కరోనా వైరస్ మహమ్మరి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. నిన్న దాదాపు 900లుగా ఉన్న పాజిటివ్ కేసులు ప్రస్తుతానికి వెయ్యి దాటడం కలకలం రేపుతోంది. ప్రపంచ దేశాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆయా దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండడం కొంత ఉపసమనం కలిగించే విషయమని చెప్పవచ్చు.
లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావించినా ఆ పరిస్థితి కానరావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో నిన్న శనివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలడం ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏపీలో కరోనాను సమర్థంగా కట్టడి చేశామని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో తాజాగా నమోదైన కేసులు కలవరం రేపుతున్నాయి. నిన్నటి వరకు 13గా ఉన్న పాజిటివ్ కేసులు ఒక్కసారిగా 19కి చేరుకున్నాయి.
మూలాలు అక్కడివేనా…?
ఏపీలో కొత్తగా నమోదైన ఆరు పాజిటివ్ కేసులకు మూలాలు ఢిల్లీలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల, గుంటూరు జిల్లాలో ఈ ఆరు కేసులు నమోదయ్యాయి. వీరందరూ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత సంబంధ కార్యక్రమానికి హాజరై వచ్చారని అధికారులు గుర్తించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే వారికిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
సదరు కార్యక్రమానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 15 వందల మంది హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. వీరందరూ బస్సుల్లో ప్రయాణం చేశారని, ఆహారం, బస అంతా కూడా గుంపులుగానే జరిగిందని అధికారులు గుర్తించారు. తాజాగా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఆ కార్యక్రమానికి వెళ్లిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఢిల్లీలోని సదరు కార్యక్రమానికి వెళ్లిన వారి జాబితాను సేకరిస్తున్న అధికారులు, ఆ తర్వత ప్రత్యేక బృందాలతో వారిని గుర్తించేందుకు ప్రణాళికలు రచించారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఏపీలో కేసుల సంఖ్య పెద్దగా పెరగకపోవడంతో కరోనాను కట్టడి చేశామని ప్రభుత్వం భావించే లోపు తాజా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
6277