iDreamPost

350 కోట్లను కాపాడిన 2 నెలలు

350 కోట్లను కాపాడిన 2 నెలలు

లాక్ డౌన్ వల్ల తీవ్ర సంక్షోభంలో ఇరుకున్న సినిమా పరిశ్రమకు ఒక ఒకరకంగా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పాలి. మార్చ్ మూడో వారం మొదలైన కరోనా రక్కసి ఇంకా దేశం వదిలి పోలేదు. కేసులు తగ్గడం లేదు. మరోవైపు ముంబై లాంటి నగరాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇక్కడ లక్ ఏంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెండు బ్లాక్ బస్టర్లు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరులతో పాటు ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ ఈ మూడు సినిమాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశాయి. చిన్నా పెద్దా హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మిగిలినవి కలుపుకుంటే మరో 150 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగాయి.

సరిగ్గా ఆ తర్వాత రెండు నెలలకు లాక్ డౌన్ వచ్చి పడింది. ఆ టైంలో థియేటర్లలో ఉన్నవి చిన్న సినిమాలే. వాటికి ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగా వచ్చినవి. ఒకవేళ ఇదే పరిస్థితి జనవరిలోనే వచ్చి ఉంటే అప్పటికి ఈ భారీ చిత్రాలు హాళ్లలో ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అక్కడికి మంచి రన్ లో భీష్మ మీద కొంతమేర దెబ్బ పడింది. కానీ కరోనా మూలాలు గత ఏడాది నవంబర్ లోనే మొదలయ్యాయి. ఇండియాకు రావడానికి కొంత టైం పట్టింది. ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకునే లోపే ఎక్కువ పెట్టుబడుల మీద నడుస్తున్న సినిమాలు వసూళ్లు రాబట్టుకున్నాయి. ఒకరకంగా ఇది మంచి చూడాల్సిన కోణం. అదృష్టవశాత్తు నాని వి, నిశ్శబ్దం లాంటివి మార్చ్ నాలుగో వారంలో ప్లాన్ చేసుకుని సేఫ్ అయ్యాయి కానీ లేదంటే ఇంకో వంద కోట్లకు చిల్లు పడేది.

కాకపోతే థియేటర్లు మూతబడటంతో వాటి మీద ఆధారాపడ్డ కుటుంబాలు, కార్మికులు ఇబ్బంధులు పడుతున్నాయి. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు సైతం అడ్వాన్స్ రూపంలో ఇచ్చుకున్న తమ సొమ్ములు బ్లాక్ అయిపోయి ఎటూ చెప్పుకోలేకపోతున్నారు. ఆగస్టా లేక సెప్టెంబరా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు కానీ భారతీయ సినిమా చరిత్రలో ఒక వైరస్ ఇంత పెద్ద చీకటి అధ్యాయాన్ని రాస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఏ మాత్రం తేడా జరిగి జనవరిలోనే వైరస్ వచ్చి ఉంటే రికార్డులు మాట అటుంచి అందరు నిండా మునిగిపోయే వాళ్ళు. ఏదైతేనేం మొత్తానికి ఇంత సంక్షోభంలోనూ ఇదొక్కటి మంచి అని చెప్పుకోవడానికి మిగిలింది. షూటింగులు మెల్లగా ఊపందుకున్నాయి కాని మూవీ లవర్స్ మాత్రం బుక్ మై షో యాపులు ఎప్పటి నుంచి యాక్టివ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి