iDreamPost
android-app
ios-app

ప్రలోభాలు సరే .. అసలు కోడ్ అమల్లో ఉందా ?

  • Published Apr 07, 2020 | 5:42 AM Updated Updated Apr 07, 2020 | 5:42 AM
ప్రలోభాలు సరే ..  అసలు కోడ్ అమల్లో ఉందా ?

కరోనా వైరస్ నేపధ్యంలో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న వెయ్యి రూపాయల సాయం కూడా వివాదస్పదమైంది. స్ధానిక సంస్ధల్లో లబ్ది పొందటం కోసమే ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని అధికారపార్టీ అభ్యర్ధులు తమ చేతుల మీదగా పంపిణి చేస్తున్నారంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖరాశారు. అంతకుముందే సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అధికారపార్టీపై ఇటువంటి ఆరోపణలే చేశారు.

కన్నా నుండి వచ్చిన లేఖ ఆధారంగా నిమ్మగడ్డ వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సాయాన్ని అధికారపార్టీ నేతలు పంపిణి చేయటమంటే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించటమే అంటూ నిమ్మగడ్డ తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘనపై వెంటనే నివేదికలు ఇవ్వాలని నిమ్మగడ్డ కలెక్టర్లకు ఆదేశించటం వివాదాస్పదమైంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నపుడు కరోనా వైరస్ కారణంగా అర్ధారంతరంగా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ను ఎత్తేయాలని సుప్రికోర్టు డైరెక్షన్ కారణంగా ఎన్నికల కోడ్ ఎత్తేస్తున్నట్లు నిమ్మగడ్డ కూడా ప్రకటించారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేనట్లే లెక్క. కోడ్ అమలులో లేనపుడు ప్రభుత్వం అందించే సాయాన్ని అధికారపార్టీ నేతలు తమ చేతుల మీదగా పంపిణి చేయటంలో తప్పేమిటని వైసిపి నేతలు వాదిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం అందించే సాయాన్ని అధికార పార్టీ నేతలు తమ చేతుల మీదగా పంపిణి చేయటం మామూలుగా జరుగుతున్నదే. హుద్ హూద్ తుపాను, తిత్లీ తుపాను సమయంలో జరిగిన సహాయక పనులన్నీ అప్పట్లో టిడిపి నేతల చేతుల మీదగానే జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే విధంగా ఇపుడు వైసిపి నేతలు కూడా చేస్తున్నారు. దాన్నే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయి.

ఇదే విషయమై వైసిపి నేతలు మాట్లాడుతూ బిజెపి అధ్యక్షుడు కన్నా ఎన్నికల కమీషన్ కు లేఖ రాయటంలోను, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ చేస్తున్న ఆరోపణల వెనక కూడా చంద్రబాబునాయుడే ఉన్నారంటూ మండిపోతున్నారు.