iDreamPost

కాసులు కురిపించిన ‘జంబలకిడి’ నవ్వులు – Nostalgia

కాసులు కురిపించిన ‘జంబలకిడి’ నవ్వులు – Nostalgia

బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించడంలో మాస్ సినిమాలదే రాజ్యం అనుకుంటాం కాని సరైన రీతిలో తీసి ప్రేక్షకులను నవ్విస్తే కామెడీ మూవీస్ తోనూ కలెక్షన్లు కొల్లగొట్టవచ్చని నిరూపించిన దర్శకుల్లో జంధ్యాల గారిది అగ్ర స్థానం అయితే ఆ తర్వాత పేర్లలో ఈవివి సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి. ఆయన డెబ్యు చెవిలో పువ్వు ఫ్లాప్ అయినా నిరాశ చెందకుండా ప్రేమ ఖైది అనే చిన్న సినిమాతో స్టార్లు లేకుండా లవ్ స్టొరీ తీసుకుని బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఆయనకే చెల్లింది. ఆ తర్వాత కూడా కొంత కాలం ఇదే పంధాలో కొనసాగారు. అప్పుడు వచ్చిందే 1993లో జంబలకిడిపంబ.

ఎవరూ ఊహించని ఒక డిఫరెంట్ కామెడీతో ఆడ మగ రివర్స్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచనను కడుపుబ్బా నవ్వించే రీతిలో ఈవివి తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. నరేష్, ఆమని జంటగా నటించిన ఈ మూవీకి విద్యాసాగర్ సంగీతం ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఆ టైంలో ఉన్న అగ్ర హాస్య నటీనటులంతా భాగమవ్వడం విశేషం. ముందు దీనికి అనుకున్న టైటిల్ రివర్స్ గేర్. కాని అప్పటికి తెలుగులో ఇలాంటి ట్రెండ్ లేదు. మాస్ కి కనెక్ట్ కాదనే ఉద్దేశంతో జంబలకిడిపంబగా మార్చేశారు. మొదట్లో ఈ పేరుని అందరూ వింతగా అనుకున్నా ఆ తర్వాత అదే ఊతపదంగా నిలిచిపోయింది.

వైజాగ్ లో ఆడాళ్ళు మగవాళ్ళుగానూ జెంట్స్ లేడీస్ గానూ మారిపోతారు. ఒక్క నరేష్, బాబు మోహన్ తప్ప సిటీ మొత్తం అలాగే తయారవుతుంది. దీనికి కారణం ఆమని ఎవరో స్వామిజిని నుంచి తెచ్చిన ఔషదం అని తెలుసుకుని ఆ ఇద్దరూ దాన్ని చేధించే ప్రయత్నం చేస్తారు. ఈ లోగా దశలు దాటిపోయి అందరూ చాలా విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే స్కూల్ కామెడీ మాములుగా ఉండదు. జంబలకిడిపంబలో అక్కడక్కడా కామెడీ పాళ్ళు కాస్త శృతిమించినట్టు అనిపించినా జనం మాత్రం బ్రహ్మాండంగా నవ్వుకున్నారు. మొదట్లో కొంత స్లోగా ఓపెనింగ్ ఉన్నా ఆ తర్వాత నాన్ స్టాప్ హౌస్ ఫుల్స్ తో బంపర్ హిట్ అనిపించుకుంది. దీనికి సీక్వెల్ చేయాలనీ ఈవివి గారు చాలా సార్లు అనుకున్నారు. అల్లరి నరేష్ హీరోగా పార్ట్ 2 తీస్తారని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. ఆ కోరిక నేరవకుండానేకన్ను మూయడం దురదృష్టకరం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి