iDreamPost
android-app
ios-app

బీహార్‌లో బీజేపీ గెలిచింది కానీ.. అసలు కోరిక అలానే ఉండిపోయింది

  • Published Nov 11, 2020 | 2:27 AM Updated Updated Nov 11, 2020 | 2:27 AM
బీహార్‌లో బీజేపీ గెలిచింది కానీ.. అసలు కోరిక అలానే ఉండిపోయింది

కలగూరగంప రాజకీయాలంటూ కొన్నేళ్ల క్రితం కూటమి ప్రభుత్వాలను కామెంట్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు బీహార్‌ని చూస్తే అవి ప్రస్ఫుటం అవుతాయి. ఏపీ అసెంబ్లీలో 3 పార్టీలున్నాయి. తెలంగాణా అసెంబ్లీలో కూడా అంతే. కానీ ఇప్పుడు బీహార్ లో ఏకంగా 12 పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ కూడా గెలిచారు. దాంతో ఇక్కడ అధికారం పంచుకోవడం అంత సులువు కాదు. అందులోనూ సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదాకి ఒక్క సీటు తేడాలో ఆగిపోయిన బీజేపీ తన బలాన్ని నిరూపించుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.

వాస్తవానికి బీజేపీకి 74 సీట్లు, జేడీయూ కి 43 స్థానాలు వచ్చిన నేపథ్యంలో పెద్దన్న పాత్రలో బీజేపీకి పీఠం దక్కాలి. ఆపార్టీకి చెందిన సుశీల్ కుమార్ మోదీ వంటి వారు చాలాకాలంగా సీఎం పీఠం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తుంటే ఆయన వంటి వారికి మరికొన్నేళ్ల పాటు ఎదురుచూపులు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది. జేడీయూ సొంత బలం కోల్పోయినప్పటికీ కీలకంగానే ఉంది. ముఖ్యంగా బీజేపీకి ముఖ్యమంత్రి పీఠం కావాలంటే తమ మద్ధతు అనివార్యం అనే స్థాయిలో ఉంది. జేడీయూ కాకుండా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత బలం బీహార్‌లో లేదు. పోనీ మద్ధతు ఇచ్చే వారు కూడా లేరు.

దేశ రాజకీయాల్లోనే గడిచిన 3 దశాబ్దాలుగా బీజేపీకి దగ్గర కాకుండా నిలిచిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఆర్జేడీ మాత్రమే. లాలూ ఆది నుంచి బీజేపీకి శత్రుపక్షంలోనే సాగారు. అలాంటి పార్టీ బీజేపీతో జతగట్టే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా బీజేపీకి చాలాదూరంగా ఉంటారు. దాంతో అనివార్యంగా బీజేపీకి జేడీయూ మద్ధతు అవసరం. అయితే జేడీయూ తరుపున ముఖ్యమంత్రి పీఠంపై వరుసగా మూడు సార్లు కొనసాగుతూ, ఇదే నా చివరి ఎన్నికలు అంటూ ప్రకటించిన నితీష్ ని కాదని, తామే పీఠం దక్కించుకోవాలని బీజేపీ నేతలకు కొంత ఆశ ఉండవచ్చు. కానీ తాజా తీర్పు అలాంటి ఆశలు తీర్చేలా లేదు.

ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన అనుభవం ఉంది. ఎక్కువ స్థానాలు గెలిచిన తామే సీఎం పీఠం ఎక్కాలని ఆశించి కమలనాధులు బోల్తా పడ్డారు. ముంబై రాజకీయాలతో ఇప్పుడు సతమతం అవుతున్నారు. అదే పరిస్థితి బీహార్ లో ఎదురుకాకుండా బీహార్‌లో గణనీయంగా సీట్లు సాధించిన సంతృప్తి ఉన్నా సీఎం పీఠానికి చేరలేదనే అసంతృప్తితో సాగాల్సిన అవసరం బీజేపీకి కనిపిస్తోంది.

ఇప్పటికే బీజేపీతో జతగట్టిన మిత్రులు కుదేలవుతున్న నేపథ్యంలో జేడీయూకి కూడా అలాంటి అనుభవమే ఉంది. అదే సమయంలో తమకు వ్యతిరేకంగా చిరాగ్ పాశ్వాన్ ని ప్రోత్సహించింది కూడా బీజేపీ నేతలేనని జేడీయూ అనుమానిస్తోంది. దాంతో సీఎం పీఠం పై మరోసారి నితీష్‌ ని నిలబెట్టి, ఆయనకు కొమ్ముకాయడం మినహా కమలనాథులకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. దాంతో బీహార్ లో తమకు దక్కింది సంపూర్ణ విజయం కాదనే అసంతృప్తి బీహారీ బీజేపీ నేతలను తొలిచివేస్తుంది. కానీ రాబోయే కొన్నేళ్లలో అక్కడ కూడా ఎలాంటి మార్పులు జరుగుతాయన్నది చెప్పలేం.