iDreamPost
android-app
ios-app

పోలీస్ ,ప్రజలు పరస్పరం సహకరించుకోవాల్సిన వేళ ఇది ..

  • Published Mar 29, 2020 | 5:45 AM Updated Updated Mar 29, 2020 | 5:45 AM
పోలీస్ ,ప్రజలు పరస్పరం సహకరించుకోవాల్సిన వేళ ఇది ..

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సమస్త ప్రజా జీవనాన్ని స్తంభింపజేస్తూ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాక ఒక్కసారిగా పోలీస్ వ్యవస్థ పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది . ఒకటా రెండా అనేక రకాల విధులు , కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసి ఉక్కిరిబిక్కిరి చేయసాగాయి .

సాధారణ విధులు కాక ఇప్పుడు వారి పై పడ్డ అదనపు బాధ్యతలు  సరిహద్దు రాష్ట్రాల నుండి ఎవరూ రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలి .
జనాలు లాక్ డౌన్ అధిగమించి ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి తరలకుండా జాగ్రత్త వహించాలి .
ప్రజలు నిత్యావసరాల కోసం , అత్యవసర స్థితిలో బయటకి వచ్చేవారికి మార్గదర్శనం చేయాలి .
లాక్ డౌన్ పాటించకుండా బయటికొచ్చే ఆకతాయిల్ని అదుపు చేసి ఇంటికి పంపాలి .
విదేశాలనుండి ఎవరొచ్చారు అన్నది ఆరా తీసి వారిని కలిసి టెస్ట్ లకి తీసుకుపోవాలి .
మద్యం మాంసం లాంటివి దొంగచాటుగా అమ్మకుండా నిఘా వేసి చర్యలు తీసుకోవాలి .
పట్టణంలో వ్యాపారస్తులు టీ కొట్టు కాన్నుండి , హోటల్స్ ఇతర దుకాణాలు తెరిచి జనాల్ని పోగేయ్యకుండా కాపాడాలి .
గస్తీ తిరగాలి , నాయకుల బందోబస్తు చూడాలి .  

ఇన్ని విధులకు ఎందరు పోలీసులు ఉండాలి . రెగ్యులర్ విధులు కాకుండా ఈ అదనపు విధులు వారికెంత తలభారమవుతాయో తెలుసా , ఒక్కోసారి నిలబడి రోడ్డు పక్కనున్న బండి మీద రెండు కాయలతో కడుపు నింపుకొని పరిగెత్తే అంత . ఒక మునిసిపాలిటీలో పోలీసులు ఎందరు ప్రజలకి బాధ్యత వహించాలో నరసరావుపేట విషయాన్ని తీసుకొని చూద్దాం .

నరసరావుపేటలో ప్రధానంగా నాలుగు స్టేషన్లు ఉన్నాయి . వన్ టౌన్ స్టేషన్లో 40 మంది , టూ టౌన్ 50 మంది , ట్రాఫిక్ 20 మంది , దిశా స్టేషన్ 50 మంది మొత్తం పై అధికారులతో కలిపి 170 మంది లోపు. ఈ 170 మంది ఎంతమంది జనాభా పై నిఘా ఉంచి అదుపు చేయాలో తెలుసా . ఇరవై వేల ఇల్లు ఉన్న మా పేట జనాభా షుమారు 125000 , చుట్టుపక్కలనుండి , పై నుండి రాకపోకలు సాగించే వాళ్ళని కలిపి 170000 .

ఒక్కో కానిస్టేబుల్ సగటున వెయ్యి మంది భారాన్ని మోయాలి , వంద మంది పైనైనా దృష్టి పెట్టాలి . కనీసం పది మంది పై నిఘా ఉంచాలి . పంచిన విధులు కిమ్మనకుండా చేయాలి . ఈ మధ్య జగన్ ప్రభుత్వం వారాంతపు సెలవు ప్రకటించేవరకూ సెలవుల్లేకుండా దాదాపు 15 నుండి 18 గంటలు విధులు నిర్వహించాలి . ఇవి కాక రాజకీయ వత్తిడులు అదనం .

ఇంత భారం మోసేవారు ప్రజల్ని అదుపు చేసే సందర్భంలో అదుపు కాకుండా వాగ్వివాదానికి దిగినప్పుడు ఒక్కోసారి ఆవేశపడే అవకాశం ఉంటుంది . కర్ఫ్యూ సమయంలో , భారీ జనసమీకరణ సందర్భాల్లో , యువత రెచ్చిపోతున్న ఘటనల్లో , ఇలాంటి అత్యవసర స్థితిలో ఆర్గ్యుతో , నిమ్మలంగా సమాధానాలు చెబుతూ డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో చేయి చేసుకొని ఉండొచ్చు .అది చట్టబద్దమా , విరుద్ధమా అని బేరీజు వేసుకుని మీనమేషాలు లెక్కిస్తే విధులు నిర్వర్తించలేకపోవచ్చు .

ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజలు నిబంధనలు అర్థం చేసుకొని పాటిస్తే వారికి కొట్టవలసిన పని దుర్భాషలాడవలసిన పనీ ఉండదు కదా . ఇలాంటి క్లిష్ట సమయాల్లో వారికి సహకరించడం వలన మన జీవనాన్ని మెరుగుపరుచుకొన్న వారమవుతాము .

పోలీసులు కూడా మరికాస్త సంయమనంతో వ్యవహరించి ప్రజల పై భౌతిక దాడి చేయకుండా వీలైనంత వరకూ అదుపు చేస్తే ఈ వివాదాలు ఉండవు . గౌరవంగా జీవించే ఒక వ్యక్తికి తన వంటి పై అకారణంగా పడిన దెబ్బ చాలా కాలం మానసికంగా ఒక అవమానంగా వెంటాడుతోంది . అదొక మచ్చగా భావించి మధనపడటం పోలీస్ వ్యవస్థ మీద దురభిప్రాయం ఏర్పడటానికి దారి తీస్తుంది .

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అత్యవసరం అయినప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి బయటికి వెళ్లడం , ప్రజలు కొన్ని సందర్భాల్లో పొరపాటున నిబంధనలు మీరినప్పుడు వారికి నిబంధనలు తెలియజేసి ఒక అవకాశమ్ ఇవ్వడం చేస్తే ఇరు పక్షాలకి సమస్యలు లేకుండా లాక్ డౌన్ ని , కరోనా ఎఫెక్ట్ ని సమర్థంగా ఎదుర్కోగలుగుతాం .