iDreamPost

ఆ సీట్లపై దృష్టి పెట్టిన జగన్, కొత్త వారికే ఛాన్సిచ్చే యోచనలో వైఎస్సార్సీపీ

ఆ సీట్లపై దృష్టి పెట్టిన జగన్, కొత్త వారికే ఛాన్సిచ్చే యోచనలో వైఎస్సార్సీపీ

వచ్చే ఎన్నికలకు సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా రాజుకుంటోంది. ముందస్తు ఎన్నికల గురించి టీడీపీ ఊహాగానాలతో సాగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఇటీవల రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల గురించి ప్రస్తావించడం దానికి ఊతమిచ్చింది. దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేల పనితీరుని ఆయన ప్రస్తావించడం ఆసక్తిగా మారుతోంది. దాంతో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగేవారిలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మూడోవంతు మందికి ఛాన్స్ ఉండదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం ప్రస్తుతం ఆపార్టీ ఓటమి పాలయిన 24 సీట్లపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.

2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 23 చోట్ల టీడీపీ చేతిలో, ఒక చోట జనసేన చేతిలో ఓటమి పాలయ్యారు. అందులో అద్దంకి, ఉరవకొండ సీట్లు 2014లో ఆపార్టీ గెలుచుకున్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో చేజార్చుకుంది. మిగిలిన 22 స్థానాల్లో ఒక్కసారి కూడా వైఎస్సార్సీపీకి విజయం దక్కలేదు. దాంతో ఆయా స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు కనిపిస్తోంది.తొలుత వాటికి సంబంధించిన వ్యవహారాలు చక్కదిద్దే యోచనలో వైఎస్సార్సీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు ఆపార్టీని వీడారు. జగన్ కి జై కొట్టారు. విశాఖ దక్షిణం, గన్నవరం, గుంటూరు వెస్ట్, చీరాల ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. దాంతో ఈ నాలుగు సీట్లలో కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరం. ఈ నలుగురిలో ఇద్దరు బరిలో ఉండే అవకాశం లేదు. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ ఇద్దరూ తమ వారసులకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో జగన్ ఏం చేస్తారన్నది చూడాలి.

ఇక మిగిలిన స్థానాల్లో ఓటమి పాలయిన పలువురు నేతలకు జగన్ వివిధ స్థాయిల్లో పదవులు కట్టబెట్టారు. వారిలో ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రేపల్లె, మండపేటలో ఓటమి పాలయిన తర్వాత కూడా క్యాబినెట్ లో చోటు దక్కించుకుని, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ,పిల్లి సుభాష్‌ చంద్రబోస్ వచ్చే ఎన్నికల బరిలో ఉండే అవకాశం లేదు. మరికొందరు ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టారు. వారిలో ఎండీ ఇక్బాల్, దువ్వాడ శ్రీనివాస్ వంటి వారున్నారు. వారికి కూడా మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అన్నది సందేహమే. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి తన వారసుడిని ప్రోత్సహించాలని చూస్తుంటే వై శివరామిరెడ్డి కుటుంబం పోటీ వస్తోంది. పర్చూరులో ఓటమి తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీకి దూరమయ్యారు. దాంతో అక్కడ కొత్త ఇన్ఛార్జ్ ని పెట్టారు. ఇక ఇతర నేతలు అనేకమంది నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. ఆయా నియోజకవర్గ వ్యవహారాల్లో కొందరు చురుగ్గా కనిపించడం లేదు. దాంతో వారికి అవకాశం ఉండబోదని తెలుస్తోంది.

గడిచిన మూడేళ్లలో పార్టీ కార్యకలాపాల్లో నాయకుల పాత్ర, స్థానికంగా ప్రజల్లో వారి పట్ల ఉన్న అభిప్రాయాలను సర్వే ఆధారంగా పరిగణలోకి తీసుకుని అత్యధికంగా కొత్త వారిని రంగంలో దింపేందుకు చూస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 151 మందిలో దాదాపు 40 మందికి పైగా కొత్తవారు ఖాయంగా కనిపిస్తోంది. వారితో పాటుగా ఈ 24 సీట్లలో 20 మంది వరకూ కొత్త అభ్యర్థులు బరిలో ఉంటారని భావిస్తున్నారు. మొత్తంగా సుమారుగా 70 మంది వరకూ కొత్త అభ్యర్థులను పోటీలో దింపేలా జగన్ ప్రణాళికలు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో తొలుత ఈ 24 సీట్ల సంగతి తేల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థుల ద్వారా జగన్ ప్రయోగానికి సిద్ధమయ్యేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి