పోతిరెడ్డిపాడు మీద జగన్ కు మద్దతుగా ఆంధ్రా ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు ?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగు నీరివ్వాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయ్యింది. ఇందుకోసం జీవో 203 జారీ కూడా చేసింది. ఎప్పుడైతే జీవో జారీ అయ్యిందో వెంటనే తెలంగాణా సిఎం కేసీయార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ జలాల యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది తెలంగాణా ప్రభుత్వం. ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో కూడా సవాలు చేస్తానంటూ కేసియార్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణాలో ప్రతిపక్షాలు కూడా కేసియార్ కు మద్దతుగా నిలబడ్డాయి.

సరే ఇదంతా తెలంగాణా, కేసీయార్ యాంగిల్ లో జరుగుతోంది. మరి ఏపిలో ఏమి జరగాలి ? ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినపుడు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి కదా ? ప్రతిపక్షాల్లో ఒక్క బిజెపి తప్ప మిగిలిన ప్రతిపక్షాలు తమకేమీ పట్టనట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నాయి ? జగన్ మీద కోపంతోనేనా లేకపోతు ఇంకేదైనా కారణముందా ?

అంటే ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిదేమో ఏపిలోని చాలామంది ప్రతిపక్ష నేతలకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధం. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారాయణ లాంటి వాళ్ళకు హైదరాబాద్ లోనే ఇళ్ళతో పాటు ఇతర ఆస్తులున్నాయి. ఏపి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్ కు మద్దతుగా మాట్లాడటమంటే కేసీయార్ ను వ్యతిరేకించినట్లే అనుకోవాలి. మరి ప్రస్తుత పరిస్ధితుల్లో కేసీయార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు మాట్లాడే ధైర్యం చేయగలరా ?

మిగిలిన నేతల విషయం ఎలాగున్నా చంద్రబాబు మాత్రం నోరెత్తే ఛాన్సే లేదు. ఎందుకంటే చంద్రబాబుకు ఇళ్ళు, ఆస్తులే కాదు బోనస్ గా ’ఓటుకునోటు’ కేసులో కూడా తగులుకునున్నాడు. అందుకనే తెలంగాణా విషయానికి వస్తే అసలు నోరే లేవటం లేదు. ఇదే సమయంలో రాజకీయంగా కూడా చంద్రబాబుతో పాటు మిగిలిన నేతలకు ఏమైనా కోపముందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

మొన్నటి ఎన్నికలో రాయలసీమ+నెల్లూరు జిల్లాల్లో మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. 62 అసెంబ్లీ సీట్లలో టిడిపికి దక్కింది కేవలం మూడంటే మూడే సీట్లు. 9 ఎంపి సీట్లలో ఒక్కటీ గెలవలేదు. ఇక జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలకు చాలా చోట్ల డిపాజిట్లే దక్కలేదు. అంటే తమను రాయలసీమ, నెల్లూరు జిల్లాలు ఆధరించనపుడు తాము మాత్రం పై జిల్లాల ప్రయోజనాల కోసం ఎందుకు జగన్ కు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నాయా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే తమకేమన్నా కోపముంటే జగన్ పై పోరాటం చేయాలి కాని రాష్ట్రప్రయోజనాలను పట్టించుకోకపోవటం ఏమిటి ? ఈ విషయంలో ప్రతిపక్షాలే క్లారిటి ఇవ్వాలి మరి ఇస్తాయా ?

Show comments