iDreamPost
android-app
ios-app

అనాథ పిల్లల విషయంలో సర్కారు సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!

  • Author singhj Published - 11:39 AM, Fri - 4 August 23
  • Author singhj Published - 11:39 AM, Fri - 4 August 23
అనాథ పిల్లల విషయంలో సర్కారు సంచలన నిర్ణయం.. దేశంలోనే తొలిసారిగా..!

తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఎంతో మంది ఉంటారు. ఆలనాపాలనా చూసేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉండే పిల్లల పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి అనాథల విషయంలో తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అనాథల ఆలనాపాలనను ప్రభుత్వమే చూసుకోనుంది. మన దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారి అనాథ పిల్లల సంరక్షణ, ఆలనాపాలనను ప్రభుత్వమే చూసుకోనుంది. అనాథల విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాలను మంత్రి కేటీఆర్ మీడియాకు వివరించారు.

ఇకపై రాష్ట్రంలో అనాథ పిల్లలకు తల్లీదండ్రి అంతా ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. అర్బన్ పాలసీ తెచ్చేందుకు శిశు సంక్షేమ శాఖకు కేబినెట్ ఆదేశం ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్​గా గుర్తిస్తూ అర్బన్ పాలసీని పకడ్బందీగా రూపొందించాలని శిశు సంక్షేమ శాఖ మంత్రితో పాటు అధికారులకు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్, కేబినెట్ సూచించింది. ఇప్పటికే పేదల కోసం మానవీయ కోణంలో పలు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తోంది రాష్ట్ర సర్కారు. ఇప్పుడు అనాథలను గుర్తించి వారికి అండగా ఉండాలని నిర్ణయించింది.

అనాథ పిల్లలను ప్రయోజకులను చేయాలని, వారికంటూ ఒక కుటుంబం ఏర్పడే వరకు అండగా నిలబడాలనే ఉదాత్తమైన ఆశయంపై కేబినెట్​లో సమగ్రమైన చర్చ జరిగింది. ఈ విషయంలో ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తోంది. దీనిపై త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ వరకు పాలసీ తీసుకురావాలని సీఎం కేసీఆర్ రీసెంట్​గా ఆదేశించారు. కాగా, ఈ విషయంపై మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలులో సమావేశమైంది. ఇందులో మంత్రి కేటీఆర్​తో పాటు ఉపసంఘం సభ్యులైన జగదీశ్వర్​ రెడ్డి, పువ్వాడ అజయ్, అల్లోల ఇంద్రకరణ్ ​రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​ రావు, కొప్పుల శ్రీనివాస్​ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అనాథ పిల్లల స్థితిగతులపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. అనాథల విషయంలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం, యూనిసెఫ్ మార్గదర్శకాల మీద చర్చించాలని సూచించారు. హైదరాబాద్​ వట్టినాగులపల్లిలో ఉన్న ప్రముఖ ఎస్​వోఎస్ సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు, విధానాలను అధ్యయనం చేసేందుకు సబ్​కమిటీ టీమ్ పర్యటించాలని నిర్ణయించారు. మరి.. అనాథల విషయంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.