iDreamPost
android-app
ios-app

ముద్రగడ సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో పవన్‌ గెలవడంటూ

  • Published Mar 30, 2024 | 12:36 PM Updated Updated Mar 30, 2024 | 12:36 PM

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 30, 2024 | 12:36 PMUpdated Mar 30, 2024 | 12:36 PM
ముద్రగడ సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో పవన్‌ గెలవడంటూ

ఏపీలో ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ ప్రారంభం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రమంతా బస్సు యాత్ర మొదలు పెట్టారు. అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి.. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించగా.. విపక్ష కూటమి మాత్రం ఇంకా అభ్యర్థుల ప్రకటననే పూర్తి చేయలేదు. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేడర్‌ మధ్య ఇంకా సఖ్యత నెలకొనలేదు. అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు, ఆందోళనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విషయం అలా ఉంచితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముద్రగడ మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం సినిమా గ్లామర్‌ వల్లే పవన్‌ ఇంకా రాజకీయాల్లో కొనసాగగల్గుతున్నాడని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్‌ కారణంగానే యువకులు పవన్‌ వెంట పడుతున్నారని తెలిపారు. అంతేకాక చాలా విషయాల్లో పవన్‌ కన్నా చిరంజీవి ఎంతో మేలని ప్రశంసలు కురిపించారు. ఏదో సాధించాలని రాజకీయాల్లకి వచ్చిన పవన్‌.. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. అసలు పిఠాపురంలో పవన్‌ గెలిచే ప్రసక్తే లేదని.. ముద్రగడ కుండబద్దలు కొట్టారు.

ఇక తనపై గతంలో జరిగిన పోలీసుల దాడి వెనక నారా లోకేష్‌ ఉన్నాడని.. ఆయన ఆదేశాల మేరకే పోలీసులు దాడి చేశారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ఏపీలో సీఎం జగన్‌ పాలనపై ముద్రగడ ప్రశంసలు కురిపించారు. జగన్‌ పాలనలో పేదలకు న్యాయం జరిగింది అన్నారు. వైఎస్‌ జగన్‌ మాదిరిగా ఏ సీఎం కూడా ప్రజలకు ఈ స్థాయిలో సంక్షేమం అందించలేదని చెప్పుకొచ్చారు. అందుకే జ్యోతిబసు(పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, అత్యధిక కాలం సీఎంగా చేసిన వ్యక్తి) కన్నా ఎక్కువ కాలం జగన్‌ అధికారంలో ఉండాలని.. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా బాధ్యతలు నిర్వహించాలని ముద్రగద ఆకాంక్షించారు. ఇక వైఎస్సార్‌సీపీలో చేరిన తాను.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన మరోసారి స్పష్టం చేశారు.