iDreamPost

మ‌నుగ‌డ‌లేని మ‌న‌ద‌ప‌ల్లె విజ‌య‌డెయిరీ

మ‌నుగ‌డ‌లేని మ‌న‌ద‌ప‌ల్లె విజ‌య‌డెయిరీ

ఆప‌ద స‌మ‌యంలో అమ్మ‌లా ఆదుకుంది ఆ డెయిరీ.. ప్ర‌త్య‌క్ష్యంగా ప‌రోక్షంగా వేలాది మందిని ప‌లుక‌రించిన మ‌ద‌న‌ప‌ల్లె విజ‌య‌డెయిరీ ఇప్పుడు దీనావ‌స్థ‌లో ఉంది.. రైతుల‌కు దూర‌మై.. నిర్వ‌హ‌ణ భార‌మైన ఆ డెయిరీ ప‌రిస్థితి ఆగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది..

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లె విజ‌య‌క‌డెయిరీ అంటే ఆప్రాంతంలో తెలియ‌ని వారుండ‌రు. ఉపాధి కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న రోజుల్లో నేనున్నానంటూ డెయిరీ ప్ర‌త్య‌క్ష్యంగా, ప‌రోక్షంగా చేసిన స‌హాయాన్ని ప్ర‌జ‌లెప్ప‌టికీ మ‌ర్చిపోరు. అయితే పాల‌కుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా మారుతున్న జీవ‌న విధానాల‌కు అనుగుణంగా డెయిరీ మార్పు చెంద‌డం లేదు.

మ‌ద‌న‌ప‌ల్లె ప్ర‌భుత్వ విజ‌య పాల డెయిరీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాల‌ను ప్యాకింగ్ చేసి స‌ర‌ఫ‌రా చేసేవారు. రైతుల ద్వారా సేక‌రించిన పాల‌ను ప్యాకింగ్ చేసి 13 జిల్లాల్లో అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు పంపించే వారు. ఇందుకోసం మ‌ద‌న‌ప‌ల్లెలో రూ. 30కోట్ల‌తో టెట్రాప్యాక్ ప‌ద్ద‌తిలో పాలు ప్యాకింగ్ చేసే యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రైతుల ద్వారా తీసుకునే పాల‌కు లీట‌రుకు రూ. 25 రూపాయ‌ల‌కు మించ‌కుండా విజ‌య డెయిరీలో ఇచ్చేవారు. అయితే ప్రైవేటు పాల డెయిరీల్లో రూ. 35 వ‌ర‌కు ఇస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వ్య‌వ‌సాయం త‌ర్వాత పాల ఉత్ప‌త్తి ద్వారానే రైతుల‌కు ఆదాయం స‌మకూరుతుంది. గ్రామాల్లో మెజార్టీ ప్ర‌జ‌లు ప‌శువులు పెంచుకుంటూ దాని ద్వారా వ‌చ్చే ఆదాయం ద్వారా బ్ర‌తుకుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మ‌ద‌న‌ప‌ల్లెలో ప్ర‌భుత్వం విజ‌య డెయిరీని ప్రారంభించింది. 2011లో డి.ఆర్‌.డి.ఏ ద్వారా కామ‌ధేనువు, 2012లో జాయింట్ లైబిలిటి గ్రూప్స్‌, 2013లో పాల ప్ర‌గ‌తి కేంద్రాల్లాంటివి ఏర్పాటుచేసింది. దీని ద్వారా పొదుపు మ‌హిళ‌ల‌కు రూ. 100 కోట్ల రుణాలు అందించి పాడి ఆవులు కొనుగోలు చేసేలా స‌హాయం చేసింది.

పాల‌ను సేక‌రించేందుకోసం గ్రామాల్లో శీత‌లీక‌ర‌ణ కేంద్రాలు ఏర్పాటుచేసి మండ‌ల స‌మాఖ్య‌ల ద్వారా వాటిని నిర్వ‌హించారు. ఇందుకోసం ప్ర‌త్యేకంగా మండ‌ల స‌మాఖ్య‌ల ద్వారా సిబ్బందిని కూడా నియ‌మించారు. 10 మండ‌లాల్లో 17 శీత‌లీక‌ర‌ణ కేంద్రాలను ఐదు వేల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో ఏర్పాటుచేశారు. అప్ప‌ట్లో 25 వేల మందికి పైగా రైతులు, మహిళ‌ల ద్వారా విజ‌య డెయిరీకి పాల సేక‌ర‌ణ జ‌రిగేది. ప్ర‌తి రోజూ 85వేల లీట‌ర్ల పాలను సేక‌రించేవారు. ఈ మండ‌లాల ప‌రిధిలోని ఏగ్రామానికి వెళ్లినా రైతులు పాడిప‌శువుల పోష‌ణ‌తోనే జీవ‌నం సాగించేవారు. విజ‌య డెయిరీ ద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి ల‌భించేదంటే ఏ విధంగా డెయిరీ న‌డిచేదో అర్థంచేసుకోవ‌చ్చు.

ఆంధ్రప్ర‌దేశ్ ఉమ్మ‌డిగా ఉన్న రోజుల్లో హైద‌రాబాద్ డెయిరికి కూడా పాల ఎగుమ‌తి చేసేవారు. విభ‌జ‌న అనంత‌రం నుంచి డెయిరీకి పూర్తిగా ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్రైవేటు పాల డెయిరీలు ఎక్కువ రూపాయ‌ల‌కు పాలు కొనుగోలు చేయ‌డంతో విజ‌య డెయిరీ ప‌ట్ల పాడి రైతులు ఆస‌క్తి చూప‌డం లేదు. పాల సేక‌ర‌ణ త‌గ్గుతున్న స‌మ‌యంలో అధికారులు, స్థానిక ప్రజా ప్ర‌తినిధులు చొర‌వ తీసుకోలేదు. విజ‌య డెయిరీలో న‌ష్టాలు ఎదుర‌వుతున్నా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించడం వ‌ల్లే నేడు డెయిరీ ప‌రిస్థితి ఇలా ఉంద‌ని స్థానికులు మండిప‌డుతున్నారు.

ప్రస్తుతం అంగ‌న్‌వాడీల‌కు కూడా పాల ప్యాకెట్ల‌ను ఇవ్వ‌డం లేదు. కొద్ది రోజుల క్రితం క‌ర్నాట‌క రాష్ట్రం నుంచి పాల‌ను కొని ప్యాకింగ్ చేసినా అక్క‌డ కూడా పాల ధ‌ర‌లు ఎక్కువ‌వ్వ‌డంతో అది కూడా జ‌ర‌గ‌డం లేదు. రైతుల నుంచి తీసుకున్న పాల‌కు 15 రోజుల‌కు ఒక‌సారి డ‌బ్బ‌లు ఇచ్చేవారు. ప్ర‌స్తుతం నెల‌న్న‌ర అయినా ఇవ్వలేని ప‌రిస్థితుల్లో విజ‌య డెయిరీ ఉంది. దీంతో పాల డెయిరీకి రైతులు పాల‌ను తీసుకురావ‌డ‌మే మానేశారు. ఆల‌స్యంగా బిల్లులు ఇవ్వడంతో పాటు గిట్టుబాటు ధ‌ర‌లు ఇవ్వ‌క‌పోవ‌డం కూడా ఇందుకు కార‌ణ‌మే. రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద‌న‌ప‌ల్లె డెయిరీపై దృష్టి సారిస్తే ఆ ప్రాంత వాసుల‌కు మళ్లీ పాత రోజులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. డెయిరీ న‌డ‌వ‌డానికి అవ‌స‌మైన నిధులు ప్ర‌భుత్వం స‌హాయం చేస్తేనే విజ‌య‌డెయిరీ మ‌నుగ‌డ సాగ‌నుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి