iDreamPost
iDreamPost
శాసనమండలి రద్దు కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం పరిధిలో పెండింగ్ లో ఉంది. అసెంబ్లీ ఆమోదంతో తీర్మానం హస్తిన వద్ద పెండింగ్ లో కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు నిర్దేశిత గడువు ప్రకారం సాగితే మండలి రద్దుకు అవకాశం ఉందని గత మార్చిలో అంతా ఆశించారు. కానీ అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ తో పార్లమెంట్ సమావేశాలను అర్థాంతరంగా ముగించడంతో కీలక బిల్లులకు మోక్షం కలగలేదు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల ముందుకు ఈ వ్యవహారం వస్తుందా రాదా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఇప్పటికీ మండలి రద్దు కోసం ఏపీ సీఎం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద తమ కోర్కెని వెల్లడిస్తున్నారు. అదే సమయంలో మండలిలో ఖాళీ అవుతున్న స్థానాలపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం మండలిలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. త్వరలో రాజ్యసభకు ఎన్నిక కాబోతున్న ఇద్దరు క్యాబినెట్ సహచరులు కూడా మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ కూడా రాజీనామా చేస్తే ఐదు స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ ఐదు సీట్లు కూడా ఎమ్మెల్యే కోటాలో నామినేటెడ్ పోస్టులే కావడంతో వాటిని అధికార పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్సీలు దూరమయిన తర్వాత మండలిలో టీడీపీ బలం 25కి తగ్గింది. వచ్చే మార్చి నాటికి టీడీపీకి చెందిన మరో 14 మంది పదవీకాలం పూర్తవుతుంది. దాంతో వాటిలో మళ్లీ టీడీపీ దక్కించుకునే స్థానాలు అతి స్వల్పంగా ఉండడంతో రాబోయే మార్చి తర్వాత మండలిలో వైఎస్సార్సీపీ ఆధిపత్యం దాదాపుగా ఖాయంగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం శాసనమండలి విషయంలో నిర్ణయం తీసుకుని రద్దు చేస్తే సరి, లేదంటే మండలిలో ఆధిపత్యం సాధించాలని వైఎస్సార్సీపీ ఆశిస్తోంది.
ఇప్పటికే ఖాళీల భర్తీ విషయంపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి మండలికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ వంటి వారికి మళ్లీ అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏమయినా మండలి స్థానాలకు ఎన్నికలు అనివార్యం అయితే అధికార పార్టీలో మరోసారి ఆశావాహుల సందడి ఖాయంగా చెప్పవచ్చు. ఇప్పటికే మండలి రద్దు తీర్మానం కారణంగా ఖంగుతిన్న నేతలకు ఈ పరిణామాలు కాస్త ఊరటనిస్తాయని చెప్పవచ్చు.