Idream media
Idream media
పండక్కి కొత్త అల్లుడు వస్తాడేమో కానీ, బంగార్రాజు మాత్రం పాత అల్లుడే. సొగ్గాడే చిన్నినాయనేకి సీక్వెల్‌గా వచ్చింది. కొత్తదనమేమీ లేకుండా దాన్నే మళ్లీ తీసారు. నాగార్జునకి బదులు నాగచైతన్య వున్నాడు. పాత బంగార్రాజు అలాగే వుంటాడు. ఈయన మనుమడు బంగారురాజు.
సినిమా ప్రారంభంలో ఎవరో దుండగులు నిధి కోసం శివలింగాన్ని పెకలించడం, చంద్రముఖిలో వున్నటు వంటి గ్రాఫిక్స్ పాము వాళ్లని వెంటబడి తరమడంతో కథ మొదలవుతుంది. పార్ట్ వన్‌లో నరకం నుంచి భూలోకానికి వచ్చిన నాగార్జున ఈ సారి స్వర్గానికి వెళ్లి రంభ, ఊర్వశిలతో పాట పాడతాడు. పనిలో పనిగా రమ్యకృష్ణ కూడా చనిపోయి అక్కడికే వస్తుంది.
భూలోకంలో వీళ్ల మనుమడు చినబంగార్రాజు నాగచైతన్య, తాతలాగే సోగ్గాడిగా మారి అమ్మాయిల వెంట పడుతూ వుంటాడు. హీరోయిన్ కృతితో ఎప్పుడూ గొడవ. ఈలోగా యముడు , ఇంద్రుడు మాట్లాడుకుని, భూలోకంలో రుద్రయాగం సరిగా జరగాలంటే ఆత్మని పంపించాలని నిర్ణయించుకుంటారు. పనిలో పనిగా మనుమడిని సరైన దారిలో పెట్టి, హీరోయిన్‌తో గొడవలు చక్కదిద్దడానికి నాగార్జున భూలోకానికి వెళ్తాడు. ఆయన వెళ్లిన కాసేపటికి రమ్యకృష్ణ కూడా భూలోకానికి వస్తుంది.
మ్యాజిక్ రెండుసార్లు రిపీట్ కాదు. సోగ్గాడే చిన్నినాయనలో బలమైన కథ, క్యారెక్టర్స్ , అన్నిటికి మించి నాగార్జున రొమాన్స్ వర్కౌట్ అయింది. నాగచైతన్యలో కాలేదు. అందుకే కాసేపు అమ్మాయిల వెంట పడి, తర్వాత నాగచైతన్య కూడా మరిచిపోతాడు. నాగార్జున భూలోకానికి వచ్చిన తర్వాత చేయడానికి పెద్ద పనేమీ లేక అపుడప్పుడు మనుమడిలోకి ప్రవేశించి ఫైట్స్ చేస్తూ వుంటాడు. అద్భుతమైన నటి రమ్యకృష్ణ బంగార్రాజు అని గట్టిగా అరవడం తప్ప ఇంకే విధంగా నటించే అవకాశం లేకపోవడం దర్శకుడి లోపమే.
మంచి ఫొటోగ్రఫీ, పాటలు, కలర్‌ఫుల్‌గా ఉన్న సినిమా మనకి బోర్ కొట్టడానికి కారణం కథ లేకపోవడమే. ఉన్న కథ కూడా పాతదే. చివరి 15 నిమిషాలు ఆ మాత్రం కూడా లేకపోతే టీవీ సీరియల్ ఫీలింగే! సర్పంచ్‌గా ఎన్నికైన హీరోయిన్‌కి నాలుగైదు రిపీటెడ్ సీన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. రైటింగ్‌లో శ్రద్ధ పెట్టకుండా , నాగార్జున ఆత్మసాయంతో కథని నెట్టాలనుకోవడం దర్శకుడి తప్పిదమే. రావు రమేశ్, సంపత్‌లు కూడా రొటీన్‌లో ఇరుక్కుపోయారు.
డబుల్ యాక్షన్ లేదా ఆత్మలు ఉండే సినిమాలో సెల్లింగ్ పాయింట్ ఏమంటే ఒక హీరో బలహీనంగా ఉంటే , ఇంకో హీరో అతని స్థానంలోకి వచ్చినా , ఆత్మగా ఎంటరైనా ఆడియన్స్‌లో కిక్ వస్తుంది. ఫస్ట్ పార్ట్‌లో ఇది వర్కౌట్ అయింది. సీక్వెల్‌లో నాగచైతన్య బలహీనంగానూ వుండడు, అమాయకంగానూ ఉండడు. అతనిలోకి ప్రవేశించి నాగార్జున చేసే మిరాకిల్స్ కూడా లేవు. ఈ డ్రామా మిస్ అయింది.
పండక్కి సినిమాలు లేకపోవడం, కొంచెం ఓపిక చేసుకుని చూస్తే టైం పాస్ అవుతుంది కాబట్టి గట్టెక్కితే బంగార్రాజు అదృష్టమే. వెన్నెల కిషోర్, బ్రహ్మాజి, రవి, జబర్దస్త్ బ్యాచ్ ఇంత మంది ఉన్నా కొంచెం కూడా కామెడీ లేకపోవడం మన దురదృష్టం. శివుని గుడి , నిధి , పాము కాపలా, రుద్రయాగం ఈ నేపథ్యంతో చాలా సినిమాలు వచ్చాయి. సీన్స్ కొత్తగా రాసుకోకపోతే విఠలాచార్య సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది.
నాగార్జున మాత్రం ఫుల్ ఎనర్జీతో కనిపిస్తాడు. మొత్తం సినిమాని భుజాల మీద మోసేశాడు. కథ, స్క్రీన్ ప్లేలో కనీస జాగ్రత్తలు తీసుకున్నా బంగార్రాజు నిలదొక్కుకునేవాడు. గతంలో నేల టికెట్ సినిమా తీసిన దర్శకుడు కురసాల కల్యాణకృష్ణ ఈ సారి క్లాస్ కాదు కానీ, బెంచీ వరకూ వచ్చాడు. పండగ పూట సోగ్గాడు వస్తాడనుకుంటే స్లోగాడు వచ్చాడు. కథ కదలకపోతే బంగార్రాజు కళ్లద్దాలు, పంచకట్టు ఎంతో సేపు చూడలేం.
ప్లస్ పాయింట్స్ః పాటలు, నాగార్జున , యువరాజ్ ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ః పాత కథ, స్లో నెరేషన్, రిపీటెడ్ సీన్స్
Also Read : Arjuna Phalguna Review : అర్జున ఫల్గుణ రివ్యూ