iDreamPost

రిమాండ్ లో ఉన్న ఓ ఖైదీ దినచర్య ఎలా ఉంటుంది?

రిమాండ్ లో ఉన్న ఓ ఖైదీ దినచర్య ఎలా ఉంటుంది?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. రూ.371 కోట్ల మేర అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కొన్ని ప్రశ్నలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు రిమాండ్ ఖైదీకి ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అతనికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఎలాంటి భోజనం పెడతారు? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు రిమాండ్ ఖైదీ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

జైలుకు వెళ్లిన ప్రతి ఒక్కరు దోషులు కావాల్సిన అవసరం లేదు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తే.. కోర్టు వారికి జ్యూడీషియల్ రిమాండ్, పోలీసు రిమాండ్ విధిస్తుంది. ఇది గరిష్టంగా 14 రోజులు ఉంటుంది. ఇలా రిమాండు మీద జైలుకు వెళ్లిన వారిని రిమాండు ఖైదీలు అంటారు. జైలు అనగానే ఖైదీలు అందరూ తెలుపు, బులుగు, పచ్చ రంగు దుస్తుల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే రిమాండు ఖైదీలకు అలాంటి డ్రెస్ కోడ్ ఉండదు. వారు సాధారణ వస్త్రధారణలోనే ఉంటారు. ఎందుకంటే వారిపై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. అవి రుజువైన తర్వాత శిక్ష పడితే వారికి అలాంటి దుస్తులు ఇస్తారు. జైలులో రిమాండు ఖైదీలకు బెడ్, పరుపులాంటివి ఇవ్వరు. కానీ, శిక్ష పడిన ఖైదీలకు అవి ఉంటాయి.

జైలులో రిమాండు ఖైదీ దినచర్య ఎలా ఉంటుందంటే.. ఉదయాన్నే 6 గంటలకే నిద్ర లేపుతారు. 6.30 గంటల సమయంలో పాలు, టీ, బ్రెడ్ వంటివి ఇస్తారు. ఆ తర్వాత 7 గంటల కల్లా టిఫిన్ తీసుకొస్తారు. టిఫిన్ అంటే సాదా సీదాగా ఏం ఉండదు. ఇడ్లీ, చపాతీ, ఉప్మా, పులిహోర వంటి వెరైటీలు ఉంటాయి. టిఫిన్ చేసి కాస్త అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేసే సమయానికి భోజనం వచ్చేస్తుంది. ఉదయం 10.30 గంటల సమయంలో భోజనం తీసుకొస్తారు. ఇంక భోజనంలో పప్పు, సాంబార్ వంటివి పెడతారు. జైలులో వారానికి ఒకసారి చికెన్, నెలకు ఒకసారి మటన్ ఉంటుంది. గతంతో పోలిస్తే జైళ్లు ఇప్పుడు చాలా మారిపోయాయి. జైలులో పెట్టే ఆహారం ఎంతో సుచిగా, రుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఖైదీలు పండించిన కూరగాయలు, ఆకుకూరలనే ఎక్కువగా వాడుతుంటారు. పైగా వాటిని పురుగు మందులు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతూ ఉంటారు. భోజనం చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే.. సాయంత్రం 4.30 గంటల సమయంలో రాత్రి భోజనం కూడా తీసుకొస్తారు.

జైలులో మరికొన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. సెంట్రల్ జైలులో సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది. రిమాండు ఖైదీలు అక్కడ వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. రిమాండుకు వెళ్లే సమయంలో ఖైదీ వద్ద ఉన్న డబ్బును డిపాజిట్ చేసుకుంటారు. అతను అడిగిన మొత్తానికి టోకెన్లు అందజేస్తారు. ఆ టోకెన్స్ తో సూపర్ మార్కెట్ లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. అక్కడ పెట్టే భోజనం నచ్చకపోతే టిఫిన్, భోజనం, బిర్యానీ కూడా కొనుక్కుని తినచ్చు. అలాగే కాలక్షేపం కోసం కావాల్సిన న్యూస్ పేపర్, లైబ్రరీలో నచ్చిన పుస్తకం తెచ్చుకుని చదువుకోవచ్చు. అంతేకాకుండా క్యారమ్స్, చెస్ వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. అయితే చంద్రబాబుకు మరికొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఆయన వయసు, ఆరోగ్య సమస్యల రీత్యా కోర్టు కొన్ని అదనపు సదుపాయాలు కల్పించింది. సాధారణంగా రిమాండు ఖైదీలకు బెడ్ ఉండదు. కానీ, చంద్రబాబుకు ఒక బెడ్ ఇచ్చారు. ఇంటి నుంచే భోజనం, టిఫిన్, మెడిసిన్ తెప్పించుకునేందుకు అనుమతించారు. అలాగే ఆయనకు ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి