iDreamPost
android-app
ios-app

చంద్రబాబుతో కలిస్తే.. పవన్ కు కూడా అదే గతి పడుతుంది: కొడాలి

  • Published Aug 07, 2023 | 4:23 PM Updated Updated Aug 08, 2023 | 8:09 AM
చంద్రబాబుతో కలిస్తే.. పవన్ కు కూడా అదే గతి పడుతుంది: కొడాలి

సాధారణంగా ఎమ్మెల్యే కొడాలి నాని లోపల ఏది ఉంటే.. పైకి అదే మాట్లడాతారని అందరికీ తెలుసు. మంచిని మంచిగా చెప్పినట్లే.. చెడుని కూడా అంతే బలంగా చెబుతారన్నది తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కొడాలి నాని ఎప్పుడూ బలంగానే మాట్లాడతారు. తాజాగా మరోసారి కొడాలి నాని చంద్రాబాబుపై తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా తగు సూచనలు, హెచ్చరికలు చేశారు. చంద్రబాబుతో కలిసి ఉంటే జరిగేది ఏంటి అనే విషయాలను జోష్యం చెప్పారు.

చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రాజెక్టుల పరిశీలన పేరుతో ప్రతిపక్షనేత చంద్రబాబు విన్యాసాలు చేస్తున్నారు. 1978 నుంచి.. అంటే 40 ఏళ్లపాటు చంద్రబాబు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడు ఎందుకు ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు. పులిచింతల, గాలేరు- నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారు. పోలవరానికి జాతీయ హోదా తెచ్చింది వైఎస్సార్. నువ్వు మాత్రం ఐదేళ్లపాటు గ్రాఫిక్స్ లో పోలవరం ప్రాజెక్టు కట్టారు. పోలవరానికి చంద్రబాబు కనీసం రూ.100 కోట్ల పనులు కూడా ఎందుకు చేయలేకపోయారు.

ఎందుకు రూ.55 వేల కోట్లు తీసుకురాలేకపోయారు. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును ఎందుకు చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. పోలవరం కాలువలు తవ్వుతుంటే దేవినేని ఉమాలాంటి వాళ్లతో కేసులు వేయించారు. పోలవరాన్ని చంద్రబాబు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని మేము కాదు.. స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమో 420 పనులు చేసి.. ఇప్పుడు అధికారం ఇస్తే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెబుతున్నారు. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

పవన్ కు హెచ్చరిక:

చంద్రబాబు శ్రేయోభిలాషులు అంతా ఇప్పుడు పవన్ కల్యాణ్ పక్కన చేరారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వాళ్లంతా చంద్రబాబు సీఎం అయితే చూడాలి అని ఆశ పడేవాళ్లేనని చెప్పుకొచ్చారు. అలాంటి వాళ్లు ఇప్పుడు పవన్ పక్కన ఉన్నారని చెప్పారు. చంద్రబాబు నిలువెల్లా వెన్నుపోటు ఉందన్నారు. ఎన్టీఆర్ అంతటి వాడినే వెన్నుపోటు పొడిచాడు.. పవన్ కల్యాణ్ వారికి పెద్ద లెక్కకాదని కొడాలి కామెంట్ చేశారు. చంద్రబాబును నమ్ముకుంటే పవన్ కల్యాణ్ కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర చేసినా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వచ్చే ఎన్నికల వరకు ప్రజల మధ్యలో తిరిగినా తాము స్వాగతిస్తామన్నారు.

ప్రభుత్వంలో ఉండే లోపాలను ఎత్తిచూపిన తాము స్వీకరిస్తామంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. కానీ, చంద్రబాబుతో కలిసి ప్రభుత్వం మీద విమర్శలు, ఆరోపణలు, దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబు స్క్రిప్ట్, రోడ్ మ్యాప్ ని పవన్ కల్యాణ్ ఫాలో అయితే మాత్రం వాళ్లందరిని ఒక కూటమి కింద చూస్తామని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుని సపోర్ట్ చేసే ఎవరిని అయినా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతాం అంటూ కొడాలి ఘాటుగా స్పందించారు. మరోవైపు గద్దర్ మృతిపై కొడాలి నాని స్పందించారు. గద్దర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.