధమైన, పౌరసత్వ సంఘర్షణ దిశలో సామాజిక చైతన్య శక్తుల జ్వాలాకాంతి కనిపించినప్పుడు సాధికార విస్తృత విరామ చిహ్నాల్లో …అర్థం కాలేదు కదా…ఇదే నాకు నచ్చింది. నేనెట్లా జనానికి అర్థం కానో , బీజేపీ కూడా అర్థం కాదు. దీన్నే భావసారూప్యత అంటారు.
ప్రశ్నః రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
పవన్ః సమాజాన్ని మారుద్దామని వచ్చా. సమాజం అంటే వేసుకున్న చొక్కా కాదు మొహానికున్న మేకప్ కాదు, మార్చడం అంత ఈజీ కాదు. అందుకే నేనే మారిపోయి మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోతున్నా.
ప్రశ్నః బాబుపై మీ అభిప్రాయం?
పవన్ః ఆయన చాలా డెప్త్, లోతైన మనిషి. నీళ్లలోకి మనల్ని తోసి లోతు కొలుస్తాడు. అందుకే బీజేపీలోకి నన్ను తోశారు.
ప్రశ్నఃచెగువేరాని మరిచిపోయినట్టున్నారు?
పవన్ః ప్రతి రివెల్యూషన్ కూడా ఒక ఎవల్యూషనే. పరిణామక్రమాన్ని ఇష్టపడతా. చెగువేరాతో మొదలు పెట్టి హిందుత్వతో ముగించా.
ఈ మధ్యలో బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేశా. మొన్న ఎన్నికల్లో ఇద్దరిని తిట్టా. ఇప్పుడు బీజేపీని పొగుడుతున్నా. వైసీపీని ఎప్పుడూ తిడతా. ఇదంతా Political Evolution.
జనసేన పోటీ చేయడం వల్ల, రాష్ట్రంలో ఎందరో నాయకులు కోట్లు ఖర్చు పెట్టి పాపర్ పట్టారు. నా వల్ల వందల కోట్లు జనంలోకి రావడం Economical Evolution.
ప్రశ్నః గత ఏడేళ్లుగా ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటున్నారు. ఏం ప్రశ్నించారు?
పవన్ః అలల హోరు తగ్గించమని
సముద్రాన్ని ప్రశ్నించా
గాలి జోరు తగ్గించమని
తుపాన్‌ను ప్రశ్నించా
ప్రశ్నిస్తూనే ఉంటా
అడవిని, నగరాన్ని
ప్రశ్నః పుస్తకాలు చాలా చదివారు కదా…అందుకా ఈ కవిత్వం?
పవన్ః నేను బ్రెయిలీ , ఏదీ చదవను. తడిమి మాట్లాడుతూ ఉంటా.
ప్రశ్నః ఫైనల్‌గా ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
పవన్ః నేరుగా చెబితే వాళ్లకు అర్థం కాదు.
సినిమాల ద్వారా చెబుతా
దానివల్ల నాకు డబ్బులొస్తాయ్
వాళ్లకి పోతాయ్