Arjuna Phalguna Review : అర్జున ఫల్గుణ రివ్యూ

By Ravindra Siraj Dec. 31, 2021, 02:42 pm IST
Arjuna Phalguna Review : అర్జున ఫల్గుణ రివ్యూ
Rating : 1.75/5
Main Cast: : Sree Vishnu, Amritha,
Director: : Teja Marni,
Music: : ,
Producer: : Niranjan Reddy, Anvesh Reddy,

చేసేవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే అయినా వైవిధ్యమున్న కథలను ఎంచుకుంటున్న హీరో శ్రీవిష్ణు. వెరైటీ మ్యానరిజంతో అచ్చం పక్కింటి కుర్రాడిలా అనిపించే ఈ యువ కథానాయకుడికి ఒక హిట్టు వస్తే రెండు ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అయినా కూడా రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లకుండా ప్రయోగాలు చేస్తూనే వచ్చాడు. ఆ కోవలో వచ్చిన మరో మూవీ అర్జున ఫల్గుణ. ట్రైలర్ కట్ తో ఆకట్టుకుని ప్రమోషన్లు కూడా గట్టిగానే చేసుకున్న ఈ థ్రిల్లర్ టైపు ఎంటర్ టైనర్ మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం గురించి శ్రీవిష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ వచ్చాడు. మరి దానికి తగ్గట్టు ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

గోదావరి ప్రాంతం చిన్న పల్లెటూళ్ళో ఉండే అర్జున్(శ్రీవిష్ణు)అతని స్నేహితులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులు. ఉద్యోగం లేకపోయినా ఎవరైనా సహాయం అడిగితే పొలోమని చేయడానికి పరిగెత్తే అర్జున్ అతని ఫ్రెండ్స్ కలిసి ఓ వ్యాపారం చేసి లైఫ్ లో సెటిలవ్వాలని అనుకుంటారు. దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో ఓ ప్రమాదకరమైన ఉచ్చులో దిగి పోలీసుల దృష్టిలో పడతారు. స్మగ్లింగ్ దందాలో లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటారు. మరి ఈ వలయం నుంచి ఎలా బయట పడ్డారు, వీళ్ళను ఇందులో ఇరికించిన గ్యాంగ్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫల్గుణ.

నటీనటులు

శ్రీవిష్ణు టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. అలవోకగా చేసుకుంటూ పోయాడు. గోదావరి స్లాంగ్ లో ఎప్పటిలాగే బెస్ట్ ఇచ్చాడు. అయితే తన ఎనర్జీని పూర్తిగా వాడుకునే స్కోప్ అయితే ఇందులో దొరకలేదు. లవ్ ట్రాక్ పెద్దగా లేకపోవడంతో ఆ కోణంలోనూ పెర్ఫార్మ్ చేయడానికి ఏమి లేకపోయింది. హీరోయిన్ అమృతా అయ్యర్ మొదట్లో కొంత హడావిడి చేసినా తర్వాత పరిగెత్తడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీనికి రెండు కాళ్ళు ఉంటే చాలు నటన అక్కర్లేదు కాబట్టి పాదాలకు చక్కగా పని చెప్పింది. క్లోజ్ అప్ లో పలువరస మాత్రమే ఎక్కువ హైలైట్ అయ్యే అమృతలో మంచి చలాకితనం ఉంది

బడ్జెట్ పరిమితులు ఉన్నాయి కాబట్టి సీనియర్ ఆర్టిస్టులను పరిమితంగా తీసుకున్నా వాళ్లనూ సరిగా వాడుకోలేదు. నరేష్ మొత్తం కలిపి పావుగంట కంటే ఎక్కువ కనపడరు. సుబ్బరాజు ఇంటర్వెల్ లో ప్రవేశించి అక్కడక్కడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. శివాజీరాజాతో ఒక రోజు కాల్ షీట్స్ తీసుకున్నారు కాబోలు సినిమా అయ్యాక ఆయన గుర్తుంటే ఒట్టు. రంగస్థలం మహేష్ కు రెండు మూడు ఎమోషనల్ సీన్స్ పడ్డాయి కానీ వీక్ రైటింగ్ వల్ల అవి తేలిపోయాయి. రాజావారురాణిగారు కమెడియన్లు, ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులు పర్వాలేదనిపించారు. మొత్తంగా తారాగణంలో ఎవరినీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు

డైరెక్టర్ అండ్ టీమ్

సోషల్ మెసేజ్ ఉన్న జోహార్ లాంటి డెబ్యూతో బాగానే ఆకట్టుకున్న దర్శకుడు తేజ మర్ని రెండో సినిమాకు ఇలాంటి కథను ఎంచుకోవడం విచిత్రమే. కేవలం ట్విస్టులతో ఏ కథలు నడవవు. వాటికి ముందు వెనుక బలమైన లేయర్స్ ఉండాలి. జోహార్ లో వీటిని బాగా సెట్ చేసుకున్న తేజ ఎందుకో మరి అర్జున ఫల్గుణ విషయంలో మాత్రం వాటిని నిర్లక్ష్యం చేశారు. లైన్ వినగానే హీరో నిర్మాతలు ఎగ్జైట్ పోయి తీసేయ్ మని తొందరపెట్టారేమో అన్నంత హడావిడిగా స్క్రీన్ ప్లే ఎగాదిగా సాగుతుంది. ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. పోనీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే విలేజ్ కామెడీ అయినా బాగుందా అది మరీ ఎన్టీఆర్ కాలం నాటి స్టైల్ లో ఉంది.

హీరో అతని ఫ్రెండ్స్ బ్యాచ్ తో స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని లింక్ చేసి ఒక థ్రిల్లింగ్ క్రైమ్ ని చూపించాలనేది తేజ మర్ని ఆలోచన. ఈ పాయింట్ తో గతంలో సినిమాలు వచ్చాయి. కాబట్టి తీసుకోకూడదనే రూల్ ఏమి లేదు. కానీ అవి గుర్తురానంత వేగంగా కథాకథనాలు నడిపించాలి. బేసిక్ లాజిక్స్ ని పట్టించుకోవాలి. అర్జున ఫల్గుణలో ఇవేవి ఉండవు. ఒక మూటని అరకు నుంచి తమ ఊరికి తీసుకురావడానికి అయిదుగురు ఎందుకో జస్టిఫై చేయలేదు. అందులోనూ వాళ్ళతో పాటు హీరోయిన్ వెళ్లడం అనవసరం. అసలు హీరోనే వద్దనాలి. కానీ రెమ్యునరేషన్ ఇచ్చి డేట్లు తీసుకున్నాం కాబట్టి జర్నీ చేయాల్సిందే అన్నట్టుగా ఇరికించడం తప్ప ఏమి జరగలేదు.

శ్రీవిష్ణు అంటే సహజత్వానికి పేరు. మరి అవసరం లేని ఎలివేషన్లు అఖండ రేంజ్ లో ఇవ్వడానికి అక్కడక్కడా ప్రయత్నించడం ఎందుకో అర్థం కాదు. రాజరాజ చోర ఎందుకు సక్సెస్ అయ్యిందో అందరం చూశాంగా. న్యాచురల్ గా ప్రెజెంట్ చేసిన క్రైమ్ డ్రామాని జనం మెచ్చుకున్నారు. కానీ అర్జున ఫల్గుణలో మాత్రం పదుల సంఖ్యలో పోలీసులు హీరో బ్యాచ్ మీద గుళ్ళు పేలుస్తున్నా ఒక్కటీ తగలదు. రైలు పట్టాల మీద స్పృహ తప్పి పడిపోయిన అర్జున్ మీద ఆకాశం నుంచి ఒక నీటి చుక్క పడగానే లేచి చిరంజీవి రేంజ్ లో పరిగెత్తుతాడు. వెనకాల బ్యాక్ గ్రౌండ్లో శివుడి స్తోత్రం వినిపిస్తుంది. ఇవన్నీ ఓ రేంజ్ లో హీరోయిజం ప్రెజెంట్ చేసే తాపత్రయమే

సందేశం ఉన్న కాన్సెప్ట్ కి గొప్ప పేరు రాలేదు కాబట్టి తానూ రెగ్యులర్ దారిలో వెళ్ళాలన్న తేజ మర్ని ఆలోచన తప్పు కాదు. కానీ ప్రాపర్ హోమ్ వర్క్ ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ అర్జున ఫల్గుణలో ఇది అంతగా జరిగినట్టు కనిపించదు. ప్రయత్నం సిన్సియర్ గానే ఉంది కానీ రాత తీతలోనే తేడాలు వచ్చాయి. సుధీర్ వర్మ సంభాషణలు సైతం సగటు టీవీ సీరియల్ మాదిరి అక్కడక్కడా పేలినట్టు అనిపిస్తాయి తప్ప ఓవరాల్ గా చూస్తే ఆయన కలం నుంచి ఎక్స్ పెక్ట్ చేసే అవుట్ ఫుట్ ఇది కాదు. తేజలో ఎంత మంచి టెక్నీషియన్ ఉన్నా అతనికి సపోర్ట్ గా ఉండాల్సిన రచయిత వీక్ అవ్వడంతో ఈ యుద్ధంలో అర్జునుడు ఓడిపోయాడు

జగదీశ్ చీకటి ఛాయాగ్రహణం పర్లేదు. బాగా రాజీ పడిన ప్రొడక్షన్ కావడంతో ఉన్నంతలో క్వాలిటీ చూపించేందుకు కష్టపడ్డారు. అడవిలో విజువల్స్ బాగానే వచ్చాయి. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం సోసోగా ఉంది. ఒక్క పాట పర్లేదు అనిపిస్తే బిజిఎం మాత్రం సోది ఎక్కువ సౌండ్ తక్కువలా ఉంది. విప్లవ్ న్యాశదమ్ ఎడిటింగ్ వీలైనంత ల్యాగ్ ని తగ్గించి రెండుంపావు గంటల లోపే సినిమాను కట్ చేసింది కానీ అసలు కంటెంట్ లో సమస్య వల్ల ల్యాగ్ ఫీలవుతాం. ఆచార్య లాంటి భారీ ప్రాజెక్ట్ లో భాగమైన మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ దీనికి పెద్దగా ఖర్చు పెట్టిందేమి లేదు. తక్కువ బడ్జెట్ కాబట్టి ఓకే చేసినట్టు ఉన్నారు

ప్లస్ గా అనిపించేవి

శ్రీవిష్ణు
ఓ రెండు ట్విస్టులు

మైనస్ గా తోచేవి

క్యారెక్టరైజేషన్లు
సంగీతం
కథా కథనాలు

కంక్లూజన్

ఓటిటిలు గొప్ప క్వాలిటీ కంటెంట్ ఇస్తుంటే స్క్రీన్ మీద సినిమాను చూసేందుకు వచ్చే ప్రేక్షకుడి కనీస అంచనాలను అందుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ఏదో తీశాం కదా ఎవరో ఒకరు చూస్తారులే అనే రోజులు పోయాయి. ఏదైనా తేడా కొడితే సదరు హీరో దర్శకుడి నెక్స్ట్ సినిమా మీద నేరుగా ప్రభావం పడుతోంది. ఈ సూత్రాన్ని మర్చిపోతే ఫలితం ఎలా ఉంటుందో అర్జున ఫల్గుణ ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. బోలెడు క్రైమ్ థ్రిల్లర్లు చూసి చూసి ఒకరకంగా బోర్ కొట్టేసిన ఆడియన్స్ కి అర్జున ఫల్గుణ బేసిక్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడంలో కూడా కష్టపడటంతో బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెట్టడం కష్టమే

ఒక్క మాటలో - ఓడిపోయిన అర్జునుడు

Also Read : Shyam Singha Roy Review : శ్యామ్ సింగ రాయ్ రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp