ఒకప్పుడు అతనిని చూసి జనం పగలబడి నవ్వారు. తర్వాత అతని సిక్స్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. ఇంకెవరు…మన సునీల్ గురించే ఇదంతా. బెస్ట్ కమెడియన్ గా జనం హృదయాలతో పాటూ అవార్డులు కూడా కొల్లగొట్టాడు. ఇతని కొంప ముంచి తప్పుదోవ పట్టించిందల్లా ఇతనిలోని డ్యాన్స్.
హీరో అయితేనే ఆ ట్యాలెంట్ ప్రదర్శన చేసే అవకాశం. దాంతో ఎప్పటికైనా హీరో అయిపోవాలనే సరదా ఎక్కువైంది అతనికి. దీనికి తోడు రవితేజ మరొక కారణం అంటారు. చిన్నా చితకా వేషాలు వేసుకుంటూ స్టార్ హీరో అయిపోయిన రవితేజ తనకు ఇన్స్పిరేషన్నూ, కాంపిటీషన్నూ కూడా అంటారు కొందరు. దాంతో నెమ్మది నెమ్మదిగా “అందాల రాముడు” టైపులో కామెడీ హీరోగా కాకుండా మెయిన్ స్ట్రీం కమెర్షియల్ హీరో అవ్వాలనే ఆలోచనతో సన్నబడి సిక్స్ ప్యాక్ చేసాడు. ఏకంగా రాజమౌళి తీసిన మర్యాదరామన్నలో హీరోగా చేసే సరికి కాన్ఫిడెన్స్ పదింతలయ్యింది. సిక్స్ ప్యాక్ ప్రదర్శనతో రెండు మూడు సినిమాలు చేసాడు. కానీ జనం ఆదరించలేకపోయారు. సునీల్లో ఉన్న కామెడీ ట్యాలెంట్ అతనిలోని సీరియస్ హీరోని చాలా చిన్నగా చూపించింది.
ఇక వెనక్కి వచ్చెయ్యాలని కాస్త ఆలస్యం గానే నిర్ణయం తీసుకుని “అరవింద సమేత” లో మళ్లీ నాన్ హీరో క్యారెక్టర్లో కాసేపు కనిపించాడు. కానీ జనం నుంచి రెస్పాన్స్ కూడా కరువైంది. ఒకప్పుడు సునీల్ తెరమీద కనిపిస్తే ఈలలు మోగేవి. ఇప్పుడు అలా లేదు పరిస్థితి.
అతను హీరోగా ఉన్న టైములో వెన్నెల కిషోర్ పైకి ఎక్కేసాడు. సునీల్ వెయ్యాల్సిన రోల్స్ అన్నీ వెన్నెల కిషోర్ వేసేస్తున్నాడు. ఇప్పుడు అతనే స్టార్ కమెడియన్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు సునీల్ క్యరీర్ కి అతనే పెద్ద అడ్డు. అంటే సునీల్ ఇప్పుడు తన పూర్తి విశ్వరూపం బయటకు తీసి సత్తా చూపిస్తే తప్ప వెన్నెల కిషోర్ స్టార్డం ని ఎదుర్కోవడం కష్టం
సునీల్ ఈ సంక్రాంతికి “అల వైకుంఠపురంలో” లో కనిపించినా అస్సలు ప్రాముఖ్యత లేని పాత్ర అది. అది కూడా త్రివిక్రం చలవ వల్లే ఆ పాత్రలు అని అనుకుంటున్నారు కూడా కొందరు. ఇంతకీ సునీల్ కి పూర్వవైభవం వస్తుందా? రావాలనే అందరి కోరిక. తన గోదావరి యాస టైమింగుతో మళ్లీ మునుపట్లాగ నవ్విస్తాడని ఆశిద్దాం. అతని కోసం మన దర్శకులు మంచి కామెడీ ట్రాకులు రాయాలని కూడా కోరుకుందాం.