iDreamPost
android-app
ios-app

ఆర్థిక ఎమర్జెన్సీ సమయంలో ఏమి జరుగుతుంది..

  • Published Mar 30, 2020 | 6:38 PM Updated Updated Mar 30, 2020 | 6:38 PM
ఆర్థిక ఎమర్జెన్సీ సమయంలో ఏమి జరుగుతుంది..

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా సాగుతోంది. అందులో భాగంగా ఏకంగా ఆర్థిక ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతో అసలు ఆర్థిక ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరుగుతోందనే చర్చ మొదలయ్యింది.

దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీ కి అవకాశం ఉంది. ఆర్టికల్ 360 ప్రకారం దాన్ని ప్రకటిస్తారు. అమలులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి మొత్తం ఆర్థిక వ్యవహారాలు మళ్లుతాయి. రాష్ట్రపతి సహకారంతో అన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కుతుంది. చివరకు ఉద్యోగుల వేతనాలు తగ్గింపు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా రాజ్యాంగం ప్రకారమే కేంద్రానికి దఖలు పరుచ బడుతుంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలు కేంద్రం నిర్ణయించిన దానికి అనుగుణంగా చేపట్టాల్సి ఉంటుంది.

ఆర్బిఐ నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళుతుంది. తద్వారా నగదు ముద్రణ సహా అన్ని విషయాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో ఆర్థిక సంవత్సరం విషయంలో పొడిగింపు లేదా కుదింపు వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఆర్టికల్ 207 లోని నిబంధనలు ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తరువాత రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేయటానికి వర్తించే అన్ని మనీ బిల్లులు లేదా ఇతర బిల్లులు కేంద్రం ఆమోదం తోనే అమలవుతాయి.

ఆర్థిక ఎమర్జెన్సీ ఎందుకు

దేశం యొక్క ఆర్ధిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని భావించిన సమయంలో లేదా దేశానికి ప్రమాదం ఉందని భావిస్తే రాష్ట్రపతి కేవలం ఒక ప్రకటన ద్వారా ఆర్థిక ఎమర్జెన్సీ అమలులోకి తీసుకు రావచ్చు. ప్రకటన చేయవచ్చు. రెండు నెలల లోపు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం అవసరం. ప్రస్తుతం మోడీ ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాదనే అభిప్రాయం ఉంది. దాంతో ఇలాంటి కీలక ప్రకటన అనివార్యం అనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఆర్థిక ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తరుణంలో సమస్త అర్థిక వ్యవహారాలు కేంద్రం చేతుల్లో ఉంటాయి. కీలకమైన పన్నులు, ఇతర రాయితీలు వంటి వాటి విషయంలో యధేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాముంది. గతంలో దేశంలో ఇందిరా గాంధీ పాలనలో 1975 లో ఎమర్జెన్సీ అమలు అయ్యింది. ప్రస్తుతం ఆర్థిక ఎమర్జెన్సీ ముందుకు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది చూడాలి