Dharani
భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు..
భీమవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు భీమవరంలో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. బటన్ నొక్కి విద్యార్థలు తల్లుల ఖాతాలో నిధులు జమ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ ల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు విషాలు కలిస్తే అమృతాలు అవుతాయా.. నలుగురు ఒక్కటవుతే కౌరవుల సంఖ్య పెరగుతుంది అంతే.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. పక్కవాడు సీఎం కావాలని దత్తపుత్రుడు పార్టీ పెట్టాడు. పక్క వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ పెట్టేవారు ఎవరూ ఉండరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి.. మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వాడు. ఈ ఇద్దరు ఇప్పుడు ఏకమై ప్రజల్ని వంచించేందుకు సిద్ధం అయ్యారంటూ.. ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
“14 ఏళ్లు పాలించిన వ్యక్తి.. తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పి జనాలను ఓట్లు అడగాలి. అమ్మ ఒడి కంటే మెరుగైన పథకాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసి ఉంటే.. దాని గురించి చెప్పి ఓట్లు అడగాలి. మా ప్రభుత్వం అమలు చేస్తున్న వాటి కంటే మెరుగైన పథకాల్ని అమలు చేసి ఉంటే వాటి గురించి చెప్పి జనాలను తమకు ఓట్లు వేయమని అడగాలి. 14 ఏళ్ల ఆయన పాలన చూశారు.. నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పాలన చూశారు.. రెండింటిని బేరీజు వేసుకుని.. ఓట్లు వేయండి” అని జనాలకు సూచించారు సీఎం జగన్.
గ్రామ సచివాలయం పెట్టింది ఎవరంటే జగనే గుర్తొస్తాడు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ వల్ల.. ప్రతి నెల ఒకటో తేదీన మీ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అందిస్తున్నారు. గ్రామస్థాయిలోనే విలేజ్ క్లినిక్‌లు పెట్టింది మీ బిడ్డ జగన్. పౌర సేవల్ని తెచ్చింది.. పొదుపు సంఘాలకు జీవం పోసింది.. అక్కాచెల్లెళ్లకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తోంది.. బాబు కంటే మూడు రెట్లు పఫించన్ పెంచింది ఎవరంటే గుర్తొచ్చేది మీ జగన్. చంద్రబాబు ఇంతకన్నా మంచి చేసి అప్పుడు ఓట్లు అడగాలి అన్నారు సీఎం జగన్.
బాబు చేయని అభివృద్ధి ప్రజలకు గుర్తు ఉండకూడదు.. మీబిడ్డ జగన్ ఇంటింటికీ చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి.. ఇందుకోసమే ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు.. దిక్కు మాలిన కథనాలు అంటూ జగన్ మండి పడ్డారు. ఆఖరికి ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు, రౌండ్ టేబుళ్లు, రకరకాల పార్టీలు, వ్యక్తల రంగ ప్రవేశాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. తోడేళ్లందరూ ఏకమై ఒక్క జగన్ మీద ఏకమై యుద్ధం చేస్తున్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. ఎందుకంటే.. ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు. వీళ్లందరూ కూడా నమ్ముకున్నది వంచనను, మోసాన్ని మాత్రమే అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జగన్.
చంద్రబాబుకిగానీ, పవన్‌కల్యాణ్‌కి గానీ ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు. ప్యాకేజీ కోసం తన వర్గాన్ని త్యాగం చేసిన త్యాగాల త్యాగరాజు. చరిత్రలో ఇప్పటి వరకు ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూశాం కానీ ప్యాకేజీ కోసం త్యాగాలు చేసేవాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. భీమవరం ఓడించిన దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఉంటున్నాడు. ఇలాంటి వారిని చూసినప్పుడు వేమన పద్యం గుర్తుకు వస్తుంది. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపేగానీ తెలుపు కాదు.. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా? విశ్వదాభిరామ, వినురవేమ అని. వీరి తీరు కూడా అలానే ఉది అంటూ ఎద్దేవా చేశారు జగన్.
ఇన్నాళ్లు ప్రజలకు వాళ్లు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచల్ని మాత్రమే నమ్ముకున్నారు. అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారు. వీరి బుద్ధి ఎలాంటిదో గమనించాలని ప్రజలని అడుగుతున్నా. అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా. మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు సీఎం జగన్.