మహమ్మరి కరోనా వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూ అందరి మన్ననలు పొందుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ వైరస్ కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందన్న నిపుణుల హెచ్చరికలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ రోజు కరోనా వైరస్ కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ మేరకు అధికారులు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
మరో వారం రోజుల్లో.. అంటే జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక108, 104 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధమయ్యాయి. ఆయా వాహనాల్లో కరోనా పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలు అమర్చుకుని ప్రతి గ్రామంలో కరోనా పరీక్షలు చేయాలని సీఎం జగన్ సూచించారు. మండలానికి ఒక 104 వాహనం ద్వారా 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు ఒక బృందంగా ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు.
ప్రజలకు అవగాహన కల్పించడం వల్లనే కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగలమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కరోనా పరీక్షలు చేసి వైరస్‌ను సమర్థవంతంగా నియంత్రించడంతోపాటు.. ప్రజల్లో వైరస్‌పై ఉన్న అపోహలు తొలగించేలా అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
కరోనా పరీక్షలతోపాటు బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేసి అవసరమైన మందులు ప్రజలకు అందించాలని ఆదేశించారు. 104 వాహనం ద్వారా ప్రతి నెల స్కీనింగ్, వైద్యపరీక్షలు చేసి సంబంధిత సమాచారాన్ని ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్‌లో పొందుపరచాలని సూచించారు. మనుషులు, పశువులు, ఆక్వా రంగంలో ఉపయోగించే ఔషధాలను డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలకు లోబడి ఉండాల్సిదేనని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు.
9060