iDreamPost
iDreamPost
ఏడాదిన్నర క్రితం వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మరో కొత్త సినిమా లేక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా వెయిటింగ్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడి వచ్చే ఏడాదికి వెళ్లిపోవడంతో మొత్తం మీద రెండేళ్లకు పైగా నిరీక్షణ భరించక తప్పదని అర్థమైపోయింది. రాజమౌళి మూవీ కాబట్టి ఈ మాత్రం సర్దుబాట్లు తప్పవు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఎవరితో సినిమాలు చేస్తాడనే దాని మీద పూర్తి స్పష్టత రావడం లేదు
ఇవాళ త్రివిక్రమ్ తో చేయబోయే 30వ సినిమా గురించిన ప్రకటన రానుంది కాబట్టి ఆ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కానీ 31 నుంచే సందేహాలు ఉన్నాయి. మొన్నటిదాకా మైత్రి బ్యానర్ లో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ చిత్రం ఉంటుందని టాక్ వచ్చింది కానీ కథ విషయంలో అండర్ స్టాండింగ్ కుదిరి సెట్స్ కు వెళ్ళడానికి చాలా టైం పట్టేలా ఉంది. అందులోనూ కెజిఎఫ్ 2 రిలీజయ్యే దాకా ప్రశాంత్ నీల్ ఫ్రీ కాడు. ఇటీవలే అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తారక్ కు ఓ స్టోరీ చెప్పాడని అయితే బదులు ఏమొచ్చిందో తెలియదని మీడియాలో గట్టిగానే వినిపించింది. కానీ హీరో దర్శకుడు ఇద్దరి సైడ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
వీళ్ళను పక్కన పెడితే తెలుగు నుంచి కొరటాల శివ లైన్ లో ఉన్నాడట. చిరంజీవితో తీస్తున్న ఆచార్య(రిజిస్టర్డ్ టైటిల్) పూర్తి కాగానే తారక్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు రెడీ చేసి పెడతాడట. జనతా గ్యారేజ్ నుంచే ఈ ఇద్దరికీ మంచి ర్యాపో ఉంది. విజయ్ తో మూడు బ్లాక్ బస్టర్స్ తీసిన ఆట్లీ కూడా తారక్ మీద ఆసక్తి చూపిస్తున్నాడు కానీ అతన్ని షారుఖ్ ఖాన్ లాక్ చేసేయడంతో ఇప్పట్లో ఛాన్స్ లేదు. ఇదంతా చూస్తుంటే ఆర్ఆర్ఆర్, త్రివిక్రమ్ సినిమాలు కాకుండా జూనియర్ తర్వాత ఏ దర్శకుడికి ఆఫర్ ఇస్తాడనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.