iDreamPost
android-app
ios-app

రాజధాని రైతులెవ్వరు , కూలీలెవ్వరు ?

  • Published Feb 22, 2020 | 9:09 AM Updated Updated Feb 22, 2020 | 9:09 AM
రాజధాని రైతులెవ్వరు , కూలీలెవ్వరు ?

ఈ రోజు ఈనాడు పత్రికలో ‘గుండె పగిలింది’ అనే శీర్షికతో వచ్చిన ప్రధాన వార్తను గమనిస్తే రాజధాని వికేంద్రీకరణ వలన భూముల గురించి , ఉపాధి పై దిగులుతో రైతులు , రైతు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు అని తీవ్ర విచారం వ్యక్తం చేసింది .

అంతే కాక ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 44 అని, అందులో వృద్ధాప్యం , అనారోగ్యంతో చనిపోయిన వారిని తీసివేస్తే కనీసం 28 మంది అయినా అయినవాళ్ళని అనాధలుగా చేసి వెళ్లిపోయారు అని ఓ లెక్క ప్రచురించింది .

ఈ చనిపోయిన 44 మంది ఎవరు ? .

అందులో కొందర్ని తీసివేసి అయినవాళ్ళని అనాధలుగా చేసి చనిపోయిన 28 మంది ఎవరు ? వీరిని రైతులు లేదా రైతు కూలీలు అని నిర్ధారణలతో ప్రచురించ లేదేందుకని? అసలు రాజధాని రైతులు అంటే ఎవరు ? ఆ రాజధాని ప్రాంత కూలీలు ఎవరు ?ఎవర్ని రైతులుగా , రైతు కూలీలుగా ఏ అంశాల ప్రతిపాదికన నిర్ణయించారు ? నిర్దిష్ట ఆధారాలతో ప్రచురించలేదు ఎందుకని ?

29 గ్రామాల పరిధిని రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో 2014 డిసెంబర్ లో రాజధాని ప్రకటించేనాటికి ఆ పరిధిలో వ్యవసాయం చేస్తున్న వారిని మాత్రమే రాజధాని రైతులుగా పరిగణించవచ్చు . దానికి ముందు , ఆ తర్వాత తమ భూములు అమ్ముకొని ప్రతిఫలం పొందిన వారిని రాజధాని రైతులుగా పరిగణించే అవకాశం లేదు . ఒకవేళ అలా అమ్ముకొన్న రైతులు మరో ప్రాంతంలో భూమి కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నా వారు రైతుగా పరిగణింపబడతారే కానీ రాజధాని రైతులు కారూ.. కాజాలరు .

అలాగే రాజధాని ప్రకటన నాటికి అక్కడి వ్యవసాయదారులపై ఆధారపడి కూలీ పనిలతో జీవనం సాగిస్తున్న వారు రైతు కూలీలుగానూ , వ్యవసాయ సంభంద వృత్తులు , కుల వృత్తులు నిర్వహిస్తూ జీవించేవారిని రైతు కూలీలుగా , ఉపాధి పొందేవారిగా ఎంచవచ్చు .

ఇప్పుడు ఈనాడు చెప్పిన 44 మంది మృతులు ఎవరు ? ఏ ఆధారాలతో వారిలో 28 మంది రాజధాని కోసం మరణించారు అని నిర్ధారించింది ? ఆ 28 మంది రైతులు లేదా కూలీలకు అత్యవసరంగా చనిపోయేటంతటి కష్టం వచ్చిందా? భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించకుండా నిలిపేశారని మరణించిన రైతులు ఉన్నారా ?ఉపాధి కోల్పోయిన కూలీలు అని గత టీడీపీ ప్రభుత్వం నిర్ధారించి ఇస్తున్న పెన్షన్ నిలిపివేశారని మరణించిన కూలీలున్నారా ?

ఒక ప్రాంత వ్యక్తుల మరణాల లెక్క గంపగుత్తగా తీసుకొని బాబు గారు , లోకేష్ లు 45 మంది అని , మరొక నాయకుడు 50 మంది అని ఒక్కోరు ఒక్కో రకంగా నోటికొచ్చిన సంఖ్య చెబుతుండగా ఈ రోజు ఈనాడు 44 మంది అంటూ ప్రకటించిన నిర్దిష్ట సంఖ్యలో వృద్ధాప్యంతో కొందరు , అనారోగ్యంతో కొందరూ , ప్రమాదవశాత్తు కొందరూ మరణించి ఉండగా , మిగిలిన వారు కనీసం 28 మంది అని వారు రాజధానికోసం మరణించినట్లు అని ఒక మరణం ఒక విలయం అని ఏ విధమైన ఆధారాలు లేకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా , ఏకపక్షంగా నిర్ణయించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోంది ఎందుకు ?

వీటన్నిటినీ బేరీజు వేసుకుని చూస్తే రాజధాని ఉద్యమం , ఎవరి వలన , ఎవరి కోసం , ఎవరి చేత నడపబడుతుందో అర్థం చేసుకోవచ్చు . ప్రజలు అసత్య వార్తలు ప్రసారం చేసే కొన్ని మీడియా సంస్థల్ని , వ్యక్తుల్ని నమ్మటం మానేసారని విస్తృత పరిధి కలిగిన పలు సోషల్ మీడియా వేదికలపై వార్తను చూసి నిజాన్ని నిర్ధారించుకొంటున్నారని అందువలన ఇలాంటి అసత్య వార్తా ప్రచారాలతో తమ విలువ మరింత దిగజార్చుకోవడమే తప్ప ఆశించిన అంతర్గత ప్రయోజనాలు నెరవేరవని గ్రహించి రాజకీయ ప్రయోజనాల మేరకు కాక విశ్వసనీయ , యధార్ధ వార్తలు ప్రచురించటం ఇప్పటికైనా పునఃప్రారంభిస్తే మీడియా విలువ మరింత దిగజారకుండా కాపాడుకోగలుగుతారు