iDreamPost

నేడే 100వ రోజు

నేడే 100వ రోజు

థియేటర్లు మూతబడి వాటి మీద ఆధారపడ్డ వాళ్ల బ్రతుకు దినదిన గండంగా మారి ఇవాళ్టికి సరిగ్గా 100వ రోజు. అంటే మూడు నెలల 10 రోజులుగా సినిమా ప్రియులు వెండితెర వినోదానికి దూరమయ్యారు. ఎప్పటికి తెరుచుకుంటాయో అంతు చిక్కడం లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకపోగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. దానికి తోడు ప్రధాన నగరాల్లో వైరస్ మహమ్మారి అంతకంతా విస్తరిస్తూ పోతోంది. ప్రభుత్వం సైతం ఎన్ని చర్యలు తీసుకున్నా చాప కింద నీరులా ఇది పాకుతున్న తీరు ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో హాళ్లు, మాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇప్పుడు సుమారు పదికి పైగా ఉన్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నవి కూడా చెప్పుకోదగ్గ నెంబర్ లోనే ఉన్నాయి. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉంచి శానిటైజేషన్ తో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు ప్రతిపాదనలు ఉంచినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సింగల్ స్క్రీన్లు ఉన్న యజమానులు అధిక శాతం వాటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే కమర్షియల్ కాంప్లెక్సులుగా మార్చే ఆలోచనలో ఉన్నారు. జనజీవనం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ప్రార్ధన మందిరాలతో సహా దాదాపు అన్ని వ్యాపార లావాదేవీలు అన్నిచోట్లా ప్రారంభమయ్యాయి. అలాంటప్పుడు ఒక్క థియేటర్లకు మాత్రమే ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. సరే అనుమతులు ఇచ్చాక ఒకవేళ తీసినా ముందు ఎవరు రిలీజ్ చేస్తారనే అయోమయం కూడా అంతర్గతంగా నెలకొంది.

అయితే దుబాయ్, జర్మన్, ఫ్రాన్స్ తరహాలో ముందు పాత సినిమాలు ప్రదర్శించి జనం రావడం అలవాటు చేసుకున్నాక అప్పుడు కొత్త వాటిని రంగంలోకి దింపేలా ప్లానింగ్ చేసుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ దీని వల్ల రెవిన్యూని ఎక్కువగా ఆశించకూడదు. ఎందుకంటే టీవీల్లో, ఓటిటిలో దాదాపు అన్ని కొత్త సినిమాలు చూసేసిన ప్రేక్షకులు అంత సులభంగా మళ్ళీ వాటినే బిగ్ స్క్రీన్ పై చూసేందుకు రాకపోవచ్చు. అలా అని స్పందన ఉండదని కాదు. ఎంతోకొంత అయితే ఖచ్చితంగా వస్తారు. లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా కొన్నిరోజులు అలా నడపాల్సిందే. అప్పుడే పరిస్థితి కుదుటపడేందుకు అవకాశం దొరుకుతుంది. ఆలా చేస్తేనే కనీసం ఓ ముందడుగు వేసినట్టు ఉంటుంది. ఈ వంద రోజులు ఇప్పటికే సినిమా మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి ఎడబాటుని, నరకాన్ని చూపించాయి. ఇకనైనా వీలైనంత త్వరగా థియేటర్ల గేట్లు తెరిచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. ఆ క్షణాలు దగ్గరలో ఉన్నాయని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి