ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. విద్య, ఉద్యోగాల్లో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పీజీ మెడికల్ అడ్మిషన్లకు ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం సరికాదన్నారు. దీని వల్ల ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్య, ఉద్యోగాల్లో ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని తన లేఖలో విన్నవించారు.
కాగా, 2019 ప్రారంభంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను తెచ్చింది. అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు దక్కేలా చట్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 50 శాతంలో వారికి ఇవ్వకుండా అదనంగా మరో 10 శాతం అగ్రవర్ణ పేదలకు కేటాయించారు. ఫలితంగా రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకున్నారు. ఈ రిజర్వేషన్లను మొదటిసారిగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 2019లో అమలు చేసింది. గత ఏడాది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లోనూ ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీజేపీ నేతలు పలు చోట్ల డిమాండ్ చేశారు.