iDreamPost
android-app
ios-app

బీజేపీకి జనసేన సహకరిస్తోందా.. లేదా..?

బీజేపీకి జనసేన సహకరిస్తోందా.. లేదా..?

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పైకి జనసేన బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ ఆ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో బిజెపికి సహకరిస్తుందా..? అనే అనుమానాలు లేకపోలేదు

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నామినేషన్ ప్రక్రియలో జనసేన నేతలు కనిపించకపోవడం ఈ అనుమానాన్ని బలోపేతం చేస్తోంది. కేవలం బీజేపీ నేతలు, కార్యకర్తలతోనే రత్నప్రభ నామినేషన్ వేశారు. బీజేపీ, జనసేన మధ్య తీవ్ర అంతరం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ ముందు నుంచే హడావుడి చేసినా.. ప్రస్తుత పరిణామాలతో అనేక అనుమానాలు తలెత్తున్నాయి.

జనసేన సహకరిస్తుందా..?

రాష్ట్ర విభజన సమయంలో కలిసి.. మధ్యలో విడిపోయి.. తిరిగి 2019 తర్వాత మళ్లీ మైత్రి కుదుర్చుకున్నాయి జనసేన బీజేపీ పార్టీలు. ఇటీవల తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో ఈ పార్టీల మధ్య వైరం మరోసారి బయటపడింది. తెలంగాణ బీజేపీ నేతల వినతి మేరకు జనసేన గ్రేటర్‌ హైదరాబాద్‌ పోరు నుంచి తప్పుకొంది. ఈ నిర్ణయం జనసైనికులకు రుచించలేదు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతి లోక్‌సభ సీటును జనసేనకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ మేరకు కొంత కసరత్తు కూడా చేసింది.

అయితే జనసేన ఆశను నిరాశ చేస్తూ బిజెపి ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బిజెపి ముందుగానే ప్రకటించింది. జనసేన దీనిపై మొదట ఆగ్రహించినా తర్వాత మెత్తబడి ఆ సీటును బిజెపికి ఇవ్వడానికి అంగీకరించింది. ఇది కూడా జనసైనికులకు రుచించలేదు. దీంతో తిరుపతి ఎన్నికల విషయంలో జనసేన దూరంగానే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎన్నికల్లో జనసేన బీజేపీ కి తన వంతు సహకారం అందించడం పై అనుమానాలు లేకపోలేదు.

తెలంగాణలో రగిలిన వివాదం..

తిరుపతి విషయంలో బీజేపీ దూకుడుగా వెళ్తుండటంతో బ్రేక్‌లు వేసింది జనసేన. ఉమ్మడి అభ్యర్థి ఉంటారని ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత పవన్‌ కల్యాణ్ చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తిరుపతి సీటును బీజేపీకి వదిలేసింది జనసేన. మిత్రపక్షాల మధ్య ఏం జరిగింది అని ఆరా తీస్తున్న సమయంలో తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనాని బాంబు పేల్చారు. మిత్రపక్షం బీజేపీకి కాకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభివాణికి మద్దతు ప్రకటించారు. ఈ నిర్ణయం బీజేపీకి షాక్‌ ఇచ్చింది. పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం బాధపెట్టిందని స్వయంగా బండి సంజయ్‌ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ బీజేపీ నేతల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇలాగైతే తాము బీజేపీతో ఉండేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ పరిణామాలు చూసిన తర్వాత తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ-జనసేన మిత్రపక్షం దారెటు అన్న చర్చ నెలకొంది.

స్థానిక ఎన్నికల్లో పొసగని పొత్తు..

తిరుపతిలో తమకు మంచి ఆదరణ ఉందన్నది జనసేన ఆలోచన. గతంలో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందడంతోపాటు ఈ లోక్‌సభ పరిధిలో బలిజకాపు సామాజికవర్గం ఎక్కువ. ఇవన్నీ ప్లస్‌ అవుతాయన్న భావనతో ఉపఎన్నికలో పోటీకి జనసేన ఆసక్తి చూపించింది. ఒకానొక దశలో తిరుపతి సీటు విషయంలో బీజేపీపై నేరుగా విమర్శలు చేశారు జనసేన నాయకులు.

ఇటీవల ఏపీలో ముగిసిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు రెండు పార్టీల పొత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి. బీజేపీ కారణంగానే జనసేన చాలాచోట్ల ఓడిపోయిందని బహిరంగ విమర్శలు చేశారు జనసేన నేతలు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన ఓటమికి బీజేపీనే కారణమని జనసేన ప్రధాన కార్యదర్శి మహేష్ ఆరోపించారు. ఆ తర్వాత బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసుకొని పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు. అయినప్పటికీ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనసేన బీజేపీకి దూరంగానే ఉంటూ వస్తోంది. ఇది చూసిన వారి దృష్టి సహజంగానే తిరుపతిపై పడింది.

పవన్ వస్తే ఒకలా.. రాకపోతే మరోకలా..

బీజేపీ రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత జనసేన నుంచి ఎలాంటి సౌండు, రీసౌండూ లేదు. బీజేపీ నాయకులు రత్నప్రభను తీసుకెళ్లి పవన్‌కల్యాణతో మాట్లాడించిన తర్వాతే జనసేన నుంచి ప్రకటన బయటకొచ్చింది. రత్నప్రభను బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రస్తావిస్తూ.. ఉపఎన్నిక ప్రచార వ్యూహంపై రెండు పార్టీల నేతలు చర్చించినట్టు జనసేన ప్రకటనలో ఉంది. ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ రాక పై ఇంకా అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఆయన వస్తే పార్టీ శ్రేణులకు ఒక సిగ్నల్‌.. రాకపోతే మరో సంకేతం వెళ్లే ఆస్కారం లేకపోలేదు. దీంతో జనసేన బీజేపీ కి పూర్తిస్థాయిలో సహకరించడం అనుమానంగానే ఉంది.