iDreamPost
android-app
ios-app

మోడీ అభిమానులకు కోపం తెప్పిస్తున్న ఈనాడు..!

మోడీ అభిమానులకు కోపం తెప్పిస్తున్న ఈనాడు..!

తెలుగు జర్నలిజంలో ఈనాడుడి ప్రత్యేక స్థానం. ఈనాడు వచ్చిన తర్వాత తెలుగు పత్రికా రంగంలో వచ్చిన మార్పులు ప్రత్యేమైనవి. వర్తమాన అంశాలను రిపోర్ట్‌ చేయడంతోపాటు.. ఆయా అంశాలపై ప్రత్యేక కథనాలు, నిపుణుల ఇంటర్వ్యూలు ప్రచురించడంతో ఈనాడు అగ్రభాగాన నిలిచింది. నచ్చిన వారిని ఆకాశానికెత్తడం, నచ్చిన రోజున వారినే అథపాతాళానికి తొక్కే రాతలు రాయడంలో ఈనాడు పెట్టింది పేరంటారు ఆ పత్రిక వ్యవహారశైలిని గమనించేవారు. తనకు గిట్టని వారిపై ఏదైనా జరిగితే తాటికాయంత అక్షరాతో రాసే ఈ పత్రిక.. తన వారికి నష్టం చేకూర్చే అంశమైతే.. సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా రాయదని ఇటీవల సుప్రిం కోర్టు జస్టిస్‌ ఎన్‌వీ రమణపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సుప్రిం ప్రధాన న్యాయమూర్తి చేసిన ఫిర్యాదు విషయంలో మరో మారు రుజువైంది. సీఎం ఫిర్యాదు అంశాన్ని ఈనాడు కనీసం ప్రస్తావించకపోవడం విశేషం.

ఈ తరహా జర్నలిజంలో భాగంగానే ఈనాడు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రస్తుతం వ్యవహరిస్తోందని వెల్లడవుతోంది. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఈనాడు మద్ధతుగా కథనాలు రాస్తోంది. అంతేకాదు చట్టాల వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలియజేసేలా ప్రముఖలను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రామన్‌ మొగసెసే అవార్డు గ్రహీత, ప్రముఖ జర్నలిస్టు, వ్యవసాయ రంగంలో నష్టాలు, రైతు ఆత్మహత్యలపై రెండున్నర దశాబ్ధాలుగా పరిశోధన చేస్తున్న పాలగుమ్మి సాయినాథ్‌ను ఈనాడు ఇంటర్వ్యూ చేసింది. కొత్త చట్టాల వల్ల రైతుల ఆదాయం పెరగదని, ఇంకా భారం అవుతుందని, కార్పొరేట్‌ కంపెనీలకే ఈ చట్టాలు ఉపయోగమంటూ సాయినాథ్‌ స్పష్టం చేశారు. ఇది రైతులకు, రైతు ఉద్యమానికి మద్ధతుగా నిలస్తున్న వారికి ఎంతో బలాన్ని ఇస్తోంది. సమస్య పరిష్కారం కోసం రైతులు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా కమిటీ వేస్తామని ఇటీవల సుప్రిం పేర్కొంది. ఈ కమిటీలో ఇరువైపు ప్రతినిధులతోపాటు పాలగుమ్మి సాయినాథ్‌ వంటి నిపుణులను నియమిస్తామని సుప్రిం పేర్కొన్న తరుణంలో.. సాయినాథ్‌ వైఖరి ఏమిటో ఈనాడు తన ఇంటర్వ్యూ ద్వారా తెలియడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

రైతు ఉద్యమానికి మద్ధతునిచ్చేలా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పాలగుమ్మి సాయినాథ్‌ తన వైఖరిని తేటతెల్లం చేయడంతో చట్టాలను రద్దు చేయబోమనే బీజేపీ నేతలకు ఏ మాత్రం మింగుడుపడడం లేదు. 2014 ఎన్నికల్లో బీజేపీని, మోడీని ఈనాడు పత్రిక ఆకాశానికెత్తింది. మోదీ పర్యటనల కవరేజీకి విశేష ప్రాధాన్యత ఇచ్చింది. మోదీ ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఆ ప్రభుత్వం సాధించిన విజయాలను పేర్కొంటూ ప్రత్యేక కథనాలు.. రాసి ప్రత్యేక పేజీలు ప్రచురించింది. ఆ తర్వాత ఏడాదుల్లోనూ ఇదే ఒరవడిని కొనసాగించింది ఈనాడు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆప్‌కు వ్యతిరేకంగా, మోదీకి మద్ధతుగా కర్టూన్లు వేసింది. కథనాలు రాసింది. మోదీ మొదటి సారి ప్రధాని అయిన సమయంలోనే ఈనాడు అధిపతి రామోజీరావును పద్మవిభూషన్‌ అవార్డు వరించింది.

మోడీ, బీజేపీ పట్ల ఇంత సానుకూలంగా ఉన్న ఈనాడు.. 2019 ఎన్నికల తర్వాత తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపీని మళ్లీ బీజేపీ దగ్గరకు రానిస్తుందన్న ఆశతో కొన్ని రోజులు సానుకూలంగానే ఉంది. అయితే సోము వీర్రాజును నూతన అధ్యక్షుడిగా నియమించడంతోపాటు.. ఏపీలో టీడీపీ స్థానాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకోవడంతో ఈనాడు తన పంథాను పూర్తిగా మార్చుకుందనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. ఏపీలో టీడీపీకి నష్టం చేకూర్చేలా, ఆ పార్టీ స్థానాన్ని ఆక్రమించేలా బీజేపీ పని తీరు ఉంటున్న నేపథ్యంలో.. ఈనాడు వైఖరి ఇకపై బీజేపీ పట్ల వ్యతిరేకంగానే ఉండబోతోందన్న సంకేతాలు తాజా కథనాల ద్వారా వెల్లడవుతోంది.