iDreamPost
android-app
ios-app

భారత్​లో ఆడేందుకు మరో షరతు పెట్టిన పాకిస్థాన్.. ఆ హామీ ఇస్తేనే వస్తామంటూ..!

  • Author singhj Published - 08:08 AM, Fri - 4 August 23
  • Author singhj Published - 08:08 AM, Fri - 4 August 23
భారత్​లో ఆడేందుకు మరో షరతు పెట్టిన పాకిస్థాన్.. ఆ హామీ ఇస్తేనే వస్తామంటూ..!

ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ కప్-2023 టోర్నీ కోసం అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు మొత్తం 46 రోజుల పాటు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్​తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్​ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఢీకొట్టనుంది. మెగా టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్​లో జరగనుంది. మొత్తం పది టీమ్​లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఒక జట్టు మిగతా 9 టీమ్​లతో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశలో టాప్​-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్​కు అర్హత సాధిస్తాయి.

వరల్డ్ కప్ షెడ్యూల్​ను జూన్ నెలాఖరులో ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇందులో పలు మార్పులు జరిగేట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ ఆడే మ్యాచులకు సంబంధించి పక్కాగా మార్పులు జరిగేలా ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్​ కోసం తమ టీమ్​ను భారత్​కు పంపేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి నిరంతరం కొత్త డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త షరతు పెట్టింది పీసీబీ. తమ జట్టు భద్రతకు సంబంధించి ఐసీసీ నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని కండీషన్ పెట్టిందని సమాచారం. వన్డే ప్రపంచ కప్-2023 కోసం ఇండియాకు ఒక టీమ్​ను పంపేందుకు పీసీబీ ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది.

పీసీబీ కోరడంతో భారత్​కు తమ జట్టును పంపడంపై పాకిస్థాన్ ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. పాక్ సర్కారు, పాక్ క్రికెట్ బోర్డు ఇండియాలో తమ జట్టు భద్రతకు సంబంధించి ఐసీసీ నుంచి రాతపూర్వక హామీని కోరాయట. తమ టీమ్​కు భారత్​లో అత్యంత సేఫ్టీ ఉండేలా హామీ ఇవ్వాలని పాక్ ప్రభుత్వం, పీసీబీలు ఐసీసీని డిమాండ్ చేశాయట. లిఖితపూర్వక హామీ ఇస్తేనే మెగా ఈవెంట్ కోసం తమ జట్టును భారత్​కు పంపాలని డిసైడ్ అవుతామని స్పష్టం చేశాయట. ఇకపోతే, వరల్డ్ కప్​లో భారత్​తో ఆడే మ్యాచ్​తో పాటు పాకిస్థాన్​కు షెడ్యూల్ చేసిన మరో రెండు మ్యాచ్​ల తేదీలు మారొచ్చని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.