iDreamPost
android-app
ios-app

రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్ధితుల్లో ఉందో తెలుసా ? వారం రోజులే చాలా కీలకమట…

  • Published Apr 01, 2020 | 3:37 AM Updated Updated Apr 01, 2020 | 3:37 AM
రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్ధితుల్లో ఉందో తెలుసా ? వారం రోజులే చాలా కీలకమట…

దేశం చాలా క్లిష్టపరిస్దితుల్లో ఉందంటూ అపుడెపుడో ఏదో సినిమాలో నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగ్ చాలా పాపులరైంది. అపుడు నూతన్ ప్రసాద్ చెప్పిన డైలాగే ఇపుడు నిజమయ్యేట్లుంది. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కొరోనా పెరుగుతున్న తీరు చూస్తుంటే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. మార్చి 30వ తేదీ వరకూ 23 కేసులు నమోదైతే రాష్ట్రంలో కొరోనా వైరస్ కంట్రోల్లోనే ఉందనిపించింది.

కానీ నిన్నఅంటే 31వ తేదీన బయటపడిన 17 కేసులతో ప్రభుత్వంతో పాటు జనాలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాబోయే ఏడు రోజులే చాలా కీలకమని. కూరగాయలని, మటన్, చికెన్ అని, మందులని, వెచ్చాలని ఇప్పటి వరకూ ఏదో కారణం చెప్పి కొందరు బయటకు వెళుతున్నారు. ఇక నుండి అంటే మరో ఏడు రోజులపాటు దయచేసి బయటకు వెళ్ళవద్దని వైద్యులు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు.

ఎందుకంటే ఈ ఏడు రోజులు చాలా ప్రమాదకరమని అంటున్నారు డాక్టర్లు. ఎలాగంటే వైరస్ పరంగా చూసినపుడు ఇన్ క్యుబేషన్ కాలం పూర్తయ్యిందట. దీని ఫలితంగా వైరస్ గాలి ద్వారా ప్రయాణం చేసి ఒకరి నుండి మరొకరికి సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. ఎవరిళ్ళల్లో వాళ్ళుండాలని వీలైతే కుటుంబసభ్యులు కూడా ఒకిరికొకరు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

ప్రధానమంత్రి మూడు వారాల లాక్ డౌన్ ప్రకటించిన కారణం కూడా ఇదే. మొదటి వారంలో వైరస్ వ్యాపించటం నెమ్మదిగా ఉంటుందట. రెండో వారంలో స్పీడు కాస్త పెంచి మూడో వారంలో మంచి జోరుమీద ఉంటుందని అంచనా వేశారు. మళ్ళీ చివరి వారంలో బాగా నెమ్మదిస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఏప్రిల్ 1-7వ తేదీ మధ్య వైరస్ మంచి జోరు మీదుంటుంది కాబట్టి ఈ వారం చాలా కీలకం అని ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచిది.