ట్విట్టర్ ను వదిలి లోకేష్ బయటకు రాడా ? వైజాగ్ వెళ్ళే ఆలోచన లేదా ?

విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను కలవటానికి నారా లోకేష్ కూడా ఎందుకు ప్రయత్నం చేయటం లేదనే విషయంపై పార్టీలోనే చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు అంటే వయస్సయిపోయింది కాబట్టి అంత దూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేడని అనుకుందాం. అందుకనే ప్రత్యేక విమానంలో వెళ్ళటానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరుతు లేఖ రాస్తే అది కాస్త బుట్ట దాఖలా అయ్యిందట. సరే ఏదో కారణం చెప్పుకుని చంద్రబాబు హైదరాబాద్ లోని ఇంటినుండి అడుగు బయటపెట్టలేదు.

మరి కుర్రాడే అయిన లోకేష్ కు ఏమైంది ? లోకేష్ అంటే చంద్రబాబు ప్రతినిధే కదా . అధికారంలో ఉన్నపుడు అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను చక్రంతిప్పింది లోకేష్ కదా ? చంద్రబాబు వయస్సు 71 అయితే పుత్రరత్నం వయసు 37 సంవత్సరాలే కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే బయలుదేరి వైజాగ్ చేరుకుంటాడని పార్టీ నేతలు ఆశించారు. కానీ లోకేష్ కూడా చంద్రబాబు లాగే ఇంట్లోనే కూర్చున్నాడు.

లోకేష్ అంటే జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలిట్ బ్యూరో సభ్యుడో కాదు కాబోయే పార్టీ అధ్యక్షుడు కూడా. కాబట్టి మిగిలిన నేతలందరికీ ఆదర్శంగా ఉండాలంటే ముందు లోకేష్ ఇంట్లో నుండి అడుగు బయటపెట్టాలి. తెలంగాణా, ఏపి పోలీసులతో మాట్లాడుకుని పర్మిషన్ తీసుకుని వైజాగ్ చేరుకుంటేనే అందరూ మెచ్చుకుంటారు. బిజెపి అధ్యక్షుడు, వామపక్షాల కార్యదర్శులకు వైజాగ్ వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులు లోకేష్ కు ఇవ్వకుండా ఎందుకుంటారు ?

పార్టీ నేతలకు ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇటువంటి సమయంలో కూడా ట్విట్టర్ దాటి బయటకు రాలేకపోతున్నాడు. ప్రతిరోజు ఎవరో తయారు చేసిన పాయింట్లను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రమోట్ చేయటంతోనే బిజీగా గడిపేస్తున్నాడు. అదికూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయటానికి మాత్రమే పూర్తి సమయాన్ని కేటాయిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. బాధితుల ఫొటోలను ట్విట్టర్లో అప్ లోడ్ చూసుకుంటూ ప్రమాదాలన్నీ జగన్ హయాంలోనే జరుగుతున్నాయన్నంతగా బిల్డప్ ఇస్తున్నాడు. తమ హయాంలో ప్రమాదాలంటే ఏమిటో కూడా తెలీదన్నట్లుగా ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నాడు. కాబట్టి పనికిమాలిన ట్విట్టర్ ను వదిలిపెట్టేసి క్షేత్రస్ధాయిలో చేయాల్సిందేంటో ఆలోచిస్తే పార్టీ నేతలు కాస్త సంతోషిస్తారు.

Show comments