iDreamPost
iDreamPost
రాజకీయంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించి విఫలమయిన చిరంజీవి ప్రస్తుతం సినిమాలకే పరిమితమయ్యారు. మళ్లీ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసేందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అదే సమయంలో ఇటీవల జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. పలు అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన అభిప్రాయాలను వెల్లడించేందుకు గత కొంతకాలంగా వెనకాడిన చిరంజీవిలో ఇప్పుడు వచ్చిన ఈ అనూహ్యమార్పు ఆసక్తిని రేపుతోంది.
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత టాలీవుడ్ నుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదు. పలువురు ప్రముఖులు కనీసం అభినందనలు కూడా చెప్పేందుకు సిద్ధం కాలేదు. కానీ చిరంజీవి మాత్రం భిన్నంగా వ్యవహరించారు. నేరుగా తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లారు. సైరా సినిమా నేపథ్యంలో ఆయన భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా ఇరువురు కలిసి విందు కూడా ఆరగించారు.
ఆ తర్వాతి నుంచి చిరంజీవిలో వచ్చిన మార్పు విశేషంగా కనిపిస్తోంది. ఇటీవల దిశ చట్టం రూపకల్పన జరగ్గానే చిరంజీవి స్పందించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. జగన్ ని కొనియాడారు. ఇక తాజాగా మూడు రాజధానుల అంశంలో కూడా అదే మాదిరి జగన్ ప్రభుత్వ ప్రతిపాదనలకు సంపూర్ణంగా మద్ధతు పలికారు. వాస్తవానికి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత 2012 నుంచి 2018 వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దాదాపు రెండేళ్ల పాటు కేంద్రమంత్రిగానూ పనిచేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన క్రమంగా దూరమవుతూ వచ్చారు. ఏపీలో పార్టీ ప్రచార సారధిగా నియమించినప్పటికీ మిన్నకున్నారు.
సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీలో మరో తమ్ముడు నాగేంద్రబాబు చేరడమే కాకుండా, మొన్నటి సాధారణ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు. పవన్ కూడా అటు గాజువాక, ఇటు భీమవరం నుంచి బరిలో ఉన్నారు. అయినా చిరంజీవి మాత్రం రాజకీయాల జోలికి పోకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు ఇద్దరు తమ్ముళ్లకు మద్ధతుగా ప్రచారానికి దిగుతారని కొందరు ఆశించినా ఆయన మాత్రం సైలెంట్ అయిపోయారు.
అలాంటి చిరంజీవి ఇప్పుడు జగన్ విషయంలో కొంత జోరు ప్రదర్శిస్తుండడం వెనుక కారణాలపై పలు సందేహాలు కలుగుతున్నాయి. అందులోనూ తమ్ముడు పవన్ జనసేన వైఖరికి భిన్నంగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. పవన్ తీరుని దాదాపుగా తప్పుబడుతున్నట్టు చిరంజీవి వ్యవహారం కనిపిస్తోంది. అన్నయ్య నీడలో ఎదిగిన పవన్ కళ్యాణ్ కి ఇది ఇబ్బందికరమే అయినప్పటికీ చిరంజీవి వెనక్కి తగ్గడం లేదు.
కొణిదెల కుటుంబ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అన్నయ్య ఓ దారిలో, తమ్ముళ్లు మరోదారిలో సాగుతుండడం విస్మయకరంగా కనిపిస్తోంది. స్వయంగా నాగబాబు అమరావతిలో పర్యటించి, జగన్ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టిన మరునాడే చిరంజీవి స్వరం భిన్నంగా వినిపించడం గమనార్హం. దాంతో ఈ అన్నదమ్ముళ్ల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. గతంలో పెద్దల సభలో పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించిన చిరంజీవి ఇప్పుడు కూడా ఏదో ఆశించి, ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉండవచ్చని కొంత సందేహాలు వినిపిస్తున్నాయి.
అయితే చిరంజీవిని రాజకీయంగా దగ్గరగా చూసిన వాళ్ళు మాత్రం చిరంజీవి మరోసారి రాజకీయాల్లోకి రాకపోవచ్చని,జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ముఖ్యంగా మూడు రాజధానముల విషయంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే స్పందించారని అంటున్నారు.
రాజకీయంగా జన సేనతో మొదటి నుంచి దూరంగా ఉన్న చిరంజీవి రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇంకా పరిణితి సాధించలేదని,ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రాజకీయాలు నడపటం లేదని బావిస్తునట్లుంది.